ప్రక్షాళన
బెంగళూరు వాతావరణం చల్లగా వుంది. రోడ్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా వుండటం వల్ల అనుకుంటాను, అందులోనూ రాత్రి పూట కూడా.
మేము బస్సు దిగేటప్పటికే రాత్రి పది గంటలయ్యింది. బస్సు దిగేటప్పటికే మా అల్లుడు రమేష్ కారు తీసుకొని రెడీగా వున్నాడు.
మమ్ములను ఇంటికి తీసుకెళ్ళడానికి, అరగంటలో ఇంటికొచ్చేసాము, అమ్మాయి. అల్లుడు అద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలుచేస్తున్నారు.
రమేష్ ఒక నెలరోజులు అమెరికాకు కంపెనీ పనిమీద వెళ్ళవలసి వచ్చింది.
అందుకని అమ్మాయి మంజు కు తోడుగా మమ్ములను ఆ నెలరోజులు వచ్చి ఉండమని అడగడంతో మేము బయలుదేరి వచ్చాము.
నెల రోజులు ఆడపిల్ల ఇంట్లో మనం ఉండటం మంచిది కాదని మా ఆవిడ అంటోంది. గానీ, మాకు ఒక్కతే కూతురు. ఇంక కాదనిచెప్పలేం కదా?
రాత్రి రావడం ఆలస్యమయినందు వల్లనూ, మేముతెచ్చుకున్న చపాతీలు, బస్సు వాళ్ళు భోజనానికి ఆపినప్పుడు తినడం వల్లనూ, బస్ లో రాత్రి ఎక్కువగాఏమీ మాట్లాడకుండా వెంటనే నిద్రపోయాం.
తెల్లవారు ఝామున ఏరోడ్రముకు వెళ్లి రమేష్ కు సెండాఫ్ ఇచ్చి, ఇంటికి వచ్చాము. అలసటగా వుండి బ్రేక్ ఫాస్ట్ కాగానే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. శనివారం కనుక మంజు కూడా కాసేపు పడుకుంది.లేచిన తరువాత మేము తెచ్చిన సూట్ కేసులు తెరిచి మంజు వాళ్ళకు ఇచ్చే పాకెట్స్ తీసి పక్కన ఉన్నటీపాయ్ మీద పెట్టాను నేను.
తల్లి, కూతుళ్లిద్దరూ వంట ప్రయత్నంలో పడుతున్నారు. "వంట నేను చేస్తాలే" అనివాళ్ళమ్మ అనగానే, మంజు'అంతే చాల్లే' అనుకుని నాదగ్గరకొచ్చింది. నేను స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు, పొళ్లు అన్నీ తీసి బయట పెడ్తున్నాను. మా కర్నూల్ లో దొరికే బొరుగుల వడియాలను స్పెషల్ గా రమేష్ కోసంతెచ్చాను. "అవన్నీ తీసి సర్దుకో మంజు" అన్నాను నేను.
సోఫాలో కూర్చొని మేము తెచ్చిన స్వీట్ తింటున్నమంజూ. "ఆ టీపాయ్ మీద వుంచులే నాన్నా, మళ్ళీ తీస్తాను" అంది.
ఆ మాట విని వంటింట్లో నుంచి వాళ్ళమ్మ ఒకసారి తొంగిచూసి, ఎందుకో మంజు ను ఏమీ అనకుండానే లోపలికెళ్ళి పోయింది, కొద్ది సేపటికి మంచినీళ్ళ కోసం లోపలి కెళ్లినప్పుడు చూశాను. వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని బీన్స్ వలుస్తున్నది. జూనీ దృష్టి ఎక్కడోఉన్నట్లుంది. ఆలోచనలో పడిపోయి ఉంది. వంటింట్లో ఒకసారి చుట్టూ చూశాను. గ్యాస్ స్టవ్ చుట్టూ గిన్నెలుపడివున్నాయి. సింక్ లో గిన్నెలు, డైనింగ్ టేబుల్ మీద రకరకాల డబ్బాలు, సీసాల్లో, పచ్చళ్ళు అడ్డదిడ్డంగా పడివున్నాయి. మంజు ఇల్లు సరిగా సర్దలేదనిపించింది.
నాకు . వాళ్ళమ్మ దీర్ఘాలోచనకు అదే కారణమేమో అనిఅనుకుంటూ బయటకొచ్చాను.
ఇంతలో మంజు "అమ్మా" అంటూ లోపలికొచ్చి,“ఏం కూరలు చేస్తున్నావు" అంది.
