Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    నేను చదివిన పుస్తకం

    By Telugu GlobalNovember 27, 2023Updated:March 30, 20253 Mins Read
    నేను చదివిన పుస్తకం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ‘ఘర్షణ’ (కథల సంపుటి)

    ప్రముఖ తెలుగు రచయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి కలం నుంచి జాలువారిన గొప్ప సాహిత్య నిధి -ఘర్షణ కథల సంపుటి .ఆకర్షణీయమైన ఈ సంపుటి మానవ జీవిత వాస్తవికతను లోతుగా విశ్లేషించింది. వివిధ జీవన వైరుధ్యాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించింది.  ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రచయిత్రికి మనిషి మీద ఉన్న ప్రేమ, మానవత్వం మీద తపన స్పష్టంగా కనిపించింది.

     

    మారుమూల పల్లె జీవితం నుంచి మొదలుపెట్టి, పెద్ద నగరాలు, విదేశాలు, ప్రాంతం ఏదైనా మనుషులంతా ఒకటే. మంచితనం అనే సుగంధం మనలో నింపుకుంటే మన చుట్టూ సమాజంలో ఎంతో అందాన్ని, ఆనందాన్ని తిలకించవచ్చు అని రచయిత్రి చెబుతున్నట్లు అనిపించింది ఈ కథల ద్వారా.

     

    నీహారిణి గారి ప్రతి కథలో స్త్రీల సమస్యలు వారి మనోవేదన అంతర్లీనంగా చర్చించబడ్డాయి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలపై ఆవిడకు ఉన్న  అపారమైన జ్ఞానం కట్టిపడేస్తుంది.

     

    ‘ ఘర్షణ ‘అనే పేరుతో వెలువరించబడిన ఈ సంపుటిలో 19 కథలు ఉన్నాయి. దేనికదే ఒక వైవిధ్యమైన ఇతివృత్తం కలిగి ఉంది. ప్రతి కథలోనూ చర్చించబడిన అంశాలు నిత్యజీవితంలో అందరికీ ఉపయోగకరమైనవే. తెలంగాణలోని నిర్మలమైన గ్రామ జీవితం నుంచి గజిబిజి అయిన నగర జీవితం వరకు మానవ జీవిత సార్వత్రిక ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ నిహారిణి గారి కథనాలు విభిన్న ప్రకృతి దృశ్యాలలో ప్రయాణిస్తాయి.

     

    ఈ సంకలనానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వివిధ పాత్రలు వాటి స్థాయిని బట్టి ప్రదర్శించే పోరాటపటిమ. నిత్యజీవిత సంఘర్షణలో ఆ పాత్రలు చూపించిన పరిణతి మనకు మార్గదర్శకత్వం చేస్తుంది.

    ఒక ప్రత్యేకమైన కథ ‘ఘర్షణ’లో నేటి ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ్యతను రచయిత్రి చెప్పిన తీరు అద్భుతం. ఆడపిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా తమ చుట్టూ ఉండే తమ కుటుంబ సభ్యులు, లేదా పరిచయస్తుల వల్ల ఎదుర్కొనే లైంగిక వేధింపులను తెలుసుకోవడానికి వారికి మంచి, చెడు స్పర్శ గురించి, ఎదుటి వారి ప్రవర్తనలో తేడాల గురించి కనీస జ్ఞానాన్ని ఈయవలసిన ఆవశ్యకతను ఈ కథలో రచయిత్రి చక్కగా చెప్పారు.

     

    ఈ కథలు చదివేటప్పుడు ఒక రచయిత్రి (రచయిత) యొక్క సామాజిక బాధ్యత ప్రస్ఫుటంగా ప్రతి కథలో తొంగి చూసినట్లు అనిపించింది.

     

    అలసిన ఊసులు ,దండన కథలలో ఈ భూమిపై నువ్వు చేసిన పాపాలకు శిక్ష ఇక్కడే దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం ఇక్కడే చేసుకోవాలి అనే రచయిత్రి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేం.

     

    మమత విరిసిన వేళ, పాలాల్ల, నువ్వు అట్లా అన్నావని, కథలలో రచయిత్రి స్త్రీవాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథలు విభిన్న కోణాల్లో స్త్రీ సమస్యల్ని ,వాటికి సమాధానాల్ని సూచిస్తున్నట్లు ఉన్నాయి.

