చెలిమితోడ

మనసు కలిగి మసలు మనిషెపుడు ఘనుడు
మనసు లేని వాడు మ్రాను గాదె
మనసు గెలువ నువ్వు మసులుకో మిత్రమా
చేర బిలువు నన్ను చెలిమితోడ.
మమత లెపుడు నీకు మంచినే యిచ్చును
మమత లేని చోట మంచి లేదు
మమత కోరు వాడె మనిషిగా బ్రతుకును
చేర బిలువు నన్ను చెలిమితోడ.
చెలిమి అనిన నిజము చెంగల్వ పూదండ
చెలిమి లేని చోట సమత లేదు
చెలిమి నీకు యిచ్చు శతకోటి శుభములు
చేర బిలువు నన్ను చెలిమితోడ.
చెలిమి అనిన నిజము చెంగల్వ పూదండ
చెలిమి లేని చోట సమత లేదు
చెలిమి నీకు యిచ్చు శతకోటి శుభములు
చేర బిలువు నన్ను చెలిమితోడ.
సమత వున్న గాని సౌఖ్యమే వుండదు
మమత సమత లిచ్చు మనకు రక్ష
సమత యిచ్చు కాంతి జగమంత నిండుగా
చేర బిలువు నన్ను చెలిమితోడ.
కులము ఎపుడు కాదు కూటి కన్న ఘనము
కులము నిన్ను కాపు కాయ దెపుడు
కులము నెట్టు నిన్ను కూపాల లోనికి
చేర బిలువు నన్ను చెలిమితోడ.
నడత నేర్పు గురువు నాద బ్రహ్మ మనకు
నడత తెలుపు తల్లి ఆది గురువు
నడత నిచ్చు తండ్రి నాకెంతొ ఇష్టము
చేర బిలువు నన్ను చెలిమితోడ.
సత్య మెపుడు నీకు సంతసాన్నిచ్చును
సత్య వాక్కె మనకు పరమ పదము
సత్యమున్నచోట సౌఖ్యాలు చేకూరు
చేర బిలువు నన్ను చెలిమితోడ.
-కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి
(Dr KVS)
(విశాఖపట్టణం)