యాత్రాకథనం: హంపి - తొలిసారి
సార్...రెండురోజుల హంపి యాత్ర
నూటయాభై రూపాయలు సార్
అంటూ ఒక ముసలి బాపనయ్య వచ్చి
మా నాయనకు చెప్పె ఆయన ఆకారమూ , అడిగిన విధానమూ చూసి
మా నాయన కాదనలేక
నన్ను మా యమ్మను పోయిరమ్మనె
అది అక్టోబరు 1974
నేను బి.కాం. రెండవ సంవత్సరం ....
మరుసటి వారంలో శుక్రవారం
మధ్యాహ్నం నేనూ మా యమ్మ
ఓవర్ బ్రిడ్జ్ కింద వుండే మూడవ రోడ్డులోకి పోయి
బస్సెక్కితిమి...బస్సు మూడుగంటలకు బయలుదేరె ...
ఉరవకొండ, విడపనకల్లు దాటినాక
కర్నాటక బార్డర్ దాటగానే
చేల్ గురికి అనే ఊరొచ్చె
అందరినీ బస్సు దిగమనిరి
అక్కడ గొప్ప అవధూత అయిన
ఎర్రిస్వామి తాత సమాది వుంది
ఆ సమాదిమీదే గుడికట్టుండారు
బస్సుదిగి ఎర్రిస్వామి తాత సమాదికి మొక్కొనిఆ తాత ధ్యానం చేసిన భూగృహం చూస్తిమి
భూమిలోపలకి మెట్లుదిగి పోతే
కింద భూమిలో వుంది ...అక్కడంతా
నిశ్శబ్ధం ప్రశాంతత పరుచుకోనుంది
పైన హాలులో సామి తూగుటుయ్యాల వుంది
పోయినోళ్ళందరూ దాన్ని పట్టుకోని ఊపితిమి.ఆ హాలునిండా గురువులూ, అవధూతల ఫోటోలు రకరకాలసైజులో తగిలిచ్చుండారు.భవసాగరాన్ని దాటి బయటకుపోయిన వాళ్ళందరినీ చూస్తే ఏదో చెప్పరాని భక్తిభావం గుండల్లో నిండిపోయె ...
ఆట్నుంచి బళ్ళారికి పోతిమి
బళ్ళారిలో బళ్ళారి దుర్గమ్మను చూస్తిమి
పసుపూ కుంకాలూ పూలహారాలతో
వెండి కన్నులతో, వెండి మీసాలతో
ఆయమ్మ లేసొచ్చినట్లుండాది ....
హొస్పేట మీదగా పోయి
రాత్రి ఎనిమిది గంటలకు హంపి చేరితిమి.స్వామి బస్సును విరూపాక్ష గుడిముందు నిలిపిఅందరినీ గుడి ప్రాకారమంటపంలో కూసొమనె
ఆ రాత్రికి ఆదే బసంట తొమ్మిదికల్లా అందరికీ భోజనాలు పెట్టె
మంటపంలోనే పండుకొమ్మనె ...
ఆ రోజు పున్నమి ...చుట్టూ వెన్నెల
గుడిమీద వెన్నెల ..మంటపంమీద వెన్నెలచూస్తాంటే ...అద్భుతంగా వుంది
విరూపాక్షుడు విజయనగర రాజుల ఇంటిదేవుడు.ఆయన సన్నిధిలో
వెన్నెల్లో నిద్రపోవడం ఏ పూర్వజన్మ పుణ్యమో అనిపించె ...
తెల్లవారగానే గుడివెనుకనున్న
తుంగభద్రమ్మలో మునిగి గుళ్ళోకి పోతిమి
లోపల విరూపాక్ష్యేశ్వరున్ని అమ్మవారిని దర్శించుకొని గుడిలోవుండే విశేషాలు
గైడుగా వచ్చినాయప్ప చూపించె
అన్నిటికన్నా ఆశ్చ్యర్యము గుడిలోపల
మంటపంలో ఒకచోట బయటుండే గోపురం లోపల కనపడతాండ్య..
అద్భుతంగాదేశంలో యాడ ఇట్లా కనపడదంట ...
గుడి బయటికివచ్చి చూస్తే
ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు
శిథిల దేవాలయాలు, కట్టడాలు
ఒక్కొక్కటి చూసుకుంటా పోతిమి ...
