Telugu Global
Arts & Literature

గాయాలు ఒకరివి.. ప్రయోజనాలు ఒకరివి

గాయాలు ఒకరివి.. ప్రయోజనాలు ఒకరివి
X

ఈ సిగ్గులేని అవమాన అత్యాచార భారతంలో ఆడవాళ్ళ ఆత్మ రక్షణ ఇన్నాళ్లపాటు కారం పొట్లాలతోనో , కరాటే తన్ను లతోనో జరిగిపోతుం ది అంటే కాదనకుండా విన్నాం . ఇప్పుడు ముఖానికి తగిలించుకునే గుడ్డ ముక్కలతోనే జరుగుతుంది అంటే ఔను అనే గొంతులు వినిపిస్తున్నాయి . మనం ఎన్ని గుడ్డలు చుట్టుకోవాలో అవతలి వాళ్ళు గుడ్డలిప్పుకుని చెబుతుంటే ఏమనిపిస్తోంది ?

........

చాలా రోజుల తర్వాత ఇవాళ యోగా ప్రాక్టిసు కి వెళ్ళాను. ఆర్ధరాత్రయిందాకా కంప్యూటరు ముందు కూచుండి పోవడమూ, ఆలస్యంగా నిద్ర లేవడమూ జరిగిపోతూ ఈ మధ్య అటు వెళ్లడమే పడలేదు.. గ్రౌండులో వాళ్ళీద్దరూ కనిపించారు..

మీరు పర్వీనా బేగమ్ కదా అడిగాను , అందులో ఒకర్ని గుర్తుపట్టి... . ( రెండో ఆవిడ పేరు ఏదో వుండాలి. వాళ్ళీద్దరూ తోటికోడళ్లని మాత్రం తెలుసు. )

ఔను తలూపుతూ నవ్వింది పర్వీనా.

సరిగ్గా నెల క్రితం అనుకుంటా ఇద్దరు మగవాళ్ళు వీళ్లని తీసుకొచ్చి. " ఇదిగో ఈ లావు తగ్గించడానికి ఏం చెయ్యాలో అవి నేర్పుతారా.." హిందీ లో అడిగారు.

"ప్రయత్నిద్దాం, రోజూ వచ్చేలా చూడండి, " మా గురువు. అలవాటుగా హామీ ఇచ్చాడు.

అప్పటి నుంచీ భర్తల వెంట రోజూ రావడం మొదలు పెట్టారు. మొదట్లో ఇద్దరూ చాలా ఆయాస పడుతూ వొంగలేక, కూచోలేక అవస్థ పడేవారు.. అభ్యాసము కూసు విద్య - కాబట్టి ఇప్పుడిప్పుడు కొద్దిగా నయంగా వున్నట్టు నాకు అనిపించింది. శ్వాసక్రియ సంబంధిత వ్యాయామాల్లో హసనం అని ఒక ప్రక్రియ వుంటుంది. . హసనం అంటే నవ్వడం అన్నమాట. ... పగలబడి గట్టిగా అందరూ ఒకేసారి నవ్వాలి ... నవ్వడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం జరుగుతుంది. మెదడులోని కణజాలం ఉత్తేజితమవుతుంది. కంఠనాళాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాసక్రియ శుద్ధి అవుతుందని విన్న పాఠాలు కంఠతా వచ్చాయి... .కాబట్టి చాచా నెహ్రూ పార్కు దద్దరిల్లిపొయేలా అందరం నవ్వుని అభ్యసిస్తాం. వాళ్ళిద్దరూ అప్పుడు నవ్వరు.. ఏవో గుసగుసలు చెప్పుకుంటూ వుంటారు. . అన్నిటికంటే తేలి్కయిన .శవాసనం వేసినప్పుడు కూడా కాళ్ళూచేతులూ విశాలంగా చాపరు.. .. శ్వాసమీద ధ్యాస పెట్టలేక ,మూత పడిన రెప్పలవెనక కంటి పాపలు అసహనంగా కదులుతూ వుంటాయి. . . ఊపిరి వేగంగా పీల్చి వదిలే వ్యాయామం చేసేటప్పుడు మాత్రం ముఖానికున్న పరదా బుస కొడుతున్నట్టూగా కదులుతుంది. కళ్లకోసం అమర్చిన కంతల్లోంచి చూపులెప్పుడూ అంతదూరాన క్రికెట్ ఆడుతున్న భర్తల వేపు పరిగెడుతూ వుంటాయి. అంటే వీళ్ళ శరీరాల్ని, హావభావాల్నీ రిమోట్ చేసే శక్తి అక్కడుందన్నమాట.. నిజానికి ఆ భర్తలు వీళ్లని కాపలా కాయడానికి రాకపోవచ్చు, . అయినా సరే ఇంట్లో చెలామణీ అయిన అయిన అధికార సంబంధం రోడ్డుమీద కూడా నెత్తికెక్కి నోటికి తాళం వేస్తుంది.. చిత్రమేమిటంటె చాలా మంది ఆడవాళ్ళు దీనికి సానుకూలంగా వాదిస్తారు.. . తమ భద్రత కోసమే కదా భర్తలు అంత బాధపడుతున్నది అనుకుంటారు. ఆ మాటకొస్తే వాళ్ల దృష్టిలో పొద్దున్నే పొయ్యి మీద రొట్టెలు కాల్చాల్సిన వాళ్లని ఆరుబయట వ్యాయామానికి తీసుకురావడమే పెద్ద అభ్యుదయం .

