Telugu Global
Arts & Literature

తాంబూలం (వ్యాసం)

తాంబూలం (వ్యాసం)
X

మన హిందూ శుభకార్యాలకు తాంబూలం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రతి పూజలో దైవానికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించు కోవడం ఆనవాయితి. ఇది మన పూజలో ఒక భాగమైంది. అదేవిధంగా నోములు, వ్రతాలు, పెరంటాలకు వాయనాలతో తాంబూలాన్ని ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

వివాహ, నిశ్చతార్థ సమయంలో కూడా తాంబూలాలను మార్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కొన్ని వేడుకల్లో తాంబూలాన్నిఅందుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నారంటే, తాంబూలానికి గల ప్రాధాన్యత ఎలాంటిదో తెలుస్తోంది.

ప్రతి పండుగలోనూ, ప్రతి శుభకార్యాలలోనూ తాంబూలానికి అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. మన హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కొందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేస్తారు.

సాధారణంగా భోజనం అనంతరం వేసుకునే తాంబూలంలో తమలపాకులలో వక్కలు, సున్నం, జాజికాయ, జాపత్రి, ఏలకలు లాంటి పదార్థాలను వాడుతుంటారు. తాంబూలం స్వీకరించడం వలన కఫం, వాతం హరించుకు పోతాయి. నోటి దుర్వాసన అరికట్టి, దంత వ్యాధులను నివారిస్తుంది.

మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు విందు భోజనం అనంతరం కిళ్ళీ ఇవ్వడం ఆనవాయితి, తాంబూలాన్ని మితంగా సేవించడం వలన అది ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే మన పెద్దలు రాబోవు తరాల వారికి తాంబూలంతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచారని చెప్పవచ్చు.

అందుకే మన హిందూ సంస్కృతిలో తాంబూలానికి ప్రత్యేక స్థానం ఉంది. ముతైదువులకిచ్చే తాంబూలం, భగవంతునుకిచ్చే తాంబూలం, బ్రహ్మనాధులకిచ్చే తాంబూలం ఇలా మూడు రకాలుంటాయి. తాంబూలం అనేటువంటివి తాంబూలం ఇవ్వడం ద్వారా ఇశ్వర్య ప్రాప్తి కలుగుతుంది...మన దారిద్య్ర బాధ తొలగుతుంది.

నిత్య పూజలో, వివాహానికి వచ్చిన అతిధులకు మరియు శుభకార్యంలో అతిధులకు, ముతైదువులకు ఇవ్వడానికి దైవ కార్యక్రమంలో ఉపయోగించేది సాంప్రదాయబద్దమైన తాంబూలం. ఇంటికి ముతైదువులను పిలిచి తాంబూలం ఇచ్చేటప్పుడు వారిని దేవతా స్వరూపంగా భావించి ఇవ్వాలి.

తాంబూలం ఇచ్చేటప్పుడు ప్రధానంగా ఉండవలసినవి రెండు లేక నాలుగు తమలపాకులు, రెండు అరటి పండ్లు, రెండు వక్కలతోపాటు ఒక పువ్వును కూడా పెట్టి ఇవ్వడం ఆనవాయితి.

తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు, అరటిపండ్ల తొడమలు మన వైపు ఉండాలి. అదే విధంగా కొసలు తీసుకునేవారివైపు ఉండాలి. భగవంతునికి సమర్పించేటప్పుడు కూడా ఈ పద్దతినే పాటించాలి.

తాంబూలం ఇచ్చి గౌరవించడం ఈ తరానికి కూడా అలవాటు చేయండి

- కాయల నాగేంద్ర

First Published:  22 March 2023 7:49 AM IST
Next Story