Telugu Global
Arts & Literature

బంధం బాధ్యత కాదా (కథానిక)

బంధం బాధ్యత కాదా (కథానిక)
X

"పెళ్లి వాళ్ళు మళ్ళీ కబురు చేశారు.. సమాధానం ఏమీ చెప్పకుండా ఎన్ని రోజులు వాళ్ళని మభ్య పెట్టాలి.

అసలు నీ నిర్ణయం ఏమిటి" అని కూతుర్ని నిలదీసింది మీనాక్షమ్మ..

"అమ్మా !నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని .కానీ నువ్వే నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశావు..

వాళ్ళు ఎప్పుడో దారిలో కలిసినప్పుడు ,

నా గురించి చెప్పానని వాళ్లు పెళ్లి చూపులకు వస్తారని చెప్పావు.

"వాళ్ళ ముందు పరువుపోతుంది ఈ ఒక్కసారికి పెళ్లి చూపులకు కూర్చో" అన్నావు.అలాగే నీ మాట కాదన లేక కూర్చున్నాను. ఇప్పుడేమో వాళ్ళకి నచ్చావు ఏం చెప్పమంటావు అని అడుగుతున్నావు..నీకు చాలా సార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న పోయిన దగ్గర నుంచి నువ్వే తల్లి, తండ్రి అయి నన్ను

పెంచుతున్నావు .ఇప్పుడు పెళ్లి చేసుకొని భర్తతో వెళ్లిపోయి నిన్ను ఒంటరిదాన్ని చేయడం నాకు ఇష్టం లేదు ..ఈ మాట నీకు చాలా సార్లు చెప్పాను మళ్లీ పెళ్లి ,పెళ్లి అంటూ నన్ను విసిగించొద్దు" అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రియ.

"అది కాదే నేను చెప్పేది విను" అంటూ ఎంతగా బ్రతిమిలాడినా తల్లి మాట వినకుండా తలుపు వేసుకుంది.

ప్రియ చిన్నప్పుడే తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయారు...

అప్పటినుండి కూతుర్ని చాలా కష్టాలు పడి ప్రేమగా పెంచుకుంది .

ప్రియ కూడా తల్లిలోనే తండ్రిని చూసుకుంటూ పెరిగింది.ఇప్పుడు పెళ్లి చేసుకుని తల్లిని ఒంటరిని చేసి వెళ్లిపోవడం ప్రియ కి ఇష్టం లేదు..

ఒక్కగానొక కూతురు పెళ్లి చూసి, ఆమె పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే చూడాలని కోరిక మీనాక్షమ్మది ...

మొండి పట్టుదలతో ఉన్న కూతుర్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు ఆమెకు .

పెళ్లి వారు మళ్ళీ ఫోన్ చేశారు.

"మా అబ్బాయికి మీ అమ్మాయి ప్రియ బాగా నచ్చింది అందుకే మీ అభిప్రాయం కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం ఏమి అనుకోకండి వదినగారు "అంటూ అవతల నుండి వరసలు కూడా కలిపేశారు..

"అదే అండీ !ఒక వారం రోజులు గడువు కావాలి అమ్మాయి కొంచెం బిజీగా ఉంది ఆఫీస్ లో ప్రాజెక్టు వర్క్" అని తడబడుతూ చెప్పింది కామాక్షిమ్మ .

"సరే మీ ఇష్టం !కానీ మీరు చెప్పే నిర్ణయం మీదే మన ఇరుకుటుంబాల సంతోషం ఆధారపడి ఉంది .."అంటూ కాల్ కట్ చేశారు..

"ఏంటో ఈ పిచ్చి పిల్ల దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు నాకు ఎవరూ తోడు లేరని బాధపడుతుందే కానీ తన జీవితానికి ఒక తోడు ఏర్పడాలి అని ఆలోచన లేకుండా పోయింది ...ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు" అని దిగులుగా కూర్చుంది మీనాక్షమ్మ .

ఒకరోజు సూపర్ బజార్లో పెళ్ళికొడుకు అవినాష్ కనిపించాడు ...

అవినాష్ వెంటనే మీనాక్షమ్మని గుర్తుపట్టి పలకరించి "బావున్నారా అండి "అన్నాడు ఆప్యాయంగా..

"బాగున్నాము బాబు నిన్ను ఇలా చూడడం చాలా సంతోషంగా ఉన్నది.మా ఊరు ఎప్పుడు వచ్చారు" అని అడిగింది.

