Telugu Global
Arts & Literature

రథ సప్తమి ఆగమనం

రథ సప్తమి ఆగమనం
X

అందరు హాల్లో హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు.

పిల్లలు అందరికీ పండుగ వచ్చిందంటే ఆనందమే ఆనందం

ఆ వాతావరణమే వేరు .

రమ్య రఘుమ రజిని

ఈ ముగ్గురు అప్పచెల్లెళ్ళు

వీరికి ఒక్కడే అన్న. ఎంతైనా అన్న అంటే చాలా అభిమానం, గౌరవం.

ఒక ముచ్చటైన గృహం. అమ్మ రాధమ్మ బంగారు తల్లి .పద్ధతులు పండుగలు మర్చిపోకుండా జరుగుతుంది ఈమె మామగారు రామచంద్ర రావు గారు కలెక్టర్ గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు అత్తగారు దివంగతులు అయ్యారు.

రాధతొందరగా వచ్చి "మామయ్యా ! "మీకు రథసప్తమి గుర్తుందా". అని ప్రశ్నించింది.

" ఉందమ్మా" " నాకు మెదడు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చిన్న పరీక్ష పెట్టావా తల్లీ"!

అని అని నవ్వుతూ అడిగారు.

"ఎంతమాట, మావయ్యా, ఊరికే జ్ఞాపకం చేసాను "! "ఎందుకంటే ఆ రోజుకి పిల్లలందరూ ఇంట్లో ఉంటే మంచిది కదా! విధిగా మనం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని ముందే జాగ్రత్త పడి ఏర్పరచుకుంటే తేలిక అవుతుంది అంతే మామయ్యా"!

""కాఫీ తీసుకోండి మామయ్యా!"అంది.

కాఫీ తాగుతూ నవ్వుకున్నాడు! కోడలు ఎంత మంచిది విసుగు విరామం ఉండదు .ఎంత సేపు ఇల్లు చాకకి అంతే ! మళ్ళీ డబుల్ ఎమ్.ఎ చదివింది కానీ సాధారణ గృహిణి లాగ ప్రవర్తిస్తుంది. గర్వం లేదు అమ్మాయికి అనుకున్నాడు!

"పిల్లలందరూ రావాలంటే ముందు మీరు, మీ అబ్బాయిని రమ్మనండి ఆయనకి ఆయన ఉద్యోగమే ఉద్యోగం అని తెలుసుగా "!

"అది నిజమేనమ్మా!మరి మనవడు"?

"వాడికీ, మీరే చెప్పండి మావయ్యా "! "మీరన్నా మీ మాట అన్నా వేదం "!అంది.

" సరేలేమ్మా"! అన్నారు.

మనవడికి ఫోన్ చేశారు ఎంతసేపు ఫోన్ చేసినా తీయలేదు ఆఖరికి మళ్ళీ ట్రై చేస్తే తీసాడు "హలో! తాతా ఎలా ఉన్నారు"

"హలో ! పండక్కి వస్తావా? ఫోన్ చేయటం లేదు ఏమి"?

"మొన్న ఒకాయన రోడ్డు మీద వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. నేను ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశాను .వాళ్లు పరీక్షలన్నీ చేసి రక్తం కావాలన్నారు. అప్పుడు నేను నా రక్తం పరీక్ష చేయండి సరిపోతుందంటే నేను ఇస్తాను అన్నాను వాళ్ళు వెంటనే టెస్టులన్నీ చేసి సరిపోతుందన్నారు అప్పుడు రక్తం ఇచ్చే తాతా. అంచేత ఫోన్ చేయలేదు.”

“నువ్వు చెప్పావు కదా! మనం ఒకరికి సహాయం చేస్తే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అన్నావు కదా !తాతా !అది పాటించాను, ఇంతకీ ఏం ఫోన్ చేసావ్"?

"అదే బాబు రథసప్తమికి వస్తావా? రావా? అని

మనం రథసప్తమి పట్టుగా నిష్టగా చేస్తాం కదా అందుకు"

"వచ్చేస్తా తాతయ్య రేపటికి నీ ముందు ఉంటా కదా"!

“సరే బాబూ !జాగ్రత్త"! అని ఫోన్ పెట్టేసాడు,

******

తాతగారు "పిల్లలూ !ఇక్కడికి రండి" అన్నారు."మీకు ఇప్పుడు రథసప్తమి గురించి చెబుతాను."

"హిరణ్య యేనా సవితారధే" అంటే ఏడు అశ్వాలను పూన్చి బంగారు రధం మీద సూర్యుని ప్రయాణం సాగుతుందని, ఈ సూర్య గమనం రెండు విధాలు ( 1) ఉత్తరాయణం, (2) దక్షిణాయణం

ఆషాఢం నుంచి పుష్యమాసం వరకు దక్షిణ దిశగా పయనిస్తాడు సూర్యుడు .దీన్ని దక్షిణాయణం అంటాం.మకరంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం అంటాం .

ఈ"రథసప్తమి" ఈ సమయం అంటే మాఘ శుద్ధ సప్తమి

ఇది సూర్య గ్రహణంతో సమానం. ఆరోజు ఉదయమే

స్నానం, జపం, అర్జ్యప్రదానం , తర్పణం, దానాదులు

చేస్తే అనేక రెట్లు మంచి అదృష్టకరమైన ఫలములు లభిస్తాయి .ఆయుష్షు ఆరోగ్యం సంపదలు లభిస్తాయి .వింటున్నారా పిల్లలూ !ఇది మీ కోసమే చెబుతున్నాను"అన్నారు

"చెప్పు తాతయ్యా !మాకు తెలుసుకోవాలని ఉంది

ఎవరైనా అడిగితే చక్కగా చెప్పొచ్చు"అన్నారు పిల్లలు

"అయితే వినండి !సప్తమి నాడు షష్టి తిధి కలయిక ఉంటే దీన్ని "పద్మ యోగం" అంటారు ఈ యోగం

సూర్యునికి అత్యంత ప్రీతికరం అంటారు.అందుకే ఉదయాన్నే

యోగ సమయం ఉన్నా లేకపోయినా మకర సంక్రాంతి రోజున స్నానం చేసేక ఆఖరున ‌ 7 జిల్లేడు ఆకులు తీసుకోవాలి .అంటే సప్త అశ్వాలు, రేగు పళ్ళు, చిల్లర తలపై పెట్టుకుని సూర్యుని నామాలు జపిస్తూ ఏడు చెంబులు ఒక్కటొక్కటిగా

పోసుకోవాలి. స్నానం పూర్తి అవుతుంది"

"తరువాత కొత్త బట్టలు వేసుకొని సూర్యునికి ఎదురుగా నిలచి ఆదిత్య హృదయం చదివి చెంబు నీళ్ళు సూర్యునికి అర్ఘ్యం వదలాలి. ఇది పిల్లలు పెద్దలు అందరూ చేయాలి"

"పెద్దవారు వ్రత విధానం ప్రకారం -బయట ముగ్గు వేసి దానిమీద పొయ్యి పెట్టి ,ఆవు పేడ పిడకలతో మంటమీద ప్రసాదాన్ని ఆరు బయట వండాలి. బయటే సూర్యుడి కి పూజ చేసి నైవేద్యం పెట్టాలి ఆ ప్రసాదమే అందరూ

తీసుకుంటారు . అర్థం అయిందా పిల్లలూ!"

"అయింది తాతయ్యా మనం కూడ అంతే నిష్టతో పూజ చేద్దాం అన్నారు ఆనందంగా!

-కె.కె.తాయారు

First Published:  28 Jan 2023 12:49 PM IST
Next Story