మనకోసంలాగా కనబడుతున్న విప్లవాల్లో ప్రయోజనాలు మన కొంగుకే ముడిపడుతున్నాయా, అవతలివాళ్ల జేబులోకి వెడుతున్నాయా అనేది ఎలా తేల్చుకోవాలో మనకింకా చాతకావడం లేదు. . పర్వీనా బేగంనీ, ఆవిడ తోటీకోడల్నీ వాళ్ల భర్తలెందుకు అందరిలోకీ తెచ్చారు ?. వ్యాయామం చేయించడం ద్వారా సన్నబరచి అందంగా తయారు చేసుకుంటే పక్కన నడవడానికి బావుంటారు. ఇల్లులాగా, పొలంలాగా, కొత్త కారులాగా ఎవరికైనా చూపించుకోవడానికి బావుంటారు. పనిలొనూ, పడకలోనూ చురుకుగా వుంటారు. తమ అహంకారాన్ని అణకువతో పోషిస్తారు. కాదంటారా..?

ఉదాహరణకి పరదా విషయమే చూద్దాం. . పరదా గురించి ఏ స్త్రీ మాట్లాడినా సరే పలుగులూ పారలూ లేస్తున్నాయి. దానిమీద అటు మత పెద్దలో , ఇటు పారిశ్రామిక విప్లవ పెద్దలో మాత్రమే ఆలోచన చేయాలి. మనకసలు ఏ అర్హతా లేదు. 1935 లో ఇరాక్ ప్రభుత్వం ముస్లీం మహిళల ముఖాలమీద పరదా తీసెయ్యడం ద్వారా స్వేచ్చ విధించాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అప్పుటికప్పుడు తమ కంపెనీలో చవగ్గా పని చెసే కార్మికులు కావాల్సి వచ్చారు. స్రీలకంటే ఓపికగా ఎవరు పనిచేస్తారు..? అందుకని మత చాందస భావజాలంతో ఇళ్ళలో మగ్గిపోయేవారికి ఆటవిడుపు ఇచ్చినట్టూ వుంటుంది. ఆర్హ్దిక స్థాయి పెంచినట్టూగానూ కనిపిస్తుంది. పొరుగు దేశమైన టర్కీ నాగరికతతో పోటీపడినట్టుగానూ వుంటుంది. ఒక దెబ్బకి అనేక పిట్టలు..అని ఆలోచన చేసింది. రాత్రికి రాత్రి వచ్చిన ఈ ఆలోచన అమలులో పెట్టడానికి ఎంత హింస ప్రయోగించారో తెలుసుకుని తీరాలి. .రోడ్డుమీద నడుస్తున్న మహిళల ముఖాలమీద పరదాల్ని పోలీసులు లాఠీ కొసలతో లాగి కింద పడేశారు. అదేమిటంటే “ముట్టుకు౦టే వూరుకూంటారా మరి” అని వెటకరించారు. అనేక మంది ముఖాలకు గాయాలయ్యాయి. . కొందరికి కళ్ళు పోయాయి.

