సృజనలో కొత్తదనం - రచనలో సారళ్యం
గత అయిదు సంవత్సరాలుగా వరుసగా అటు కవిత్వమూ, ఇటు వచనమూ రాస్తున్న రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆమె వెలువరించిన 'ఎడారి చినుకు' దీర్ఘ కవిత, 'చీకటి వెన్నెల' కథా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 22వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో జరగనుంది.
గత అయిదు సంవత్సరాలుగా వరుసగా అటు కవిత్వమూ, ఇటు వచనమూ రాస్తున్న రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆమె వెలువరించిన 'ఎడారి చినుకు' దీర్ఘ కవిత, 'చీకటి వెన్నెల' కథా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 22వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో జరగనుంది. పాలపిట్ట బుక్స్ అండ్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో వేదిక మీద అంతా మహిళలే ఉండటం విశేషం. సభకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకవితను కొండేపూడి నిర్మల, కథల సంపుటిని సమ్మెట ఉమాదేవి ఆవిష్కరిస్తారు. ఈ పుస్తకాల మీద పింగళి చైతన్య, అపర్ణ తోట, మానస ఎండ్లూరి, నస్రీన్ ఖాన్ ప్రసంగిస్తారు. సభని కళా తాటికొండ నిర్వహిస్తారు.
2019 నుంచి ఝాన్సీ కొప్పిశెట్టి రచనలు పరంపరగా వెలుగు చూస్తున్నాయి. మొదట కవిత్వం ద్వారా వారు పాఠకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత వారి వచనం పరిచయమైంది. కవిత్వం తరువాత కొన్ని కథలు రాశారు. అనంతరం నవలలు రాయడం ఆరంభించారు. వారి కవిత్వంలో కొత్తదనం కనిపించింది. వచనంలో రీడబులిటీ వుంది. ఆమె వాక్యనిర్మాణంలోని సరళత ప్రధాన ఆకర్షణ. పరుగెత్తించే వచనం కారణంగా వాక్యాల వెంట పాఠకులు సాగిపోతారు. ఎక్కడా ఆగిపోవాలనిపించదు. పుస్తకం పక్కన పెట్టాలనిపించదు. పాత్రల చిత్రణలోనూ సంయమనం వుంది. జీవితాన్ని చిత్రించడంలో తనదయిన దృష్టికోణం వుంది. అయితే మనుషులను వారి బలాలు, బలహీనతలతో పాటు చిత్రిస్తారు. పరిస్థితుల ప్రాబల్యం కారణంగా కొందరు కాలం తాకిడికి లొంగిపోతే మరికొందరు కాలం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ, తమ జీవితానికి తామే కర్తలమనుకుంటూ ముందుకు వెళుతూ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇలాంటి పాత్రల చిత్రణ ద్వారా ఈతరం మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారు. పితృస్వామ్య వ్యవస్థ దుర్మార్గం కారణంగా బాధితులయ్యే మహిళల గురించి చెబుతారు. అయితే వారు వ్యవస్థ మీదనో, వ్యక్తుల మీదనో నెపం మోపి నిలిచిపోరు. వ్యవస్థ దుర్మార్గానికి తలవంచరు. వ్యక్తులపై నేరారోపణ చేసి మౌనంగా వుండిపోరు. తెలిసీ తెలియకనే పోరాడటం, నిలదొక్కుకోవటం వారి జీవితంలో అంతర్భాగమవుతుంది. ఇలాంటి మహిళలు ఎందరో ఝాన్సీ రచనలలో కనిపిస్తారు. కనుకనే ఆమె రచనలు ప్రత్యేకంగా చదవాలి.
1. అనాచ్ఛాదిత కథ -2019 - ఇది నేరుగా పుస్తక రూపంలో వెలువడిన తొలి నవల
2. విరోధాభాస - 2020 - కరోనా కల్లోల కాలంలోనూ ఆమె రచనలు చేయడం ఆపలేదు. ఆ కాలాన రాసి వెలువరించిన రెండో నవల ఇది
3. గొంతు విప్పిన గువ్వ - 2021 - ఇది మహిళల మానసిక ప్రపంచంలోని విభిన్న కోణాలను అభివ్యక్తం చేసిన నవల
4. చీకటి వెన్నెల - 2022 - ఇందులోని పాత్రలు గత ఇరవయ్యేళ్ళ కాలంలో మహిళల జీవితాలలో నెలకొన్న మార్పులకు ప్రతినిధులు.
5. ఎడారి చినుకు - 2023 - దీర్ఘకవిత - ఓ మహిళ జీవన తాత్వికతకు ఆర్ద్రమైన రీతిన అద్దం పట్టిన కవిత.
