ఆశించి .....(కథ)
తెల్లవారి సమయం ఏడు గంటలు దాటింది.వేసవికాలం ఒంటిపూట బడులు కావడం తో ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మాన్య బస్ దిగి తను వెళ్ళవలసిన పల్లె దారిన నడక ప్రారంభించింది.
రోడ్డు నుండి ఆ పల్లె రెండు కి.మీ ల దూరం ఉంటుంది.ఆటోలు ఉన్నప్పటికీ సమయానికిరావు.అమాసకొకటి, పున్నానికొకటిగా వస్తుంటాయి.జనం సైకిళ్ళు,మోటారు ,ఎడ్ల బండ్ల పై ప్రయాణిస్తుంటారు.
దారెంట ఉన్న ప్రకృతిని తనివితీరా పరికిస్తూ అడుగులు వేయడం చాలా ఇష్టం.ఆమె ఒక రకంగా ప్రకృతి ఆరాధకురాలు అని చెప్పవచ్చు.
తనకు సొంతంగా బండి ఉన్నప్పటికీ ఆరోగ్యానికి,ఆనందానికి నడక మంచి వ్యాయామమని ప్రతి రోజూ నడిచి పాఠశాల చేరుకుంటుంది.
అయితే ఇది అర్థం కాని కొంతమంది దారిన పొయ్యే వారు చాలా గౌరవంగాను,సానుభూతితోనూ ...
"రండి ...!మేడమ్ మేము దిగబెడతాం."అని అడుగుతుంటారు.కానీ ...
"పరవాలేదు,నేను నడువగలను "అని సున్నితంగా తిరస్కరిస్తూ వారికి థాంక్స్ చెప్పి సాగిపోతుంటుంది.
వరిచేల మీదుగా తోరణాలు కట్టినట్టుగా సాగి పోయే తెల్ల కొంగలను,హోరుమని శబ్దం చేస్తూ కుండపోతగా పోసే బోరుబావి నీటి లో నుండి బయటపడే చిన్ని చిన్ని చేప పిల్లలు,వసంతాన్ని స్వాగతిస్తూ చెట్టు కాండానికి పూసిన మోదుగల అందాన్ని,మామిడి పూతల చివురులు మేస్తూ కుహూ ...కుహూ ...
అని మత్తెక్కి కూస్తున్న కోయిల పాటను అనుభవిస్తూ నడుస్తున్న మాన్యను ..,
ఒక ప్రైవేటు స్కూల్ వ్యాన్ పెద్ద హారన్ ఇస్తూ పక్కగా వచ్చి ఆగింది.
డ్రైవర్ తన సీట్లో నుండే తొంగి చూస్తూ ..
"మేడమ్ ..!రండి ..!స్కూల్ వరకు "అన్నాడు.అతని పిలుపు 'తప్పక రావాల్సిందే'నని అన్నట్టుగా ఉంది.
అందరిని తిరస్కరించినట్టుగా అతన్ని కాదనలేకపోయింది.
'గుడ్మార్నింగ్ 'అని విష్ చేసి ఎక్కి కూర్చుంది.
'మేడమ్ !మీరు రోజూ నడవకండి.అక్కడే రోడ్డు మిద ఉండండి,నేను ప్రతి రోజూ వస్తుంటాను.నేను ఏ కారణం చేతనైనా రాక పోయినా,ఆలస్యమైనా మీకు తెలియ జేస్తాను.నా ఫోన్ నెంబర్ నోటు చేసుకోండి 'అంటూ తన పేరు అన్వేష్ అని కూడా చెప్పాడు.
వయసులో చిన్నవాడైనా అతను చూపిస్తున్న చొరవకు ,మారుమా ట్లడకుండా నోట్ చేసుకొని అతనికి మిస్సెడ్ కాల్ ద్వారా తన నెంబర్ ఇచ్చింది.లోలోన తన స్వేచ్చకు భంగం కలిగిస్తున్నాడని అనిపించినా అతను ప్రతి రోజూ తీసుకురావడం ద్వారా ఎంతోకొంత డబ్బు ఇవ్వక పోతుందా ?అని ఆశపడుతున్నట్టుగా భావించింది.
