Telugu Global
Arts & Literature

ముసుగుతో గుద్దులాట

ముసుగుతో  గుద్దులాట
X

కరోనా పేరు చెబితే చాలామంది హడలిపోతున్నారు. వస్తూనే కొందరు మహానుభావుల్నీ, ఎందరో అభాగ్యుల్నీ అది పొట్టన పెట్టుకుంది. మన దేశానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తోంది.

జనం మాత్రం కరోనాకి భయపడటం లేదు. ప్రభుత్వం నిబంధనలు విధిస్తే, మొక్కుబడికి పాటిం చడం, ఎప్పుడు తీసేస్తారా? అని ఎదురుచూడ్డం, నిబంధనలు కాస్త సడలిస్తే రెచ్చిపోవడం.. అదీ వరస!

''నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే అయినా- మీరు భయపడాల్సింది లేదు. అది ఆర్భాటం చేసేటంత గొప్ప జబ్బు కాదు. కొత్త రకం జలుబు. అంతే! కొత్తరకం కాబట్టి, దానికింకా సరైన వైద్యం తెలియదు. మనం చెయ్యాల్సిందల్లా తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడం, మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం పాటించడం. అది మన దరికి రాదు, రానేరాదు'' అంటూ మీడియా ద్వారా నాయకులూ, ఆస్పత్రుల్నించి డాక్టర్లూ హెచ్చరికలతో హోరెత్తించేశారు.

కానీ కిందనుంచి పైదాకా అన్ని తరగతులవారూ -వారి వారి స్థాయిల్లో విలాసాలకి అలవాటు పడ్డ కాలమిది. 'అది జలుబులాంటి మామూలు జబ్బు. భయపడొద్దు' అన్న మాటొక్కటే పట్టించుకున్న జనం- మిగతా హెచ్చరికల్ని అంతగా పట్టించుకోలేదు. వాళ్ల తీరు చూస్తుంటే, కరోనా అలలు అలలుగా రెండోసారే కాదు, మూడు, నాలుగు ఐదుసార్లు కూడా రావచ్చనిపించింది. ఆ అనుమానంతో గుండెల్లో గుబులు మొదలైంది.

నేనేం చిన్నదాన్ని కాదు. నాకిప్పుడు అరవై ఐదు. మా వారికి డెబ్బై.

మాకేదో అయిపోతుందనో, మేం లేకపోతే ప్రపంచానికి నష్టమనో ఇద్దరం అనుకోవడం లేదు. కానీ కరోనా భయం లేకపోతే- మా ఇద్దరికీ అసౌకర్యం అనిపించే అనారోగ్యాలేం లేవు. హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేసి ఆస్పత్రి పాలైతే- మాతోపాటు, పిల్లలకిద్దామని దాచుకున్న కాసిని డబ్బులూ- ఆస్పత్రి పాలౌతాయన్న బాధ ఒకటి. పిల్లలపై ఆధారపడకుండా, వాళ్లని శ్రమ పెట్టకుండా మా పొల్లు మేం పోసుకుంటున్న వాళ్లం- ఉన్నట్లుండి వాళ్లకు మా సేవాభారం తగిలించడం ఇష్టం లేకపోవడం మరొకటి.

ఉండేది ఇద్దరం. ఇల్లు దాటి బయటకెళ్లడం పూర్తిగా మానేశాం.

ఫోన్‌ చేస్తే మార్వాడీ సరుకులు తెచ్చిస్తాడు. ఆన్లైన్లో ఆర్డరిస్తే కూరలు ఇంటికొస్తాయి.

వాళ్లకి ఇవ్వడానికి డబ్బులకోసం ఏటిఎం అవసరం లేదు. పేటిఎం, గూగుల్‌ పే ఉన్నాయి. మన చేతికి ఎవరి మట్టీ అంటకుండా పేమెంట్సు అయిపోతాయి.

