ఒక సందర్భం (కవిత)
అనేక విషయాల నుంచి పారిపోయి
ముఖం చాటేసుకు
తప్పించుకు తిరిగుతున్న మనం
ఆరు రోడ్ల కూడలిలో కూడా
ఎదురెదురు పడే స్థితి
ఒక సందర్భంలో వస్తుంది
మనకు ఏం కావాలో
మనకు ఏం రావాలో తెలియదు
సక్తు కిలాఫ్ శత్రువు ఉండడు
జాన్ ఇచ్చే దోస్తూ ఉండడు
ఎల్లకాలం తాబేలులా
డిప్పలో జెప్పన దాకుంటాం
కలువని చేతుల్లా
కరిగీ కరగని మనసుల్లా
మనది మనకు తెలియని నొప్పితో
బొప్పి కట్టిన నొసలులా
ఏదో పోగొట్టుకున్నట్టు రికామిగా
గాయి గాయి గా తిరుగుతుంటాం
మనకే ఎంత తెలిసినా
తెలియని అనిచ్చిత అస్తిమిత
గట్ల కట్లు తెంచుకొని
ప్రవహించని
నిలువ నీరులా
కుళ్ళి కంపు కొడుతుంటాం
సుగంధ ద్రవ్యాల పరిమళభరితమైన
నీటిలో ఉన్నట్టు
నువ్వు కావాలని
ఎరను మింగాలనుకుంటావు
నిన్ను సర్రున పరపరా కోసే
అప్పటికే ఆయుధమున్న
ఒర అరలో ఒదిగి
పోవాలనుకుంటున్నావు
కలువాల్సిన నిలబడాల్సిన
కలెబడాల్సిన ఎదురు బదురుగా
మనకే కాదు
ఎవరికైనా
ఎదురెదురు పడే
ఇక తప్పించుక తిరుగలేని
ఒకానొక సందర్భం తప్పకుండా ఏతెంచుతుంది
- జూకంటి జగన్నాథం