"బీన్స్ కూర, ఆకు కూర పప్పు చేస్తున్నాను మంజూ " అంది భాగ్యలక్ష్మి, “అంతేనా, ఏదైనా వెరైటీగాచేయకూడదామ్మా, "అంది మంజు.
"ఏం కావాలి చెప్పు" అంటోంది. భాగ్యలక్ష్మి, మంజు ఏదో చెప్తోంది. నేను ఇవతలికి వచ్చి హాల్లో చుట్టూ చూశాను. ఇల్లంతా కూడా కొంచెంగందరగోళంగానే ఉంది. ఎక్కడ పడేసిన సామాన్లు
అక్కడే పడున్నాయి న్యూస్ పేపర్స్, దువ్వెనలు,సోఫాలో, టి.వి. స్టాండ్ మీద లాప్ టాప్ లు, ఛార్జర్స్ చిందర వందరగా వున్నాయి.. ఇద్దరూ ఉద్యోగస్థులు, ఉదయం వెళితే రాత్రికి వస్తారు. ఇంటికి వచ్చిన తరువాత కూడ కాల్స్ వస్తూనే ఉంటాయి. బాగా బిజీ గానే ఉంటారు. అయినా మంజు కూడా ప్రతీ శని ఆదివారాలు సెలవులే కనుక, ఏదో ఒకరోజైనా ఇంటిని సర్దుకోవచ్చు కదా అని నాకుఅనిపించింది.
అంతలో వంటింట్లో నుండి పచ్చిమిర్చిబజ్జి ల వాసన నన్ను అటు లాగింది.తరువాత .. మధ్యాహ్నం భోజనం చేసి, మంజు కాసేపు నిద్ర పోయింది. వాళ్ళమ్మ వంటింటిని ప్రక్షాళన చేసే పనిలో పడింది.
సాయంత్రం మంజు నిద్ర లేచిన తరువాత మాత్రం, వాళ్ళమ్మ మంజును వదిలి పెట్టలేదు.
నెమ్మదిగా ఒక్కొక్కటి అడుగుతూ, వివరిస్తూ ఉండటం, టి.వి. స్టాండ్ సర్టి పెడుతున్న నాకు వినిపిస్తూనే ఉంది.
నాకు కొంచెం నవ్వు కూడా వస్తోంది. మంజూ ,బీరువాలో బట్టలెందుకు అన్నీ కుక్కి పెట్టినట్లుగా పెట్టావు,
కనీసం వారానికొక రోజయినా సర్దుకోవలసిందికదా? రమేష్ కూడా బాగానే హెల్ప్ చేస్తాడుకూడా." అంది భాగ్యలక్ష్మి.
"సర్దుకో వాలమ్మా!"
అంది మంజు 'చేస్తాం లే అన్నట్లుగా, "పనిపిల్ల బాగానే వస్తోందా? గిన్నెలు బాగా కడుగుతున్నట్లుగా లేదు" అనే ప్రశ్నకు "వస్తోందమ్మా
ఉదయాన్నే వస్తుంది. మేము గబగబా రెడీఅవుతూ వుంటాము. అప్పుడు ఆమె కూడాగబగబా పనిచేస్తుంటుంది" అంది.
"అయితేమాత్రం ఏం పని చేస్తుందో గమనించొద్దు?అప్పుడప్పుడూ మనం తొంగి చూస్తూ ఉంటే భయంగా చేస్తారు. బాత్రూం అలా ఉంటే ఇన్ఫెక్షన్స్ రావూ?"
భాగ్యలక్ష్మి నెమ్మదిగానే మంజును మందలిస్తోంది,స్పష్టంగా జాగ్రత్తలు చెప్తోంది.
ఒక్కతే కూతురని కొంచెం గారాబం చేసిన మాటనిజమే కానీ భాగ్యలక్ష్మి ఇల్లు శుభ్రంగాఉంచుకుంటుంది. అదంతా మంజుకు తెలియంది
కాదు. కానీ ఈ కాలం పిల్లలు సిస్టం ముందున్నంత శ్రద్ధగానూ , ఫోనులో, నెట్, వాట్సప్, ఫేసుబుక్ లు
ఉపయోగించినంత ఇష్టంగానూ వంటింట్లో కప్ బోర్డులు
సర్దుకోలేదు. పాపం",
"వాషింగ్ మెషిన్లో బట్టలు ఎన్ని రోజులయ్యింది వేసి" టబ్ నిండా ఉన్న, విడిచిన బట్టలను చూస్తూ,
వాళ్ళమ్మ అనగానే "రెండు రోజుల నుంచి పనిపిల్లరాలేదుగా" అంది" మంజు,
"వాళ్ళు రాకుంటే బట్టలు
వేసుకోలేమా, మంజు? తడి టవల్ తీసి మంచి కలర్ ఉన్న నీ డ్రెస్ మీద వేస్తే, రంగులన్నీ కలిసి పొయ్యి
డ్రెస్ పాడవుతుంది కదా! కనీసం మంచి డ్రెస్ లయినా నువ్వు మెషిన్లో విడిగా వేసుకోవాలి కదా" ఇలాఅంటూ మంజు చేత మంచి డ్రెస్ లు వేరు చేయించి మెషిన్ లో వేయించింది. భాగ్యలక్ష్మి టైమర్ పెడ్తూ ఉంటే
"మా పనిపిల్ల రెండు నిముషాలు తిరగ గానే (డైయ్యర్ లో
వేసి, అక్కడ రెండు నిముషాలు తిరగ గానే తీసిఆరేస్తుంది" అంది మంజు .