ఇక కావాల్సింది మాస్కులు. బయటకు వెళ్లడం లేదు కదా అని, అవి లేకుండానే గడిపేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో నేనేమో చీరకొంగూ, ఆయనకి రుమాలూ- అవే మాస్కులు.

కానీ క్రమంగా కరోనా గురించిన బెదిరింపులు తెగ పెరిగిపోతున్నాయి. గాల్లో కూడా కరోనా ఉండొచ్చనీ, పెరట్లో తిరిగినా మాస్కు పెట్టు కోవాల్సిందేననీ అంటున్నారు.

రుమాలు అస్తమానం ఊడిపోతోందని, పెరట్లో కరివేపాకు కొయ్యాలన్నా మావారు చిరాకు పడుతున్నారు.

ఓరోజు మావారు పెరట్లో రుమాలు మాస్కుతో ఇబ్బంది పడ్డం- మా పక్కింటబ్బాయి చూశాడు. అతగాడు ఒంటరి పక్షి. ఎనిమిది దాటితే కానీ ఇంట్లోంచి బయటకు రాడు. పది దాటితే తలుపులు మూసేసి వర్క్‌ ఫ్రం హోం. అప్పుడప్పుడు ఆఫీసు కెడతాడు. అలాంటప్పుడు తొమ్మిదికల్లా ఇంట్లో బయల్దేరిపోతాడు. మేమతడి కళ్లబడ్డం తక్కువ. ఈ కరోనా రోజుల్లో ఇంకా అరుదు.

అతగాడు మావార్ని చూసి, ''అయ్యో అంకుల్‌! ఇలా సేఫ్‌ కాదు. మంచి మాస్కులు పెట్టుకోండి'' అన్నాడు. తను బుద్ధిమంతుడే, మాస్కు పెట్టుకున్నాడు.

''మాస్కులకు మంచీ చెడ్డా ఎలా తెలుసుకోవాలో తోచక, మేము ఆన్లైన్లో ఆర్డరివ్వలేదు'' అన్నారాయన.

''మీకు మంచి మాస్కులు నేను తెచ్చిపెడతాను. ఇద్దరికీ చెరో రెండు సెట్లూ తెచ్చేదా?'' అని ఆఫరిచ్చాడతడు.

ఆయన వెంటనే, ''మూడు సెట్లు. మా చంపకి కూడా కావాలి'' అన్నారాయన.

''చంప అంటే మీ పనమ్మాయికేగా! తనెప్పుడూ మాస్కెట్టుకోగా చూడలేదే!'' అన్నాడా కుర్రాడు.

ఆశ్చర్యపోయాను. మా చంప ఆరింటికల్లా వచ్చి ఇంటి చుట్టూ కడిగి ముగ్గేసి పావుగంటలో వెళ్లిపోతుంది. మళ్లీ పదిన్నరకి వచ్చి ఓ అరగంట ఇంట్లో పనులు. పదకొండుకి పెరట్లోకెళ్లి ఐదంటే ఐదు నిమిషాల్లో బట్టలుతికా ననిపించి, మరో రెండు నిమిషాల్లో వాటిని పిండాననిపించి, ఇంకో నిమిషంలో వాటిని ఆరేసాననిపించి వెళ్లిపోతుంది. కానీ చంపని ఇతడు చూడ్డమే కాదు, మాస్కు పెట్టుకోదని కూడా గమనించాడు.

''కుర్రాడు కదా'' అనుకుని, ''మాస్కుకి డబ్బుల్లేవంటుంది. చీరకొంగు అడ్డెట్టుకోవే అని ఎప్పుడంటే అప్పుడే- పెట్టుకున్నానమ్మా, ఇప్పుడే తీసేశా- అంటుంది. అంటే, మనం కొనిస్తే తప్ప పెట్టుకోదన్నమాట! తప్పదు, అవసరం మనది కదా'' అన్నాను.

మెత్తగా మాట్లాడతాను కదా, నా నిర్ణయం ఇంత కఠినంగా ఉంటుందనుకున్నట్లు లేదు చంప. అనుకోనిదేదో జరిగినట్లు అప్రతిభురాలై వెళ్లిపోయింది.

లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఈ వార్తెలా పాకిందో కానీ, కాసేపటికే ఓ దీపిక పని కావాలనొచ్చింది. చూస్తే ముఖానికి మాస్కు లేదు. పోనీ బయటి పనులు చేయించుకుందాంలే అనుకుని, ''మాస్కెట్టుకోలేదేం?'' అనడిగాను.

దీపిక వెంటనే, ''ఎలా పెట్టుకుంటాను, ఉమ్మేసు కునేందుకు అడ్డు కదమ్మా!'' అంది.

ఇంకేమంటాను- వెళ్లమన్నాను.

ఈ వార్త కూడా త్వరగానే పాకినట్లుంది. రెండ్రోజుల తర్వాత మాస్కెట్టుకున్న పనమ్మాయి వచ్చింది. తన పేరు పద్మ అని చెప్పి, నా షరతులన్నీ ఒప్పుకుని పనిలో కుదిరింది. ఒక్కసారి కూడా మాస్కు తియ్యకుండా పది రోజులు చక్కగా పని చేసింది.

పదకొండోరోజున ఏమయిందో మరి తను మాస్కు లేకుండా వచ్చి మా ఇంటి గేటు బయట నిలబడిరది.

''మాకు వేరే మనిషుంది. నువ్వు వేరే ఇల్లు చూసుకో'' అని నేను లోపలకి రానివ్వలేదు.

''ఒక్కరోజు మాస్కెట్టుకోలేదని పని మానిపిం చేస్తావా? నాకూ పౌరుషముంది. చేసిన పది రోజులకీ లెక్క కట్టి జీతమిచ్చెయ్‌. వెళ్లిపోతాను'' అంది తను వెంటనే. అంతవరకూ ఎవరో కొత్త పనిమనిషను కున్నాను. అప్పుడు తెలిసింది నాకు తను పద్మ అని.

''నువ్వా, పద్మా! మాస్కు లేకుండా ఒక్కసారి కూడా నీ మొహం చూడలేదుగా! గుర్తు పట్టలేక పోయా'' అని వెంటనే సంజాయిషీ ఇచ్చాను.

''మరీ అంత గుర్తు తెలియకుండా ఉంటుందా! కావాలనే మీరలా అన్నారు. నేను పని మానేస్తాననగానే మాట మారుస్తున్నారు'' అని తన మాటమీదే నిలబడిరది పద్మ.

ఈ వార్త కూడా త్వరగానే పాకినట్లుంది. ఆ తర్వాత రెండ్రోజులకి మా ఇంటి గేటు బయట మాస్కు ధరించిన కొత్త పనమ్మాయి కనబడిరది. నా షరతులు చెప్పగానే, ''పద్మ చెప్పిందమ్మా! ఏదో పంతమొచ్చి మానేశా కానీ మంచిల్లు. వెళ్లి పని చేసుకోమంది'' అని వినయంగా పనిలో చేరింది.

చంద్రిక పని నాకు బాగా నచ్చి ఎంతో సంతోష మైంది, ''ఇదివరకు చంప, తర్వాత పద్మ ఇలా బాగా పనిచేశారు. మాస్కెట్టుకోలేదని చంపని నేను మానిపిస్తే, మాస్కు లేనప్పుడు గుర్తించలేదని కోపమొచ్చి పద్మ తనే మానేసింది. నువ్వు చక్కగా మాస్కెట్టు కుంటున్నావు. మున్ముందు పద్మతో వచ్చిన ఇబ్బంది రాకుండా, ఓసారి నీ మొహం చూపించు'' అన్నాను ఓ వారం తర్వాత.

కాసేపు నసిగినా చివరకు చంద్రిక తన మాస్కు తొలగిస్తే, ఆమె చంప!

- జొన్నలగడ్డ రామలక్ష్మి

First Published:  1 Jan 2023 5:01 PM IST
Next Story