నా స్వామి ..! ( పద్య కవిత)
BY Telugu Global26 Jun 2023 7:39 PM IST
X
Telugu Global Updated On: 26 Jun 2023 7:39 PM IST
సాత్వికతను జూప
జవటగా నెంతురు!
రజము జూపినంత 'రౌడి'యంద్రు!
తమము జూపు వారి తలదన్ని పోదురు!
స్వామి!కష్టమయ్యె బ్రతుకు!గనవె!
నాటి రాక్షసులను నలిపి వేసితివయ్య!
కలియుగాన నేడు తెలివి మీరి
యున్న వారి దునుమ కున్న కారణ మేమి?
వారి కంటె ఘనుల?వీరు స్వామి!
నల్గురున్న యట్టి నాదు సంసారమ్ము
నడుపుచుండి నేను నలిగి పోదు!
స్వామి !నీవు జూడ బహుళ సంసారివి!
ఎంతగ నలిగెదవొ? చింత జేతు!
కోట్ల కొలది ప్రజకు కోట్ల సమస్యలు
గలుగ జేసి తీర్చ గలవు స్వామి!
ఎంత కష్ట పడెదొ?ఇన్ని సమస్యల
కల్పనమ్ము జేయు కష్ట మేల
నీవు గానబడగ నేను గుర్తించెడు
విధము దెల్పు స్వామి!విశ్వరూప!
పిదప వగచకుండ మొదటె వేడుచునుంటి;
పలుకరించవయ్య!పులకరింతు!
తల్లి తండ్రి గురువు తరువాత నీవని
పలుకు చుంద్రు గాని వారియందు
నిన్నె గంటినేను,నీ కరుణను గంటి!
అర్థమయ్యె స్వామి!అన్ని నీవె!
- కోడూరి శేషఫణి శర్మ
Next Story