"అయ్యో అలా అయితే బట్టలకున్న చెమట, మురికిఎలా పోతాయి ?" ఆశ్చర్యపోయింది. వాళ్ళమ్మ
"అందుకే మనింట్లో ఎప్పుడో ఒకసారైనా పనిచెయ్యమని
చెప్పేది" విసుక్కుంటూ అంది భాగ్యలక్ష్మి,
"అది కాదమ్మా,వాళ్ళు దే
వే రే ఇంటికి వెళ్ళాలి కదా! అందుకే త్వరగాచేస్తుంటారు", అంటూ .... అవతలికి వెళ్ళింది మంజు.
ఆ తరువాత కొద్దిసేపు ముగ్గురూ టీ తాగారు.భాగ్యలక్ష్మి విశ్రాంతిగా కూర్చుని తను తెచ్చిన స్వీట్స్
మొదలైనవి ఏవి ముందుగా వాడాలి. ఏవిత్వరగా చెడిపోతాయి అని వివరంగా చెప్పి, సర్దిపెట్టించింది. తరువాత బెడ్ రూమ్ లోకెళ్ళారు ఇద్దరు. భాగ్యలక్ష్మి బట్టలు మడత పెట్టి ఇస్తూ ఉంటే, మంజు అరల్లోసర్దుకుంది. ఈ మధ్యలో బంగారు ఇయర్ రింగ్స్ చూపించింది మంజు, బర్త్ డేకు
రమేష్ కొని ఇచ్చాడని, తెలుపు, ఎరుపు రాళ్ళున్నాయి. బాగున్నాయని మెచ్చుకుంది
సాయంత్రం నేనలా పక్కనే ఉన్న పార్కు కు వెళ్లి కాసేపు తిరిగి వచ్చాను.
ఇంటికొచ్చిన తరువాత చూశాను, రూమ్ లో ఒక మూలన చిన్న సైకిల్ ఉండటం.ఎక్సర్ సైజ్ కోసం తెచ్చినట్లున్నారు. కానీ వాడుతున్న ఛాయలేవీ కనపడలేదు. బాగా
మట్టినిండి వుంది సైకిల్ కు, కొత్తల్లో వాడి ఉంటారు. మోజు తీరగానే పక్కనపెట్టేశారు..
"మంజూ !వారానికొక రోజైనా
తొ క్కొచ్చు కదమ్మా?" అని అంటే "టైం ఉండటంలేదు నాన్నా" అంది.
హాల్లో టి.వి. చూస్తూ తొక్కినా సరిపోతుంది. నేను క్లీన్ చేసి పెడ్తాను, ప్రతీసాటర్డే లేదా సండే కాస్త వ్యాయామం చేయండి. ఆరోగ్యానికి మంచిది కదా? నిన్ను
మాత్రమే అంటున్నామనుకోకు మంజూ, ఇద్దరూ కూడా కొంచెం ఆరోగ్యం గురించిఆలోచించాలి" అని సైకిల్ క్లీన్ చేసే పనిలో పడ్డాను నేను.
"మంజు, ప్రతి సాటర్డే, సండే బయటకు వెళ్తున్నారా. భోజనానికి " అని వాళ్ళ అమ్మా అడిగితే "ఆ వెళ్తున్నాము" అంది. "ప్రతివారం ఎందుకమ్మా?ఒకవారం గ్యాప్ ఇచ్చి చూడండి. సువ్వారోజు నీకొచ్చిన స్పెషల్ వంటలుచేసి చూడు. రమేష్ ఎలాగు హెల్ప్ చేస్తాడు. ఊరికే
కూర్చోడు కదా. డబ్బుకు డబ్బు ఆదా. ఆరోగ్యానికిఆరోగ్యం కూడానూ." అనగానే "చేస్తున్నా నమ్మా.