అప్పుడు కుటుంబాలు ముల్లాలతో కూడి ఒక ఆలోచన చెశారు. అదేమిటంటే , " మా వస్త్ర ధారణ మాది . ఇందులో ప్రభుత్వ జోక్యం కనక వున్నట్టయితే ఆత్మాహుతికి కూడా వెనకాడం " అని నినాదాలు రాసి స్త్రీలతో నిరసన చేయించారు. . నాగరిక రాజ్యం విధించిన నిర్బంధ హింసా పూరిత స్వేచ్చ కంటే , తమ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నుంచున్న మతపెద్దలు ఎంతో దయార్ద్ర హృదయులు అని భావించిన స్రీలు కళ్లకద్దుకుని వాటిని మళ్ళీ గర్వంగా ముఖాలకు తగిలించుకున్నారు. కానీ అదే ఫ్రాన్సు నాగరికతా ప్రభావంతో స్వేచ్చాయుత వస్త్రధారణకీ, భావ ప్రకటనలకు అలవాటు పడుతున్న కొందరు కాలేజీ విద్యార్ధినులు మాత్రం ఇందుకు ఎదురు తిరిగి మత పెద్దల కోపానికి గురయ్యారు. వీరిపై తిరిగి దుండగులు రాళ్ళూ విసరడాలు, యాసిడ్ చల్లడాలు జరిగాయి. చివరికి గాయపడ్డ వారిలో పరదా లేని యువతులకి వైద్యం చెయ్యడానికి కూడా ఎవరూ ముందుకు రానంత ఉద్రిక్తత నడిచింది...

తల్లీ బిడ్డలు, అక్కాచెల్లెళ్ళు, అత్తాకోడళ్ళు, వదినా మరదళ్ళు ,ఇరుగు పొరుగు వాళ్ళూ అందరూ పరదా కారణంగా విడిపోయారు. . మతం పేరిట రూప్ కన్వార్ని సతీసహగమనం చేయించినందుకు మహిళా సంఘాలు ఎదురు తిరిగితే , దేవరాల గ్రామంలోని చిన్నాపెద్దా ఆడవాళ్లందరూ ఏమని ఆందోళన చేశారో గుర్తుందికదా....? "మా భర్తలతో బాటు తగలబడే హక్కు మాకుంది. మా హక్కుని కాలరాయకండి" అని కదా... కాబట్టి ఆడవాళ్ళు తమ కోసం చేసే హక్కుల ఉద్యమాల కంటే - అణచివేసుకోవడానికి పూనుకునే త్యాగపూరిత ఉన్మాద చర్యలద్వారానే బాగా అదరణ అందుకుంటారు.

పరదా అనేది. ముఖానికి తగిలించుకోవడం వల్ల ఏ దేశ గౌరవాన్ని, మతాన్ని, సంప్రద్రాయాన్ని తమ స్త్రీలు ఉద్దరించాలని పౌరులందరూ భావిస్తారో అదే చర్య వారిని ఇంకో చోట దేశ ద్రోహులుగా చూపెడుతోంది. ఇప్పుడు . ఫ్రాన్సులో జరుగుతున్నది అదే. పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న ఇమిగ్రెంట్ ముస్లీం మహిళలు పరదా ధరించడానికి వీల్లేదని , అది దేశ విభజనని గుర్తుకు తెస్తుందని, ఈ నిబంధన ఉలంఘించిన వారికి ఫ్రెంచి పౌరసత్వం

రద్దుచేయబడుతుందని ప్రకటన ఒకటి గత ఏడాది వచ్చింది.. పార్లమెంటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరేనా అలా కనిపిస్తే నూట యాభై యూరోల నష్టపరిహారం చెల్లించాలని, నాగరికత విలసిల్లే తమ ఫ్రెంచి దేశ చరిత్ర చదువుకుని ,పరీక్షలు రాసి తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాలని తద్వారా మాత్రమే అక్షరాస్యులుగా గుర్తించబడతారని ఆజ్ణ జారీ

చేయబడింది.

ఏమనిపిస్తొందిప్పుడు..?

నాకు తోచిన సారాంశం ఏమిటంటె, . ఏ కొలతలతో వుండాలో అలా వుండలేకపోతున్నందుకు కౄంగిపోయే శరీరాలు మనవి కావు. వాటిని ఎంత మేరకు కప్పాలొ , ఏ గడ్డమీద అయితే విప్పాలో నిర్ణయించి పెట్టిన విలువలు మనవి కావు. . కరుడు కట్టిన షరియత్ నుంచి, రేటు కట్టిన అంగడి దాకా ఎటుచూసినా హింస, అవమానం, ఏం జరుగుతోందో తెలీని అయోమయం .. అవును అంతిమంగా ఇవే ఇక్కడమిగిలాయి.

First Published:  12 Jan 2023 10:16 PM IST
Next Story