Telugu Global
Arts & Literature

ఎక్కడ ఉన్నా .... ఏమైనా ....

ఎక్కడ ఉన్నా .... ఏమైనా ....
X

"శరీరం అనే ఈ శవాన్ని మోస్తున్నానురా... " కళ్ళల్లో ఉబుకుతున్న సముద్రాన్ని ఆపటానికి ప్రయత్నిస్తూ చెప్పాడు సీతారావుడు. కంఠం బొంగురుపోతూ ఉంది. గుండెల్లోనుంచీ తన్నుకొస్తున్న బాధనిదిగమింగుతున్నట్లు మాట ముక్కలు ముక్కలుగా వస్తోంది. నులకమంచం మీద కూర్చుని వున్నాడు.

వాడివంక చూస్తూ ఉండిపోయాను. సీతారావుడు, నేను ఒకే ఊరివాళ్ళం. తెనాలి దగ్గరున్న కనగాల. పక్క పక్క ఇళ్లు . నా కన్నా రెండేళ్లు పెద్ద వాడు. ఇరు కుటుంబాల్లోనూ ఏకైక సంతానాలం అవటంతో అన్నదమ్ముల్లా కలసిపోయాం. ఊళ్ళో స్కూలు, తెనాలిలో కాలేజీ చదువులన్నీ కలిసే కానిచ్చాం.

చదువులైపోయింతర్వాత, సెక్రటేరియట్ లో ఉద్యోగం రావటం, కొలీగ్ ని

పెళ్లిచేసుకోవటం, హైదరాబాద్ లో స్థిరపడటం జరిగిపోయింది. నా ప్రమేయం, చింతన లేకుండానే ముప్పయ్యేళ్లు గడిచిపోయాయి.

పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో, నేను, నా భార్య ఉద్యోగ చట్రంలో యాంత్రికంగా గడుపుతూ, జీవిత గమనానికి సాక్షిగా బ్రతికేస్తున్నాం. అదే సమయంలో సీతారావుడు కనగాల్లోనే స్థిరపడి, చిన్న స్కూల్ నడుపుతూ, బంధువులమ్మాయినే పెళ్ళిచేసుకుని , పొలం పనులు చూసుకుంటూ జీవిస్తున్నాడు.

అప్పుడప్పుడు వాట్సాప్ లో మెసేజ్ లు, గ్రీటింగ్ లు, కనగాల్లో ఉన్న మా ఇల్లు అద్దెకివ్వడం విషయం లో మాట్లాడటం తప్ప , రాకపోకలు, ఆత్మీయ ముచ్చట్లు లేవనే చెప్పాలి.

ఆ మాటల్లోనే తెలిసిన విషయం ఏమిటంటే పిల్లాడు అమెరికా లో ఉంటున్నాడు. పిల్ల డిగ్రీ పూర్తిచేసి రావుడుతోనే ఉండి స్కూల్ చూసుకుంటోంది. పెళ్ళి సంబంధం కుదిరింది . మాఘమాసంలో ముహూర్తం. ఇంతలోనే ఈ పరిణామం.

సీతారావుడి భార్య సీతాలక్ష్మి

హఠాత్తుగా చనిపోయింది !

కొడుకు వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. నేను బడ్జెట్ సెషన్ లో బిజీ గా ఉండి ఫోన్ చేసాను. ఇప్పటికి తీరిక చేసుకుని నేను నా భార్య వచ్చాం. ఆవిడ లోపల అమ్మాయితో మాట్లాడుతోంది. మా ఇంట్లో అద్దెకున్నవాళ్ళు వచ్చి పలకరించి భోజనానికి రమ్మన్నారు. వాళ్లకు నచ్చచెప్పి సీతారావుడి దగ్గర కూర్చున్నాను.

"అంకుల్, కాఫీ తీసుకోండి " ఆ అమ్మాయి పిలుపుతో ఇహంలోకొచ్చాను. కప్పు చేతిలోకి తీసుకుంటూ అమ్మాయికేసి చూసాను. చాలా కళగా ఉంది. తల్లి పోయిన దిగులుతో మసకేసిన చందమామలా ఉంది.

సీతారావుడు ఆకాశంలోకి చూస్తున్నాడు.