మొన్న వారం పెరుగన్నం చేశాను. " అందిమంజు చపాతీలో ఆలుకూర ఇష్టంగా తింటూ.
"పెరుగన్నమా? గొప్ప పని చేశావు. "
కోపంగా అంది వాళ్ళమ్మ. నాకు నవ్వుతో పొరపోయింది. "ఏదైనా గారెలుగాని,పులిహోరగాని చెయ్యొచ్చు గరా?" అంటే
“అబ్బ చాలా టైం పడుతుందమ్మ. అందుకే సింపుల్ గా చేస్తాను" అని మంజుఅనగానే, ఏమీ అనలేక డీలా పడిపోయింది వాళ్ళమ్మ.
తెల్లవారి ఆదివారం, లేటుగా లేచింది మంజు, గోధుమపిండి, బియ్యప్పిండి కలిపిఅందులో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి దోసెలు వేస్తోంది భాగ్యలక్ష్మి
“అబ్బా, దోసెలు వేద్దామనుకుంటా కుదరటంలేదు" బ్రష్ చేసుకొని వస్తూ అందిమంజు. సరేలే ఈ పూటకు రెడీమేడ్ దోసె పిండితో చేశాను తినేసేయ్” అంది ప్లేట్ లో
రెండు దోసెలు వేసిస్తూ భాగ్యలక్ష్మి,
"మంజూ !ఫ్రిడ్జ్ లో తరిగిన ఎర్రగడ్డలు, టమోటాలు పెడున్నావెందుకు?" అంటే “ఒక్కోసారి ఎక్కువపుతాయ్" అంది మంజు, ఏం చెయ్యాలో తెలియలేదన్నట్లుగా.
“ఉదయం తరిగింది. రాత్రికి,
రాత్రి తరిగింది. ఉదయానికి వాడుకోవచ్చు బైటే కప్ లో పెట్టి మూత పెట్టు- అయినా ఎర్రగడ్డలు, టమోటాలు, ఆలు, అరటి పండ్లు
ఫ్రిడ్జ్ లోపెట్టకూడదని నీకు తెలుసుకదా ?" భాగ్యలక్ష్మి చెప్తూ ఉండగానే
“తెలుసులేమ్మా" అంది మంజు చిన్నగా, విసుక్కుంటూ.
"ప్రిడ్జ్ లో ఏమున్నాయో ఒక స్లిప్లో రాసి తలుపుకు అంటిస్తే ఏవి త్వరగా
చెడిపోతాయో అవి ముందుగా వాడుకోవచ్చు. డోర్ ఎక్కువ సేపు తెరిచి ఆలోచిస్తూనిలబడకుండా సరిపోతుంది. రెండు వారాల కొకసారైన ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. నువ్వుచెప్తూ ఉంటే అల్లుడుగారు రాసి పెట్టారు కదా!" భాగ్యలక్ష్మి చెప్తూనే ఉంది. మంజు" సరేలేమ్మా" అంటూ దోసెలు ఇంకో రెండు వేసుకొని, ప్లేట్ తీసుకొని హాల్ లోకి
వెళ్లిపోయింది. భాగ్యలక్ష్మి నిట్టూర్చింది. "అయ్యో రామ' అనుకుంటూ.
మధ్యాహ్నం వంట చేస్తున్నప్పుడు మంజు కూరలు తరిగి ఇచ్చింది. కూరలుతరుగుతూ ఉన్నప్పుడు "మంజూ ! కుక్కర్ ఏమిటి ఇలావుంది, లోపల గార పట్టినట్లు ఉంది.రోజూ కడగడం లేదా" అని భాగ్యలక్ష్మి అంటే "లేదమ్మా, పనిపిల్లకు గిన్నెలుఎక్కువైతాయని పది రోజులకొకసారి కడుగుతుంది" అంది మంజు.
"అదేమిటమ్మాయ్. అలా చేస్తే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవదూ? చదువుకున్న పిల్లలు. మీకుమేం చెప్పాలా? ఈ స్టవ్ బర్నర్లు చూడు, చుట్టూ ఎలా డర్టీగా వున్నాయో ..అప్పుడప్పుడూ స్పూన్ తో ఐనా ఆ జిడ్డు గీకేసేయ్యాలి కదా.." అంటే "స్టవ్ రోజూ ఏమి తుడుస్తామమ్మా. వారానికొకసారి తుడుస్తాను" అంది అదేదో సామాన్యమైన విషయమైనట్లుగా, వారానికొకసారా?" విస్తుపోయింది వాళ్ళమ్మ.