ఇవి గాక ఇంకా కథలు, వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. 2022 లో రాసిన అగ్నిపునీత సీరియల్‌కు మంచి స్పందన లభించింది. ఎవరేమనుకుంటారో నని తటపటాయించకుండా సూటిగా తను చెప్పాలనుకున్నది చెప్పే రచనా రీతి ఝాన్సీ సొంతం. ఏదయినా రాయకుండా ఉండలేనితనంతో రాశారు. ఆమె వచన రచనలు చదివితే గత ఇరవయ్యేళ్ళ కాలంలో మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతికి చెందిన కుటుంబాలకు చెందిన సంక్లిష్టతలు, మారిన జీవిత నమూనాలు, కొత్త జీవన సందర్భాలు దర్శనమిస్తాయి. సకల రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ మహిళల మీద కొనసాగుతున్న వివక్ష మొదలయిన అంశాలు కనిపిస్తాయి.
తెలుగునాట స్త్రీవాదం మొదలయిన మూడు దశాబ్దాల అనంతరం వెలువడిన ఝాన్సీ కొప్పశెట్టి రచనలని ఏవిధంగా చూడాలి. ఆమె రచనలు స్త్రీవాదంలో అంతర్భాగమవుతాయా? ఏ విమర్శా పరికరాలతో ఆమె రచనలని విశ్లేషించవచ్చునో సాహిత్య విమర్శకులు, పరిశోధకులు యోచించాలి. ఆమె జీవితానుభవం, జీవనానుభవ పరిధి విశాలమైంది. ఆమె సృజించిన రచనలలో నాలుగు తరాల మహిళలు ఉంటారు. మొదటితరానికి అనాచ్ఛాదిత కథలోని నళిని ప్రాతినిధ్యం వహిస్తుంది. తరువాత మూడు తరాలకు చెందిన మహిళల జీవన సందర్బాలు, సన్నివేశాలు, స్థలకాలాలు భిన్నమైనవి. జీవితాన్ని వారు స్వీకరించే దృష్టికోణం సైతం మరింత విభిన్నమైంది.
ఈ వైవిధ్యాన్ని వాస్తవికంగా చిత్రిస్తూ చేసిన రచనలు ఆకళింపు చేసుకోడం ద్వారానే ఆమె రచనల సారం, సారాంశం అవగతమవుతాయి. నాలుగు తరాల మహిళల జీవితాలలోని వైరుధ్యాలకీ, వైవిధ్యానికీ మూలాలు ఎక్కడున్నాయో గ్రహించాలి. నాలుగు దశాబ్దాల కాలాన మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలోని చలనశీలతని అర్థం చేసుకోడం ద్వారానే ఇది సాధ్యం. ఈవిధంగా అర్థం చేసుకోగలిగినపుడే ఝాన్సీ గారి రచనల మీద నిర్దిష్టమైన అంచనా, విమర్శనాత్మక విశ్లేషణ వీలవుతుంది. కొత్తగా సాహిత్యం మీద పరిశోధన జరిపే వారికి ఆసక్తికరమైన అంశాలు, అనువైన ఇతివృత్తాలు ఈ రచనలలో ఇమిడివున్నాయి.
అయిదు సంవత్సరాలుగా ఎక్కడా ఆగకుండా సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించడం ఝాన్సీ కొప్పిశెట్టి ప్రత్యేకత. ఇతివృత్తాల ఎంపికలోనూ, కథాకథనంలోనూ వైవిధ్యం పాఠకులని ఆకర్షిస్తుంది. ఆమె అనుసరించిన రచనా సంవిధానం ముగ్ధులను చేస్తుంది. కనుకనే ఈ అయిదేళ్ళ కాలంలో ఆమెకు ప్రత్యేక పాఠకవర్గం సమకూరింది. ఆమె రచనా ప్రపంచంలోకి ప్రయాణించిన వారికి సరికొత్త పఠనానుభవం చేకూరుతుందన్నది వాస్తవం. పాఠకుల సృజనాత్మక సమయాన్ని వృధా చేయదు ఆమె సాహిత్య పఠనం. చక్కని వచనం కోసం, అందమైన కవిత్వం కోసం ఆమె పుస్తకాలను చేతులలోకి తీసుకోవచ్చు. ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే సభాస్థలిలో ఝాన్సీ గారి పుస్తకాలన్నీ అందుబాటులో ఉంటాయి. అయిదేళ్ళుగా ఏడాదికో పుస్తకం వెలువరిస్తున్న ఈ పరంపరని ఆమె ఇలాగే కొనసాగిస్తూ తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేయాలన్నది ఆకాంక్ష.