"నీవు అలా బాధపడుతూ కూర్చుంటే పిల్ల బెంగపడిపోతుంది. అయినా నీవు ఇలా రాత్రీ పగలూ ఏడుస్తూ కూర్చుంటే సీతాలక్ష్మి ఆనందంగా ఉండగలదా ? ఆవిడ ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటుంది. నీ కేమైనా ఆవిడ క్షోభిస్తూనే ఉంటుంది. " అనునయంగా అన్నాను.

" అటు చూడరా ... ఆకాశంలో సీతాలక్ష్మి కనిపిస్తోంది కదూ ..." అంటూ ఒక్కసారిగా భోరుమన్నాడు.

వెంటనే కాఫీ కప్పుని పక్కన బెట్టి వాణ్ని దగ్గరికి తీసుకున్నాను.

నాలో నేను ఆశ్చర్యపోతున్నా. 'భార్య అనే వ్యక్తి మనమీద ఇంత ప్రభావాన్ని చూపుతుందా?'

సీతాలక్ష్మి గుర్తొచ్చింది. సంక్రాంతి ముగ్గులా నిండుగా ఉంటుంది. గోమాతలా గంభీరంగా పవిత్రంగా కనిపిస్తుంది. అన్నింటికీ మించి చూసినవారికి ఎవరికైనా తమ పుట్టింటి ఆడపడుచులా తోస్తుంది.

సీతారావుడు రోదిస్తూనే ఉన్నాడు. శబ్దం రావటం లేదు. కానీ గుండెల్లో ఎంత బరువుందో తెలుస్తోంది. ఇంతలో వాళ్లకు తెలిసిన వాళ్ళు వచ్చి పరామర్శ మొదలెట్టారు.

నేను వెనక్కి జరిగి కుర్చీలో సర్దుకుని కూర్చుని, కాఫీ పూర్తిచేసి, గ్లాసు పక్కనబెట్టి, కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి వెళ్ళిపోయా. మా కుటుంబం కూడా అన్యోన్నంగా ఉంటాం . ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా మిగిలిన ముగ్గురు స్తంభాల్లా నిలబడి కుటుంబo అనే భవంతి ని పదిలంగా కాపాడుతాం. కానీ సీతారావుడ్ని చూస్తే 'భార్యా భర్తల బంధం ఇంత బలంగా ఉంటుందా' అని విస్మయం కలుగుతోంది.

అప్పుడెప్పుడో వాడు నాకు పంపిన వాట్సాప్ మెసేజ్ ఒక్క సారి గా గుర్తుకొచ్చింది.

విలియం గోల్డింగ్ చెప్పిన మాట – ‘స్త్రీలు తాము మగవారితో సమానం అని తెలివి తక్కువగా భావిస్తారు. కానీ, నిజానికి వాళ్ళు అన్నివిధాలుగా ఎన్నో రెట్లు ఎక్కువ అని తెలుసుకోరు.’

‘ఏ స్త్రీ అయినా, మనం ఇచ్చినదాన్ని మరింత గొప్పగా చేసి తిరిగిస్తుంది. మనం చిర్నవ్వు ఇస్తే తాను హృదయాన్ని ఇస్తుంది. ఇంటిని ఇస్తే , దాన్ని గృహంగా మారుస్తుంది. అణువంత ఆశనిస్తే ఆకాశమంత శ్వాసనిస్తుంది. కాస్త ఆసరా ఇస్తే కడలి దాటే భరోసా ఇస్తుంది. అంతెందుకు? ఆమె క్షేత్రానికి మనం ఇచ్చే బీజంతో మనకు 'వంశం' అనే వటవృక్షాన్నిస్తుంది.’

ప్రక్కనే పరిచితమైన చప్పుడైతే కళ్ళు తెరిచి చూసా. నా శ్రీమతి. ఆశ్చర్యపోయా. నాలో కూడా ఇలాంటి సెన్సార్లు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నా.

ఖాళీ గ్లాసు తీసుకుంటూ నన్ను కళ్ళతోనే హెచ్చరిస్తూ 'సీతారావుడ్ని కనిపెట్టుకుని ఓదార్చండి' అని సైగ చేసి వెళ్ళింది. నవ్వొచ్చింది. ఒక్క క్షణం కృతజ్ఞతా భావం నన్ను చుట్టుముట్టింది. సీతారావుడి వంక చూసా.

