Telugu Global
Arts & Literature

ప్రేమంటే... (వ్యాసం)

ప్రేమంటే... (వ్యాసం)
X

ప్రతి జీవితానికి ప్రేమ ఒక దివ్య ఔషధం లాంటిది. అందుకే ఈ ప్రపంచంలో ప్రేమను కోరుకోని ప్రాణి అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు.

ప్రేమ ఎలాంటి స్వార్థం లేకుండా జీవితాంతం పవిత్రంగా తోడుగా నిలుస్తుంది...మనసును ఆహ్లాదపరుస్తుంది. మదిలో ఉత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతుంది. దాంతో ఆత్మీయత పెరిగి రెండు మనసులు దగ్గరవుతాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు స్వేచ్చగా, నిర్మొహమాటంగా చెప్పుకునే అవకాశం కలుగుతుంది. దాంతోజీవితం ఆనందమయం అవుతుంది.

మనుషుల మధ్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యం అనిపిస్తుంది. జీవితం

అంధకారమనిపిస్తుంది. ఈ భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ప్రేమ బతికే వుంటుంది.

ప్రేమికుల రోజు కేవలం యువతీయువకులకే పరిమితం కాదు. స్వఛ్ఛమైన ప్రేమను పంచే అన్ని వయసులవారిలోనూ ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమ కలగవచ్చు. ఈ విధంగా ప్రకృతిలోని జీవులన్నీ ప్రేమకు అర్హులే! ప్రేమ 'వన్ సైడ్ లవ్' కాకుండా ఇరువైపులా ఉంటే, అది పవిత్రంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవైపే ప్రేమ వుంటే, కోరి సమస్యలను తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇరువైపులా పవిత్రమైన ప్రేమ ఉన్నవారే నిజమైన ప్రేమికులు.

ప్రేమకు పద్ధతులు, హద్దులు, విలువలతోపాటు బాధ్యతలుండాలి. ప్రేమంటే సరైన వ్యక్తిని ఎన్నుకోవడం కాదు. మనం సరైన వ్యక్తిగా ఉండటం. ప్రేమంటే కేవలం తీసుకోవడం కాకుండా ఇవ్వడం కూడా తెలిసుండాలి.

స్వఛ్ఛమైన ప్రేమ లేనిచోట మానవత్వం ఉండదు. ప్రేమ సహజంగా ప్రకృతి పులకించేలా పుట్టాలి. ప్రేమతత్వాన్ని, ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకోగలిగినవారే నిజమైన ప్రేమికులవుతారు.

ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తీయని మాటల్లో వ్యక్త పరచినప్పుడు కలిగే ఆనందం వర్ణణాతీతం. ప్రేమ అంటే రెండు మనసులు నిజాయితీగా, నమ్మకంతో ఒకటవడం. ఆ నమ్మకాన్ని జీవితకాలం నిలబెట్టుకోవడం.

ఒకరిపట్ల ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటే ఆ ప్రేమ కలకాలం నిలుస్తుంది. స్వచ్చమైన ప్రేమకు ఏ వాలెంటైన్స్ డేలు అక్కర్లేదు. నిజమైన, నమ్మకమైన ప్రేమకు ప్రతిరోజూ వాలెంటైన్స్ డేనే.

-కాయల నాగేంద్ర

(హైదరాబాద్)

First Published:  16 Feb 2023 10:17 AM GMT
Next Story