అదృష్టమా -- కష్టపడటమా !
మాది రాయలసీమ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదు. ఇప్పటికీ సిరిసంపదలతో కళకళలాడుతూ తులతూగుతూ రత్నాలతో నిండి ఉన్న సీమ. ఈ సీమ లో ఇప్పటికీ చాలాచోట్ల రత్నాలు దొరుకుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే కొంత మంది చాలా దూర ప్రాంతాల నుండి కూడా రత్నాల కోసం సీమకు వస్తూ ఉంటారు. వర్షం వస్తే చాలు కోకొల్లలుగా వజ్రాల వేటలో మునిగేందుకు వచ్చేస్తుంటారు,
అలా వచ్చు వారిని ఇదేమీ ఇలా వచ్చారు అని ప్రశ్నించగా, వజ్రాల కోసం వచ్చాము అని సమాధానం ఇచ్చే వారెందరో. సమయం వృధా చెయ్యడం తప్ప మరొక్కటి లేదుగా అని మనం అంటే, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాము, అదృష్టం ఉంటే దొరకచ్చు కదా అని సమాధానం చాలా మంది ఇచ్చారు.
ఇలా చాలా మంది చాలా రోజులు వస్తూనే ఉంటారు, అంటే మరీ ముఖ్యంగా ప్రతి వర్షాకాలంలో మొదటి వర్షం పడింది అంటే చాలు ఆలుమగలు, పిల్లాపాపలు ముసలోల్లు అందరూ సద్ది కట్టుకుని పొలాల్లో వజ్రాల వేటలో నిమగ్నమై పోతారు. చాలా ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడే ఉంటారు కాబట్టి అక్క డే ఎవరో ఒకరు చిన్న హోటళ్ళు లాగా తయారు చేసుకుంటారు, ఇది ఒకరకమైన బ్రతుకు తెరువు అనవచ్చును. వచ్చిన వారి నుండే కాకుండా అక్కడక్కడే ఉన్న ప్రజలు కూడా ఆ హోటల్లో భోజనం చేయడం, టీ లు త్రాగటం మామూలే,
అయినా వజ్రాల వేట మొదలైనప్పటి నుంచి వాళ్ళకు ఆదాయం చాలానే వస్తుంది, ఒకరకంగా చెప్పాలంటే వారికి పని కూడా కల్పించినట్లుగా ఉంటుంది అనుకోండి, మేము ఇక్కడే ఉన్నపటికీ కూడా మాకు పని ఉండటం వలన ఇలాగ వజ్రాలు అవి ఇవి అంటూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే మా పొలాల్లోనే చాలా పనులు ఉంటాయి కాబట్టి మా పొలంలోని పనులు పూర్తి చేయడానికి మాకు సమయం తీరికా ఉండదు కావున మా పొలం పనులు చేస్తూ కాలాన్ని కొనసాగించే వాళ్ళం మేము.
ఒక రోజు నేను మా పొలం పనులకు వెళ్తుండగా "ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా ?చాలా మంది ప్రజలు ఇక్కడే ఉంటున్నారు కదా వజ్రాల అన్వేషణ కోసం "అని అడిగాడు ఒకాయన, అపుడు నేను "దొరుకుతాయి"అని చెప్పి వెళ్తుండగా, ఆయన "కొంచం ఉండు నీతో మాట్లాడాలి "అన్నాడు. సరే అని ఆగితే "నీవు పనికి ఎందుకు వెళ్తున్నావు వచ్చి వజ్రాల కోసం వెతుకు "అని చెప్పాడు. "నిజంగానే వజ్రాలు ఇక్కడ ఉన్నాయి కానీ మనకు ఖచ్చితంగా లభిస్తాయి అనే నమ్మకం నాకు లేదు, అందువలనే నేను నా పొలం పనుల నిమిత్తం వెళ్తున్నాను "అన్నాను. "అలా కాదు ఖచ్చితంగా మనకు అదృష్టం ఉంటే వజ్రాలు దొరుకుతాయి నీవు కూడా ఒక్క సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాలను వెతకటం మొదలు పెట్టు "అన్నాడు ఆయన.
"ఒకవేళ నాకు వజ్రం దొరకపోతే నాకు సమయం వృధా అవుతుంది కదా మరి ఆ సమయాన్ని వృధా చేయకుండా పని చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సత్ఫలితం వస్తుంది కదా "అన్నాను నేను. "అలా కాదు ఒక్క సారి నీకు వజ్రం కంటపడితే నీవు జీవితాంతం కష్టపడకుండా జీవించవచ్చుకదా ఒక్క సారి ఆలోచించండి" అన్నాడాయన.