దక్షయజ్ఞం భగ్నం చేసింతర్వాత సతీ దేవి పార్థివ దేహాన్ని మోస్తూ పిచ్చివాడిలా తిరుగుతున్న రుద్రుడిలా ఉన్నాడు. నెరిసిన గడ్డం పెరిగిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా, లోతుకు పోయి ఉన్నాయి.

జాలేసింది. నిజమే ! సమయానికి, సమయానుకూలంగా ,సమయస్ఫూర్తిగా, సంయమనంతో అమర్చే భార్య లేకపోవటం ఇబ్బందికర పరిస్థితే ! ఇప్పుడు ఒక్కసారిగా దారం తెగిన గాలిపటంలా తల్లడిల్లుతున్నాడు. కనిపెంచిన కూతురు కోసం కనిపించని దేవుళ్ళనీ, కలుసుకున్న అయ్యగార్లనీ ఆశ్రయించి, తెలుసుకున్న పూజలన్నింటినీ చిత్తశుద్ధిగా చేసింది. తీరా సమయానికి , పూజాఫలాన్ని సీతారావుడికి ఇచ్చి, కన్యాదాన ఫలం లేకుండానే కనుమరుగైపోయింది.

కుర్చీలోంచి లేచి వాడిప్రక్కనే కూర్చున్నా. భుజం మీద చెయ్యి వేసి '"ఒరేయ్ రావుడూ ... ఒక్కసారి నీ స్కూల్ దాకా వెళ్లివద్దాం పద... అలా వదిలేస్తే మనసు కంట్రోల్ లేకుండా పోతుంది " అన్నాను . సీతారావుడు నిరాసక్తంగా, అన్య మనస్కంగానే లేచాడు.

స్కూల్ కి వెళ్లి చూసి, అన్ని బజార్లూ చుట్టబెట్టి తిరిగొచ్చేదారిలో రథంబజారులో ఉన్న శ్రీసీతారామాలయం దగ్గర ఆగాం. గుడి బ్రహ్మోత్సవాలేమో ... వైభవంగా కనిపిస్తోంది. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న పెద్దాయన మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి సీతారావుడ్ని పలకరించి రాత్రికి హరికథా కాలక్షేపం ఉందని చెప్పి తప్పకుండా రమ్మన్నాడు. ఆయనతో కాసేపు మాట్లాడి ఇల్లు జేరాం.

నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ సీతారావుడిలో కాస్త చైతన్యం కనిపించింది. రేపు నేను తిరిగి బయల్దేరేలోపు వాడ్ని మనిషిని జేయమని ఆ శ్రీ రామచంద్రుడికే మ్రొక్కుకొని కాసేపు నడుం వాల్చాను.

*

ఆంజనేయస్వామి గురించి చెబుతున్న భాగవతార్ గారి గొంతు మైకుని బద్దలుకొడుతోంది.

రాత్రి ఎనిమిది గంటలైంది. నేను, సీతారావుడు గుడికి కాస్తదూరంలో ఉన్న శీనయ్య బడ్డీ దుకాణం దగ్గర టీ తాగుతున్నాం . ఇది మాకు చిన్నప్పటినుంచి అడ్డా.

సీతారావుడు కాస్త నెమ్మదించినా, ఇంకా శవాన్ని మోస్తూ బ్రతుకుతున్న వాడిలాగానే కనిపిస్తున్నాడు. సీతాలక్ష్మి పేరు ఎత్తితే చాలు, ఆమె ఎదురుగా లేదని రోదిస్తున్నాడు. ఒక్కొక్కసారి మాటలాపేసి చుట్టూ చూస్తూ వెదుక్కుంటూ ఉంటున్నాడు.

ఉన్నట్టుండి మైకు వైపు చూస్తూ నిలబడిపోయాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నేను కూడా మైకు వైపు చూసాను. రావణ వధ తర్వాత రామ సైన్యం అయోధ్య జేరుకుని చేసుకుంటున్న సంబరాల్ని ఏకరువుపెడుతున్నాడు భాగవతార్. సీతారావుడు కథలో లీనమై వింటున్నాడు. నేను కూడా శ్రద్ధగా వినటం మొదలెట్టా.

