Telugu Global
Arts & Literature

కె.బి.లక్ష్మి జీవన స్వారస్యం - హాస్యం!

కె.బి.లక్ష్మి జీవన స్వారస్యం - హాస్యం!
X

కె.బి.లక్ష్మి (కొల్లూరి భాగ్యలక్ష్మి) గారు విద్వద్మణిగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితురాలు. వేటపాలెంలో చదువు. హైదరాబాద్ లో ఉద్యోగం. సీనియర్ పాత్రికేయురాలుగా ఈనాడు గ్రూప్ లో వారి విపుల, చతుర మాసపత్రికల సంపాదకత్వం వహించారు. కథా రచయిత్రిగా ‘మనసున మనసై’ ‘జూకామల్లి’ సంపుటాల్ని వెలువరించారు.

పేరు చూడగానే, కథ పట్ల ఉత్సుకత కలిగే విధంగా వుంటాయి. ఆమె కొన్ని కథల పేర్లు. శీర్షికలో ఒక ఆకర్షణ, ఒక ఆలోచన , ఒక పిలుపు. ‘నన్ను చదువు’ అనే ఆహ్వానం, ఒక ప్రేరణ, ఒక కవ్వింపు ఉంటాయి. ‘మనసున మనసై’ ‘అన్నీ నీవంచు అంతరంగమున’ ‘తరలిరాద తనే వసంతం’ ‘నేస్తమా ఇద్దరిలోకం ఒకటే’.... ఇలా తెలుగు వారి రసనకెక్కిన పదాలు, పాదాలు, పల్లవులు-లక్ష్మిగారి కథల పేర్లు. వీటిని గమనిస్తే రచయిత్రి భావుకత, కవితాత్మ, మృదుహృదయ సౌహృద, సౌహిత్య, సౌమనస్యం అర్థమవుతాయి.

లక్ష్మిగారు రాసిన ఒక గొప్ప కథ - ‘సంధ్యాసమీరాలు’. కొత్తగా వివాహమైన యువదంపతులు ఉద్యోగరీత్యా చాలా దూరప్రదేశాల్లో నివసించవలసిన అనివార్య పరిస్థితిని, ఎప్పుడో, ఎన్నాళ్లకో ఒకసారి తాత్కాలికంగా కలవటంలో వారి మానసిక స్థితిని ఆ కథలో - ఎంతో రసార్ర్దంగా చిత్రించారు లక్ష్మి. ఈ కథలో- కథానాయికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. భర్త ఆఫీసు పనిమీద వచ్చి హోటల్ లో ఉంటాడు. ఈ కారణం వలన వాళ్ల ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారుతుంది. అదీ అసలు అవస్థ

అనిర్వచనీయమైన అనుభూతి తరంగాల మీద, మనిషి, మనసు తేలిపోయే స్థితిని ఆలంబనం చేసుకుని కథ రాయడం చాలా కష్టం. ఆ పరిధిలో గిరిటీలు కొట్టి, చెప్పాల్సింది చేసేద్దామన్నా, ఆ పరిధి ‘పట్టా’ మీది నడకలో అటో ఇటో చప్పున కాలుజారి పట్టుదప్పే ప్రమాదమే ఎక్కువ. అప్పుడు చప్పున రసాభాస మిగులుతుంది.

‘సంధ్యాసమీరాలు’ కథ సమకాలీనమైన సమస్యాగతమైన విషాదమోహనరాగ ప్రస్తారం. అందులో సమాజపు రోదా వుంది. ఆర్ర్దత, ఆత్మీయత, ఆర్తి ఉన్నాయి. అందుకే అది ఒక గొప్ప కథా తేజోరేఖగా పలువురు ప్రముఖుల ప్రశంసల్ని పొందింది. లక్ష్మిగారికి అభివ్యక్తీకరణ, నైశిత్యం ఎక్కువ. సాహిత్య సంప్రదాయాల్ని సొంతం చేసుకున్న భావుకురాలు, విదుషీమణి కనుక, ఆమె కథలకు ఎలాంటి రచనా నిర్మాణ ప్రమాదం జరగలేదు. తెలుగు సాహితీ కథాహారంలో మణిపూసలు ఆమె కథలు.

కె.బి.లక్ష్మిగారు కవయిత్రిగా ‘వీక్షణం’ ‘గమనం’ సంపుటాలను వెలువరించారు. వీటిలో ‘ వీక్షణం'సంపుటి మొత్తం మన సుధామగారి స్వీయాక్షర లిఖితంగా అద్భుతంగా ప్రచురితమైంది.

పరిశోధకురాలిగా, విమర్శకురాలుగా- లక్ష్మిగారు ఐ.వి.ఎస్ అచ్యుతవల్లి నవలపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. వ్యాసరచయిత్రిగా శతాధిక రచనల్ని చేశారు. ‘కవి కథకులు’ శీర్షికన ‘చినుకు’ మాస పత్రికలో ప్రసిద్ధ కథకులు కవులైన విశ్వనాథ, చింతా దీక్షితులు వంటి సాహితీవేత్తల గురించి ధారావాహికని నిర్వహించారు. మునిమాణిక్యం నరసింహారావుగారి గురించిన‘మోనోగ్రాఫ్’ని రాసి సి.పి.బ్రౌన్ అకాడెమీ వారికి, కేంద్రసాహిత్య అకాడెమీ వారికి అందించారు. వక్తగా వందల సభల్లో ప్రసంగించారు.

యువభారతి మహిళా విభాగం అధ్యక్షురాలుగా 1960ల్లోనే ఆమె ఎంతో దక్షతని చూపిన క్రియాశీల కార్యకర్త్రి.

లక్ష్మిగారు జీవితం అర్థాన్ని, పరమార్థాన్ని పరిపూర్ణంగా అనుభవించి అవగాహన చేసుకున్న తాత్వికురాలు. అందుకనే, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం విరబూసేది. ఆమె స్నేహ సాన్నిహిత్యం ఎంతో అబ్బురమైనది. పంజగుట్ట శ్రీనగర్ కాలనిలో చిన్న ప్లాట్లో ఉంటున్నా, పెద్దమనసుతో మిత్రులందరికీ ఆత్మీయమైన ఆ నివాసాన్ని వారికి మజిలీ చేసేది.

లక్ష్మిగారి అత్తగారిది కృష్ణా జిల్లా

ఆ కారణంగా ఆమె బందరుకు ఎక్కువసార్లే వెళ్లి వస్తూ ఉండేది. కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు. అక్కడివారికి ఆమె ఆత్మీయ అతిథి. వేటపాలెం అంటే, అక్కడి గ్రంథాలయం అంటే ఆమెకి ఎనలేని అభిమానం... గుత్తికొండ సుబ్బారావుతో కలిసి అక్కడికి వెళ్లిన సందర్భంలో - సుప్రసిద్ధ రచయిత్రి పవని నిర్మల ప్రభావతి గారు అనారోగ్యంతో మంచంలో ఉన్నారంటే, ఆ ఊరుకి వెళ్లి ఆమెని పరామర్శించి వచ్చారు.

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తిరిగిన లక్ష్మిగారు నవ్వుతూనే కంచి వెళ్లి, తిరిగి వస్తూ, సహ రచయిత్రుల మధ్య రేణిగుంట రైల్వేస్టేషన్లో గుండెపోటుకు గురై మరణించారు. లక్ష్మిగారి పరిచితుల మనసుల్లో ఆమె వ్యక్తిత్వం చిరంజీవి! సాహితీలోకంలో ఆమె సాహిత్యం చిరంజీవి!! *

-విహారి

First Published:  29 July 2023 3:00 PM IST
Next Story