మరునాడు కూడా అతని కోసం వేచి చూడకుండా నడవసాగింది.
మర్రి పళ్ళు ని చిక్కించు కొని పరుగుబెత్తబోతున్న ఉడుతను తన ఫోన్ లో బంధించి ముందుకు సాగుతుండగా మళ్ళీ పెద్ద హారన్ తో అతను వ్యాన్ ఆపాడు.
'గుడ్మార్నింగ్ 'అని విష్ చేసి ఎక్కి కూర్చుంది.
అతనూ ..చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పాడు.
మాన్య కిటికీ గుండా చుట్టుపక్కల గమనిస్తూ బడికి చేరింది.
ఇలా నెల రోజులు గడిచాయి.
మరునాడు ఉగాది పండుగ అనగా అతనికి నెల రోజులు వ్యాన్ లో వచ్చినందుకు గాను ఆటో చార్జీ లెక్కగట్టి ఐదు వందలు ఇవ్వాలనుకుంది.
ఆ రోజు దిగబోతూ .."అన్వేష్ ..!ఈ డబ్బు తీసుకో.రేపు ఉగాది కదా !నీకు ఉగాది శుభాకాంక్షలు కూడా."అన్నది.
అతను కుడిచేతితో సెల్యూట్ చేస్తూ ..
"థాంక్యూ మేడమ్!నాకు డబ్బులు వద్దు.నేను డబ్బులు ఆశించి మిమ్మల్ని తీసుకురావడం లేదు.మీరు ఆత్మీయంగా ..గుడ్మార్నింగ్ అన్వేష్..!అని పలకరించే ఆ పలకరింపు కోసం మాత్రమె తిసుకువస్తున్నాను.నన్ను ఇంత ఆత్మీయంగా ఎవరూ విష్ చేయరు.నేను మా స్కూల్ లో అందరికి విష్ చేసినా దర్పంతో వెళ్తుంటారే తప్ప ,విష్ చేయకపోయినా కనీసం తల తిప్పి చూడను కూడాచూడరు. ఉదయాన్నే ఆత్మీయమయిన మీ చిన్న పలకరింపు రోజంతా ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తుందో నాకు మీ ద్వారానే తెలిసింది మేడం!థాంక్యూ.
నేను పొందుతున్న ఈ ఆనందానికి డబ్బులు ఇచ్చి నన్ను స్వార్థపరున్ని చెయ్యకండి మేడం!ప్లీజ్..!"అంటూ ఎప్పటిలాగే వెళ్ళిపోయాడు.
మాన్య మనసు చివుక్కుమంది.తను ఎంత తప్పుగా ఆలోచించింది.అన్నీ డబ్బు తోనే ముడిపడి ఉంటాయనీ ,
అందరూ స్వార్థపరులే ఉంటారని అనుకున్నందుకు,ఇలాంటి
అభిమానధనులు కూడా ఉంటారని అనుకోనందుకు సిగ్గు పడింది.
తనకన్నా హోదా లోనూ,వయసు లోనూ చిన్నవాళ్ళయినా ఆప్యాయంగా మొదటగా తనే పలకరించడం అనే మంచి అలవాటు తనకున్నందుకు తనకు తానే ఆనందపడుతూ స్కూల్ గేటు లో అడుగుపెట్టింది.
ఎదురుగా ఆవరణ ఊడుస్తున్న
రాజమ్మ ను .."గుడ్ మార్నింగ్ రాజమ్మా ..!"అని పలకరిస్తూ .
మాన్యలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా రాజమ్మ ,"దండాలు తల్లీ !" అంది.చేతులెత్తి.
-రావుల కిరణ్మయి