"పనిపిల్లకు గిన్నె లెక్కువైతాయని కుక్కర్ కడగకుండా చేసుకుంటావా. నువ్వైనావట్టిగా నీళ్ళతో అయినా కడుగుతల్లీ. లేదంటే ఒకరోజు చిన్న
కుక్కర్ ఒకరోజు పాన్ వాడు. ఒకరోజు ఓవెన్లో చేసుకో" భాగ్యలక్ష్మి విసుక్కుంటూ అంది.
"ఏం చెయ్యనూ, పనిమనిషి విసుక్కుంటుంది. మరీ"
అంది బిక్కమొహంతో మంజు...
"అలా కాదు. మంజు, పనిపిల్లకు ఇంకేదైనాపని తగ్గించు. లేదా వంద రూపాయలుఎక్కువ ఇస్తానని చెప్పి, కుక్కర్ రోజూ కడగమనిచెప్పు .స్టవ్ కూడా సింక్ కడిగినప్పుడేకడగమసు.
స్టామీదపడిన ఆహార పదార్థాల వల్ల పురుగులు చేరుతాయి కదా? బాత్రూం, వాష్ బేసిస్ కడగాలి. ముఖ్యమైన పనులు చేయించుకోండి రేపొస్తుందిగా నేను మాట్లాడతాలే.
అయినా రమేష్ ను కూడా పనివాళ్లని కొంచెం గమనిస్తూ వుండమనీ చెప్పొచ్చుగా" అంటే
"అమ్మో నువ్వొద్దు, నేనే మాట్లాడతాలే. వాళ్ళుమానేస్తే నాకు ఇబ్బంది.. నాకు ఎక్కువ టైం ఉండటం లేదమ్మా" అంది మంజు ఏం చేద్దామన్నట్లుగా. మళ్లీ "రమేష్ వాళ్ళనేమైనా అనడం నేనింత వరకూ చూళ్లేదులే." అంది.
"నిన్ను పూర్తిగా చేసుకోమనటం లేదు. పనిపిల్ల మీద పూర్తిగా ఆధారపడకుండా అప్పుడప్పుడూ ఇద్దరూ గమనిస్తూ ఉండాలి. చెప్తూ ఉండాలి. వాళ్ళు రాకుంటే ఎలాగా
అనే భయం మీకుందని తెలిస్తే ఇదిగో ఇలా పని చేస్తారు. వాళ్ళు" అంది భాగ్యలక్ష్మి నచ్చచెబుతున్నట్లుగా,
"ఏం చేస్తామమ్మా. ఒక్కోసారి పనిపిల్లకు తాళం చేతులు ఇచ్చి వెళ్తాము.. వాళ్ళే పని చేసుకొని వెళ్తారు. ఇంకా మేము చెప్పెదేప్పుడు? ఇక్కడ అంతా అలానే చేస్తారు. అలవాటైపోయింది. ఇంకనుంచి నువ్వు చెప్పినట్లు సెలవురోజుల్లో అయినా చూడాలి".
అంది మంజు ఆలోచిస్తూ, మధ్యాహ్నం భోజనాలయిన తరువాత ముగ్గురు కూర్చున్నప్పుడు మంజు ఇలాఅంది "ఎప్పుడూ ఇంత తీరిక మాకు ఉండదు. ఐరన్ వాళ్ళు తెచ్చిన న బట్టలు కనీసం
బీరువాలో కూడా పెట్టే టైం కూడా ఉండదు. ఒక్కోసారి. సెలవు రోజుల్లో ఎక్కువనిద్రపోతాము. రోజు ఉదయాన్నే గబగబా వెళ్లి, లేట్ గా వస్తాము కదా. అందుకని బాగా అలసటగా వుంటుంది. " అంది మంజు.
ఆ మాటలకు "కొద్ది రోజులకు అలవాటవుతుందిలే, మంజు, ఇప్పుడే కదా చదువులు పూర్తయ్యింది. నెమ్మదిగా నువ్వే చక్కగా ఇల్లు సర్దుకుంటావులే. కంగారు పడకు" అన్నాను నేను నచ్చచెబుతున్నట్లుగా, "మేమున్నన్ని రోజుల్లో ఇల్లు చక్కగా సర్ది పెట్టి వెళ్తాము. తరువాత మీరు కంటిన్యూచెయ్యండి " అంది భాగ్యలక్ష్మి, "అంటే మీ ఇల్లు ప్రక్షాళన చేసి వెళ్తామన్న మాట."అన్నాను నేను నవ్వుతూ. తల్లీ కూతుళ్లిద్దరూ కూడా శ్రుతి కలిపారు.
కె. లక్ష్మీ శైలజ