ఒక చోట శెనగగింజవినాయకుడుండాడు
ముగ్గురు మనుషులు చేతులుచాపి
పట్టుకున్నా ఆ స్వామి చుట్టుకొలత అందదు.కడుపూ తొండం పగలగొట్టిండారు ...
ఇంకోచోట సాసువుల గణపతుండాడు
ఆ స్వామి శానా పెద్దగుండాడు
ముందునుంచీ చూస్తే వినాయకుడు
వెనుకనుంచీ చూస్తే ఆడాయమ్మ వెనుకభాగం
ఏమని చెప్పేది ఆ శిల్పచాతుర్యం ...
ఇంకోపక్క గుండ్లపై జైనశైలిలో చెక్కిన
సిన్న సిన్న గుళ్ళుండాయి
ఎంత ముచ్చటగా వుండాయో
ఒకదాంట్లోనూ మూలవిరాట్టులు లేవు ...
ఇంకా ముందుకు పోయి
శ్రీకృష్ణదేవరాయలు కటకం జయించి తెచ్చిన శ్రీకృష్ణ విగ్రహానికోసం కట్టించిన గుడి చూస్తిమి.ఎంత పెద్ద గుడో లోపలా బయటా బయటినుంచీ చూస్తే రెండుచేతులూ సాపి ఆధిత్యమిచ్చేకి వస్తున్న ఆప్తునిలా వుంది ...
ఆ గుడి బయటే చాలా పొడవయిన
శిథిలమయిన రాయల బజారుంది
ఆడనే రత్నాలు వజ్రాలు రాశులుపోసి అమ్మేవారంట.నేడు మట్టిని రాశులు పోసుకోనుంది ....
అట్లే శ్రీకృష్ణదేవరాయల భువనవిజయ మందిరం విశాల మైదానంలో వున్నదాన్ని చూస్తిమి
భవనమంతా కూల్చివేయబడింది
భూమికి పదడుగుల ఎత్తులో పునాదిమాత్రం నిలిచింది
ఆ పునాదిపై అయిదంతస్తుల భవనముండేదంట
అంతా శ్రీగంధపు చెక్కలతోనూ
ఏనుగు దంతాలతోనూ చెక్కబడి వుండేదం.అందులోనే రాయలవారు విదేశీరాయభారులనుకలిసే
నేలమాళిగ వుంది ...
దాని పూర్వవైభవము తలచుకొంటే
గుండె తరుక్కుపోయింది ...
ముందుకు పోయి మహర్నవమి దిబ్బ చూస్తిమి.విశాలంగా దీర్ఘచదరంగా వున్న పెద్ద అరుగు.అదిమాత్రమే మిగిలింది
దానిమీదే సింహాసనంమీద కూసొని
కృష్ణరాయలవారు ప్రతి దశిమి పండక్కీ
సర్వసైన్యాధ్యక్షుని హోదాలో
సైనిక వందనం స్వీకరించేవాడంట ...
ఆ తొమ్మిదిరోజులూ సర్వసైన్యాలు
బంగారు,వెండి కవచాలతో ఆయుధాలతో ఏనుగులను గుర్రాలనూ ముస్తాబుచేసి రాయలవారికి గౌరవ వందనం చేసేవారంట ...
ఇవన్నీ ఆ కాలంలో విజయనగరాన్ని దర్శించిన పియాస్ మరియూ న్యూనిజ్ లనే ఫ్రెంచ్ దేశస్థులు రాసిన The Fergotten Empire అనే
పుస్తకంలో రాసినారంట ...వారు ప్రత్యక్ష సాక్షులంట ...
దానికి దగ్గరలోనే హజారా రామాలయం వుంది.అది విజయనగర రాజుల అంతఃపుర దేవళం
శానా అద్భుతమయిన శిల్పకళ లోపల బయటలోపల నల్లగ్రానైటు స్థంబాలతో
నున్నగా పాలిష్ చేయబడి అందంగావుండాయి.బయట ప్రాకారానికి .ఆ కాలంలో విజయనగరానికొచ్చిన
విదేశీయుల కట్టూబొట్లతో గుర్రాలు ఏనుగులు, కాల్బలాలు అందంగా చెక్కబడున్నాయి ...