శ్రీరాముడు సీత కి ఒక ముత్యాల హారం ఇచ్చి దీనిని నీకు బాగా ఇష్టమైన వారికి, నిజాయితీ పరునికి, స్వామీ భక్తునికి, మాట తప్పనివానికీ బహుమతి గా ఇవ్వమన్నాడు. సీతాదేవి మరో మాట లేకుండా దాన్ని అందరూ చూస్తుండగా హనుమంతునికి ఇచ్చింది.

సభికులందరూ అతణ్ణి అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. హనుమంతుడు మాత్రం వెంటనే ప్రతి ముత్యాన్నీ పళ్లతో కొరికి అవతల పడేస్తున్నాడు. అర్ధం అయ్యేలోపే సగం హారం పాడయి పోయింది. అందరూ అతణ్ణి కోతి చేష్టలకు నిందించసాగారు. సీతాదేవి తెల్లబోయింది. శ్రీ రాముడు మందహాసం చేస్తూ కూర్చున్నాడు.

ఇంతలో, లక్ష్మణుడు హనుమతో, "హనుమా... ఎంత పని చేశావయ్యా ... ఎవరికీ దక్కని అదృష్టం నీకు దక్కింది. నువ్వు చేతులారా అంత విలువైన ముత్యాల్ని నాశనం చేసుకున్నావు కదయ్యా " అన్నాడు.

హనుమ అతని వంక చూస్తూ , " ఇవి విలువైనవా? ఏదీ ఒక్క ముత్యంలోనూ నా రాముడు కనబడడే ? " అన్నాడు.

లక్ష్మణుడు వేళాకోళంగా , " మరి నీలో కూడా లేడే ! నిన్ను నువ్వు ఏం చేస్తావ్? " అన్నాడు.

'నాలో రాముడు లేడా ?' అంటూ వెర్రికేక పెట్టి రెండు చేతుల వ్రేళ్ళ గోర్లతో గుండెని చీల్చేసుకున్నాడు. అక్కడున్న వారందరూ నిరుత్తరులయ్యారు. హనుమ ఛాతీ నుంచి రక్తం కారుతోంది. హనుమ కళ్ళు పెద్దవి చేసి పిచ్చి గా నలువైపులా చూస్తున్నాడు. లక్ష్మణుడు బిక్కచచ్చిపోయాడు. సీతమ్మవారు కంగారుగా 'నాయనా' అంటూ వారిస్తూ, తల తిప్పి రాముడివంక చూసింది ప్రాధేయపూర్వకంగా. శ్రీ రాముడు అభయహస్తాన్నిచ్చాడు.

అంతలోనే సభికులందరూ ఆశ్చర్యపోయేట్లుగా హనుమ హృదయంలో సీతారాములు ప్రత్యక్షమయ్యారు. అందరూ అసంకల్పితంగానే లేచి నిలబడి జే జే లు కొట్టారు.

దీన్ని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే, మనం ప్రేమించేవారు మన గుండెల్లోనే ఉంటారు. భక్తి అనేది విగ్రహంలో చూపించ కూడదు. హృదయంలో ప్రతిష్టించుకోవాలి. బోలో రామ భక్త హనుమాంజీ కీ ... "

అన్నారు హరిదాసు గారు

ప్రేక్షకులందరూ "జై" కొట్టారు. సీతారావుడు కూడా 'జై' కొట్టాడు. వాడి కళ్ళల్లో ఎదో గొప్ప వెలుగు. చేత్తో హృదయాన్ని తడుముకుంటున్నాడు.

‘అవును, నా సీతాలక్ష్మి ఇక్కడే వుంది.’ తనలో తాను గొణుక్కుంటున్నాడు. నా కర్ధమైపోయింది. వాడు మనిషయ్యాడు. ఇప్పుడు వాడు సతి శరీరాన్ని మోస్తున్న రుద్రుడు కాడు. సతిని హృదయంలో దాచుకున్న అర్ధనారీశ్వరుడు !

వాడి శరీరం శవం కాదు... శివం

-కస్తూరి రాజశేఖర్

First Published:  15 April 2023 8:12 PM IST
Next Story