అపుడు నేను "సరేగాని ఒక జరిగిన సంఘటన గురించి చెప్పుతాను వినండి తరువాత మీరు మీ పని చేసుకోండి ఆపై మీ ఇష్టం "అంటూ మొదలు పెట్టాను,
"మా గ్రామానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. వారిరువురూ మంచి స్నేహం బంధం కలిగినవారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో మంచి మిత్రులయ్యారు, అంతే కాకుండా ఒకరినొదలి మరొకరు ఉండటం చాలా కష్టం. కష్ట సుఖాలు ఇరువురూ పంచుకునేవారు. ఒక్కరు బాగా కష్టపడే తత్వం కలిగినవారు, మరొకరు పని చేసినా, చేయకపోయినా డబ్బులు రావాలి అని ఆలోచించే మనస్తత్వం కలిగిన వ్యక్తి, అంటే అదృష్టం అంటూ తిరిగే మనిషి అన్నమాట మీకులాగ. కష్ట పడే తత్వం ఉన్న మనిషికి ఎప్పుడు కూడా కష్టం మీద ధ్యాస తప్పితే వేరే దానిపైన ధ్యాసే ఉండేది కాదు. మన అదృష్ట వ్యక్తి మాత్రం ఎప్పుడు అదృష్టం వరిస్తుందా అంటూ ఎక్కువగా ఆలోచించేవాడు. ఇలాంటి వ్యక్తి వర్షాకాలంలో వర్షం పడింది అంటే ఎలా ఊరికే ఉంటాడు, వెంటనే వెళ్ళి పొలాల్లో వజ్రాల వేట జరపడా ?ఖచ్చితంగా జరుపుతాడు. ఇలా ఒక రోజు రెండు రోజులూ కాదు చాలా రోజులు అంటే కొన్ని సంవత్సరాలు అన్నా కూడా అతిశయం కాదు. ఇలాంటి వ్యక్తికి దేవుడు కూడా వరమివ్వా లి అనుకున్నాడేమో కానీ, అనుకోకుండా ఈయన కోరిక మేరకు ఒక రోజు ఇతడికి వజ్రం దొరికింది.
ఈ విషయాన్ని తన మిత్రుడు అయిన కష్ట జీవితో కూడా పంచుకున్నాడు. వారిద్దరూ కలిసి ఆ వజ్రాన్ని 4 లక్షల 50 వేలకు అమ్మేశారు. అదృష్టం వరించింది అని ఉన్న అప్పులు అన్నీ కట్టేశాడు. తరువాత మిగిలిన డబ్బుతో జల్సాలు చేయసాగాడు.
ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి, బద్ధకస్తుడుగా అంటే ఆంబోతు కంటే ఘోరంగా పొగరుతో నిండి అజ్ఞాన వంతుడుగా తయారు అయ్యాడు. కొన్ని రోజులకే ఉన్న డబ్బు అంతా అయిపోయింది. మన కష్ట జీవి మాత్రం కష్టాన్ని నమ్ముకున్నందుకు ఎంతో కొంత డబ్బును సంపాదించి కూడబెట్టాడు. మరి మన కష్ట జీవి మిత్రుడు మాత్రం మరలా అదృష్టం అంటూ మొదటికి వచ్చాడు. మరలా అప్పులు మొదలు అయ్యాయి. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బు రూపాయి అయినా కూడా దానిలో యాభై పైసలు మాత్రం ఖర్చు చేసి మిగిలిన యాభై పైసలు కాకపోయినా ముఫై పైసలు అయినా కూడబెట్టాలి అప్పుడే డబ్బు మనదగ్గర నిలబడుతుంది, కానీ ఉన్నదంతా ఖర్చు చేసి నాకు ఏమి మిగలలేదు అంటే కష్టం కదా ఈ విషయం మన అదృష్టం అని తిరిగే వ్యక్తికి తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించి మరోమారు దర్గతి పాలు అయ్యాడు.
మన కష్ట జీవి మాత్రం మంచిగా పనులు చేస్తూ కష్టపడి ఇల్లు కట్టి ఒక స్థాయికి చేరుకున్నాడు. అదృష్టాన్ని కోరుకునే వ్యక్తి కష్ట జీవికి మిత్రుడు కాబట్టి వచ్చి మన కష్ట జీవిని "కొంత డబ్బును అప్పుగా ఇవ్వు, తరువాత తిరిగి చెల్లిస్తా" అని చెప్పాడు. అపుడు మన కష్ట జీవి "సరే ఇస్తాను గానీ చిన్న షరతు ఉంది, దానికి నువ్వు ఒపుకుంటేనే ఇస్తాను "అని చెప్పాడు. అపుడు చేసేది ఏమీ లేక "సరే చెప్పు చేస్తాను "అని చెప్పాడు. అపుడు మన కష్ట జీవి "నీకు కావలిసినంత డబ్బును ఇస్తాను కాకపోతే నీవు అదృష్టం అంటూ కాకుండా పనికి వెళ్తాను అంటేనే ఇస్తాను "అని షరతును విధించాడు.