అట్లే రాణివాసపు కోట ,కావలి బురుజు
లోటస్ మహాలు ,రాణుల స్నానాల పుష్కరిణి చూస్తిమి
ఏం మాట్లాడేదుందీ ఆ కాలంలోకి పోయినట్లుంది
చూడాలన్న తపన, చూసి తట్టుకోలేని గుండె తడి ...
ఇంకా ముందుకుపొయి విఠలాలయము చూస్తిమి
తుంగభద్రానది ఒడ్డునే వుంది
ఆ మంఠపములోనే పురందరదాసు కూచొని
కీర్తనలు రాస్తూ గానం చేసేవాడంట
తుంగభద్రమ్మ వింటూ సాగిపొయింటుంది
ఇప్పుడు కూడా ఆమె గత స్మృతులు
నెమరు వేసుకొంటూ నెమ్మదిగా సాగుతోంది ...
అట్లే అచ్యుతరాయల గుడి చూస్తిమి
అదో శిల్పకళల మచ్చుతునక
మీటితే సంగీతం పిడే స్థంబాలున్నాయి
శిల్పకళను గురించి చెప్పేకి నోరు చాలదు
రాయడానికి భాష చాలదు ...
ఎట్లో రాయల్లని రాస్తాండా ...
ఆ ప్రాంగణంలోనే ప్రపంచంలో ఎక్కడాలేని
రాతి రథం వుంది ...దేవేంద్రలోకంనుండీ
ఐరావతం వచ్చి ఠీవిగా నిలబడినట్లు ...
అది చూసే ఆత్రేయ గారు
ఏకశిల రథముపై భూదేవి ఒడిలోన
ఓర చూపులదేవి ఊరేగిరాగా ...అని
ఎదలో పొంగిపొయి రాశాడేమో...
అయినా ఓరచూపుల దేవిని చూసేకి ఈ రెండు కళ్ళూ
ఈ మనసూ చాలదేమో ...
రామాయణ కాలానికి అదే కిష్కిందట
సుగ్రీవుని గుహ చూస్తిమి
అక్కడికి దగ్గరలోనే కోదండ రామాలయం వుంది
అందులో నిలువెత్తు సీతారాముల విగ్రహాలున్నాయి
ఎంత అందంగా వుండారంటే
చూపు తిప్పుకోలేనంతగా ....
గజశాల, అశ్వశాల చూస్తిమి
గజశాలలో పదకొండు గదులున్నాయి
ఒక్కో గదిలో ఒక్కో శిల్పచాతుర్యముంది పైకప్పులోఎలా కట్టారో ఏమో !అవన్నీ
రాయలవారు, రాణులవారికి సంబందించిన పట్టపుటేనుగుల కోసం కట్టినవేమో శానా సింగారంగా వుండాయి ....
అయినా హంపి చూడాలంటే
ఒక వారం రోజులయినా చాలదంట
ఒక్కరోజులో ఏమి చూడగలం,ఎంత తిరగగలం.అందుకే అన్నారేమో
హంపికి పొయ్యేకన్నా ..కొంపలో వుండేది మేలని.విజయనగరాధీశుల అశ్వబలాలు పరిగెత్తినట్లు
పరిగెత్తి పరిగెత్తి చూస్తిమి ...
హంపినంతా చూసినాక నాకనిపించింది
హంపిలో జాగ్రత్తగా నడవాలని
ఎందుకంటే ఎక్కడ పాదం మోపినా
భూమిపొరల్లో ఏ హృదయంమీద
కాలువేసినట్లుంటుందోనని ....
హంపి కుడ్యాలమీద చేయివేస్తే
ఏశిల్పసుందరిలు కలతపడతాయోనని....
మరుసటిరోజు రాత్రి పన్నెండుగంటలకు
అనంతపురం చేరుకొంటిమి
నామట్టుకు నాకు హంపి
ఒక తీరని వేదన బ్రతుకంతా గుండేలో మండే ధుని !
దేవుడు వరమందిస్తానంటే
ఒకసారి ఆ కాలానికి తీసుకుపొమ్మనే గుండెధ్వని !!
- కైలాసనాథ్ (అనంతపూర్)