Telugu Global
Arts & Literature

సమాంతర రేఖలు

సమాంతర రేఖలు
X

ఉదయాన్నే

అరుణకిరణాన్ని చూసి

మైమరచి పోతా నేను

అది ప్రతిరోజు చూసేదేగా

అంటావు నీవు

ప్రతి పువ్వునూ పలకరిస్తానేను

వాటికి మాటలొస్తాయా

అంటావు నీవు

వానలో తడవడం నాకిష్టం

జలుబు చేస్తుంది వద్దంటావు

వెన్నెల్లో ఆకాశం వైపు

చూడటం నాకిష్టం

నిద్రపోతుంటావు నీవు

ప్రకృతిలో ప్రతీది ప్రత్యేకం

అంటాను నేను

ఏముంది కొత్తగా

నీ భ్రమ అంటావు నీవు

ప్రతి దానికి స్పందిస్తాను నేను

నీవొక పిచ్చివాడనంటు చూస్తావు

జతలో ఇద్దరం

ఆలోచనల్లో భిన్నత్యం

నీవు చూసేది అందం

నేను ఆశించేది సౌందర్యం

నాది భావుకత

నీది వాస్తవికత

మనమద్య కనీ కనపడని

పల్చని తెర

నా ఎదుట నీవు

నీ ఎదుటనేను

సమాంతర రేఖల్లా

కలిసి నడుస్తుంటాం

ఎప్పుడూ కలసుకోలేం

ఒకరినొకరు చూసుకుంటుంటాం

కలిసి ఉండలేం

భూమ్యాకాశాల్లా ...

కళ్లే వెంకటేశ్వర శాస్త్రి

First Published:  15 Sept 2023 12:05 PM IST
Next Story