అపుడు సరే అని చెప్పి తీసుకున్నాడు మన అదృష్టం అంటూ పట్టుకు తిరిగే వ్యక్తి.
అప్పటి నుంచి ప్రతి రోజూ పని చేయడం మొదలు పెట్టాడు. తన మిత్రుడు ఇచ్చిన ధనంతో అప్పుని తీర్చేసిన తరువాత తను తన కష్టంతో తన అవసరాలను తీర్చుకుంటూ కొంత కొంత డబ్బును సంపాదించడం మొదలు పెట్టాడు, దానితో పాటుగా కూడబెట్టడం అలవాటు చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన మిత్రుడుకి డబ్బు ఇవ్వాలని వెళ్ళాడు. అపుడు తన మిత్రుడు "నాకు ఈ డబ్బు అవసరం లేదు, నువ్వే ఉంచుకో నీలో మార్పు తీసుకురావాలి అని నీకు షరతును విధించాను, నీకు ఆ డబ్బును ఉచితంగానే ఇచ్చాను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని "చెప్పాడు.
ఆ మాటలు విన్న మిత్రుడు చాలా సంతోషించాడు అనీ నేను చెబుతూ ఉంటే"" ఒకాయన జరిగిందంతా బాగుంది కానీ ఆ మిత్రుల పేర్లు చెప్పలేదు "అన్నాడు. అపుడు నేను అదృష్టం అంటూ తిరిగే ఆయన పేరు దేహరాజు, కష్ట జీవి పేరు బుద్ధి రాజు అని చెప్పాను.
అపుడు ఆయన నాకు అర్థం కాలేదు అన్నాడు. అపుడు నేను నీకు అర్థం కాలేదా!రెండూ నేనే నా శరీరం ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది, నా బుద్ధి మాత్రం "పని చేసుకొని బ్రతుకురా "అని చెప్పుతుంది, "అసలు నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏమి అంటే అదృష్టం అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వేతుకుంటూ వచ్చి చేరేది అసలైన అదృష్టం, అదృష్టం పేరుతో పని విడిచి, ఇల్లు కుటుంబం విడిచి, సోమరులుగా తయారు అవుతున్నారు అందుకనే ఈ సంఘటన చెప్పాల్సి వచ్చింది అని. తరువాత మీరు అనుకున్నట్లు అసలు నాకు డబ్బును నా బుద్ధి ఇవ్వలేదు .ఆత్మ స్థైర్యాన్ని మాత్రమే ఇచ్చిo ది .నాలోని కష్ట జీవిని నిద్ర లేపింది. నేను కూడా మీ కంటే ఎక్కువగా అదృష్టం అంటూ తిరిగిన వాడినే అని చెప్పిన వెంటనే, ఆయన మరి మాకు ఎందుకు చెప్పుతున్నావు ఇదంతా అని అడిగాడు.
అపుడు "నేను నువ్వు చేసే పని నీతి, నిజాయితీగా ఉంటే ఈ విశ్వం అంతా నీకుసహకరిస్తుంది, దేవుడి స్వరూపమైన ప్రకృతి కూడా నీకు అండగా నిలిచి, అదృష్టంగా మారి దాని అంతట అదే వచ్చి చేరేలా చేస్తుంది, అంతే కానీ అదృష్టం అంటూ నువ్వు వెంట పడితే అది పారిపోతుంది "అని చెప్పి నేను నా పని చేసుకోవటానికి వెళ్లి పోతుండగా, నా మాటలు విన్న ఆయన "ఈ రోజు వచ్చాము కాబట్టి ఇదొక్క రోజు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాము "అని చెప్పాడు.
సరే అని నేను వెళ్ళిపోయాను. ఆయన తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడ పని చేయడం మొదలు పెట్టాడు. ఒక్క సంవత్సరంలోనే వ్యవసాయం చేసి చాలా దిగుబడిని తీసి లక్షల మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాడు.
మొత్తానికి మనకు అదృష్టం అనేది ఉంటే చిరునామా అడుగుకుంటూ ఎలాగోలా వచ్చి మనలను చేరుతుంది కానీ, కష్టపడకుండా పని చేయకుండా ఉండటం వలన ఉన్న అదృష్టం కూడా పోతుంది, కష్టే ఫలి అంతే కానీ సుఖంగా ఉండి అదృష్టాన్ని నమ్ముకుంటే చివరకు మిగిలేది బూడిదే అనే వాస్తవాన్ని గ్రహించాడు కాబట్టే పని చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన.
- కొడాలి శివకృష్ణ