     

    తెలుగు భాషపై, ప్రత్యేకించి మనదైన సొబగులున్న తెలంగాణ యాసపై నిహారిణి గారికి ఉన్న పట్టు ప్రతి వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి కథలో ఏదో ఒక సందర్భంలో రచయిత్రి తన భావాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించడం చాలా బాగుంది. సంభాషణల కన్నా నెరేషన్ లేదా చర్చ పద్ధతిలోనే ఎక్కువగా కథలు సాగడం వల్ల ఇది చాలా సులువుగా చేయగలిగారు రచయిత్రి.

     

    అన్ని కథలు చాలా బాగున్నప్పటికీ ‘కొత్తచూపు’ అనే కథలో స్త్రీలు బహిష్టు సమయంలో విడిగా కూర్చోవడం అనే సాంప్రదాయం కనీసం ఆ సమయంలో వారికి కావలసిన విశ్రాంతి ఇస్తుంది కనుక మంచిదే అని రచయిత్రి ఒక పాత్ర చేత చెప్పించడం వ్యక్తిగతంగా నాకు కొంత ప్రశ్నార్ధకంగా అనిపించింది.ఆ మూడు రోజుల లో స్త్రీ కి విశ్రాంతి అవసరం అనేది నిజం. ఐతే ఈనాడు స్త్రీపురుషులిద్దరూ ఆర్థిక పరమైన సమానత్వం సాధిస్తున్నారు కనుక అప్పుడు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం తీసుకోవలసిన ఆవశ్యకత ఇంకా స్పష్టంగా చర్చించవలసిన అంశం అని నా అభిప్రాయం.

    మెజారిటీ కథలు చాలా బాగున్నాయి.పాత బతుకులు – కొత్త పాఠాలు కథలో వివిధ కారణాల వల్ల మనుషులు ఒంటరి జీవితం అనుభవించవలసి రావడం ఎంత బాధాకరమో చెప్పారు నీహారిణి గారు. పాతకాలపు ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా కనీసం అత్తమామలతో సఖ్యతగా ఉండే అవసరాన్ని అందులోని ఆనందాన్ని ఈ కథలో స్పష్టం చేశారు.

    సెల్ ఫోన్ (టెక్నాలజీ) యువతను పెడదోవ పట్టించడం పై రాసిన కథ ఎర్రజీరలు. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వారితో తల్లిదండ్రులు కఠినంగా ఉండవలసిన అవసరం తెలియజేసారు ఈ కథలో రచయిత్రి.

     

    అమెరికాలో మన వారి జీవన శైలిని కూడా నీహారిణి గారు ఎంతో అద్భుతంగా చిత్రించారు. ప్రయాణంలో పదనిసలు, ఆకాశం అంచుల్లో కథలలో ఏ దేశం, ఏ ప్రాంతం అనేది కాక మంచి, చెడు అనేవి మనుషులను బట్టి ఉంటుంది అని స్పష్టం చేశారు ఆవిడ.

     

    ఇప్పటికే తెలుగు సాహిత్యంలో మంచి కవయిత్రిగా, విమర్శకురాలిగా, రచయిత్రిగా ఎన్నో కితాబులు అందుకున్న డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి ఘర్షణ కథా సంపుటి తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి మరియు ఆలోచింపచేసే కథలను మెచ్చుకునే ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ లైబ్రరీలో తప్పక చేర్చవలసిన ఒక పుస్తకంగా నేను దీనిని భావిస్తున్నాను.

     

    భారతీయ, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ జీవన సౌందర్యం, స్త్రీ జీవితంలోని వివిధ ఘర్షణలు ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన సుసంపన్నమైన కథనాలతో, నైపుణ్యంతో కూడిన కథనంతో నీహారిణి గారు వెలువరించిన ‘ఘర్షణ’ కథా సంపుటి తెలుగు సాహిత్య పాఠకుల ఆత్మలను స్పృశిస్తుంది అనే నమ్మకాన్ని మరింత బలపరిచింది.

     -కట్టెకోల పద్మావతి

    Kattekola Padmavathi Telugu Kathalu
    Previous Articleప్రకృతి పై ప్రేమతో…(కవిత)
    Next Article పొట్ట క్యాన్సర్ పెరుగుతోంది! జాగ్రత్తలు ఇలా..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.