"నిన్ననే ఫ్రెండ్ పెళ్లి ఉంటే వచ్చాను మిమ్మల్ని కలవాలి అనుకున్నాను . కానీ ,మీకు ఏమైనా ఇబ్బంది ఏమో అని "అన్నాడు సంశ్శయిస్తూ..

"అయ్యో ఇబ్బంది ఏముంది బాబు !నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ,మన ఇల్లు ఇక్కడికి దగ్గరే వెళ్దాం అంటూ అవినాష్ నీ ఇంటికి తీసుకువచ్చింది..

"కూర్చో బాబు" నేను ఇప్పుడే కాఫీ చేసి తీసుకు వస్తాను అంటూ వంట గదిలోకి వెళ్ళింది .

అవినాష్ ఇల్లంతా ఒకసారి చూశాడు ఇల్లు చాలా అందంగా అలంకరించి ఉంది..గోడలకు ఎటువైపు చూసినా ప్రియ, మీనాక్షి గారు కలిసి దిగిన ఫోటోలు అందముగా ఉన్నాయి .

ప్రియా చిన్నప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం దిగిన ఫోటోలు అక్కడ తగిలించి పెట్టారు ఆ ఫ్రేమ్స్ అన్ని చూడగానే చాలా ముచ్చటగా అనిపించాయి.

మీనాక్షమ్మ కాఫీ తీసుకొని వచ్చి ఆ ఫొటోల్ని చూస్తున్న అవినాష్ తో కాఫీ అందిస్తూ ,"మా అమ్మాయికి నేనంటే పిచ్చి ప్రేమ నన్ను వదిలి ఉండాలంటే ఉండలేదు...తండ్రి లేని బిడ్డ అని ఎంతో గారాబంగా ప్రేమగా చూసుకున్నాను .. తనకి కూడా నేనంటే అదే ప్రేమ అందుకే దాన్ని పెళ్లికి ఒప్పించాలంటే చాలా కష్టమైపోతోంది..నన్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది ఏమో అని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు.అందుకే మీ అమ్మగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను సమాధానం చెప్పలేక పోతున్నాను" అన్నది దిగులుగా..

"మీరు ఎందుకు ఆంటీ అంత బాధ పడటం !నాకు మీ అమ్మాయి ప్రియ చాలా బాగా నచ్చింది..మీకు అభ్యంతరం లేకపొతే , మీ అమ్మాయితో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి .మాది చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసే ఉండొచ్చు అన్నాడు అవినాష్...

వెంటనే మీనాక్షమ్మ నవ్వుతూ ..

"దూడతో పాటు ఆవును కూడా తీసుకెళ్తావా! అయినా,అల్లుడు దగ్గర ఉండకూడదులే బాబు "అన్నది నవ్వుతూ ..

"అదేంటి ఆంటీ అలా అంటారు...

మీకు ఉన్నది ఒక్కఆడపిల్ల ..

మీ అమ్మాయికి నాతో పెళ్లి చేస్తే, నేను మీ ఇంటికి అల్లుడును అవుతాను అంటే నేను మీ కుటుంబమే కదా! ?

మీ కూతురితో పాటుగా మీ బాధ్యత చూసుకోవాల్సిందే నేనే కదా !

నాలో మీరు కొడుకుని చూసుకుంటే అల్లుడు దగ్గర ఉన్న అనే ఫీలింగ్ మీకు కలగదు.. నన్ను మీ కొడుకుగా భావించండి..అయినా, ఆవు లేకుండా దూడ పుట్టదు కదా ! బంధం బాధ్యత కాదా ?" అన్నాడు మీనాక్షమ్మ రెండు చేతులు పట్టుకుని..

అవినాష్ చెప్పిన మాటలకి మీనాక్షమ్మ కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి...

ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకుని కొడుకుగా బాధ్యతలు స్వీకరిస్తాను అన్న అల్లుడు దొరకడం అదృష్టంగా భావించింది.తలుపు చాటు నుంచి అవినాష్ మాటలు వింటున్న ప్రియ తల్లిని అంత ప్రేమగా చూసుకునేవాడు దొరికాడని మురిసిపోయింది..

అవినాష్ తో పెళ్లికి ఒప్పుకుంది .

అల్లుడే కొడుకు అయితే,

అమ్మాయి ప్రేమ అంతా అతనికే సొంతం కాదా !?

ఆ ఇంటిలో,

దీపావళి పండుగ ముందే వచ్చింది .

కోటి కాంతుల కొత్త వెలుగులు తెచ్చింది.

-కె.కనకదుర్గ (గుంటూరు)

First Published:  7 Dec 2023 12:19 AM IST
Next Story