"జీవనవేదం"
విజయం పరిచయంలేని అందలమెక్కిస్తుంది!
ఓటమి నికార్సైన జీవితాన్ని పరిచయం చేస్తుంది!!'
'శిఖరం నీ ఆశయమైతే..
అలుపెరుగని ఆరాటం నీ ఆయుధమవ్వాలి!'
'ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదు...
ఎన్నాళ్ళు జీవించామన్నదే-జీవితం!'
ఎన్నెన్నో జీవిత సత్యాల్ని నిర్దేస్తూ, మనిషిలోని అనేక మానవీయ కోణాల్ని అత్యఅద్భుతంగా స్పృశిస్తూ ఆ కవితా సంపుటిలోని చాలా వాక్యాలు కనకారావు హృదయాంతరాల్ని తట్టిలేపాయి. మళ్ళీ మళ్ళీ చదివాడు.
కనకారావు అప్పుడప్పుడు చిన్నచిన్న కథలూ, కవితలూ రాస్తుంటాడు. వృత్తిరీత్యా ఓ జర్నలిస్ట్ గా బ్రతికేస్తున్నాడు.
ఆ కవితా సంపుటి కవరుపేజీని మరోసారి చూసాడు, కనకారావు. పొడవుగా, నల్లగావున్న పురుగుకి మనిషిమొహానికి ఉన్నట్టే కళ్ళు, చెవులు, ముక్కు, నోరుతోపాటు ఆ పురుగుకి ఇరువైపులా అందమైన రంగురంగుల రెక్కలు అతికించబడివున్నాయి. కవి 'విశ్వం' ఎవరోగానీ గొప్పగా రాశాడు' అనుకున్నాడు.
ఆ కవితా సంపుటి శీర్షికని సూచిస్తూ అట్టకి పైభాగాన 'జీవనవేదం' అని, దిగువభాగాన 'విశ్వం' అని కవిపేరు ముద్రించి ఉంది. ఆ కవరు పేజీకి బొమ్మను గీసింది కూడా కవి విశ్వంగారే! చిత్రంలోని భావం ఏంటో అర్ధంకాక, ఆ కవి 'విశ్వం'గారి ఫోన్ నెంబరుకోసం ఇంతకుముందే చూశాడు. లోపల పేజీల్లో ఆ కవి గురించి ఏ చిన్న విషయం కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. కేవలం పబ్లిషర్ పేరు మాత్రమే ముద్రించి ఉంది.
అప్పుడే, టీపాయ్ మీదున్న కనకారావు మొబైల్ ఫోన్ రింగవుతోంది. పుట్టింటికి వెళ్లిన తన భార్య కాల్ చేసిందేమోనని స్క్రీన్ మీద కనిపిస్తోన్న కాలర్ ఐడీని చూసాడు ఆదుర్దాగా. ఆ కాల్, తను పనిచేస్తోన్న పత్రికాఫీసు సబ్-ఎడిటర్ నుంచి. కనకారావు హుషారుగా మొబైల్ ని చేతిలోకి తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల్నుంచి "రావుగారూ, ఈ వారం ఇవ్వాల్సిన 'జీవన దర్పణం'కీ ఆర్టికల్ కమ్ ఇంటర్వ్యూని రెడీ చేసారా?!" అంటూ సబ్-ఎడిటర్ అడిగాడు ఆతృతగా.
"సార్, రెండ్రోజుల క్రితమే ఒకావిడ్ని కలిసాను. మొదట ఒప్పకోలేదు. కానీ ఎలాగో ఒప్పించాననుకోండి! ఈరోజు మధ్యాహ్నం రెండింటికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆమెని ఒప్పించడానికి తల ప్రాణం తోకకొచ్చిందనుకోండి...."అన్నాడు కనకారావు వృత్తిపట్ల తనకున్న నిబద్ధతని చాటుకుంటూ. అతని మాటలకు, సబ్-ఎడిటర్ "అదేంటండీ, మిట్ట మధ్యాహ్నం...?!"అడిగాడు కాస్త ఆశ్చర్యంగా.
"అదంతే సార్, ఆ కాంతమ్మ టీ కొట్టు టైమింగ్స్ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు, సాయంత్రం నాలుగు గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆమె వ్యాపారం చాలా రద్దీగా ఉంటుంది. 'కాంతమ్మక్క టీ కొట్టు' అంటే ఆ ఏరియాకే ఫేమస్ సార్! లీజర్ టైమ్ లో ఇంటర్వ్యూకి ఒప్పుకుంది. అదీ... పత్రికలో ఆమె పేరును మార్చి వేస్తాం అంటే సరేనంది"అన్నాడు కనకారావు కాస్త వివరణ ఇస్తూ, పనిలోపనిగా తన కష్టాన్ని వెళ్లగక్కుతూ.
ఒక క్షణమాగి ఆగి, మళ్లీ అందుకుంటూ "ఈసారి మన 'జీవవ దర్పణానికి' మంచి కంటెంట్ రాబోతోంది. సార్! విషయం ఏంటంటే టీ కొట్టు కాంతం పూర్వాశ్రమములో ఓ వేశ్య..." అన్నాడు కనకారావు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ. సబ్ -ఎడిటర్ "సరే రావుగారు, అల్ ది బెస్ట్... రేపు మార్నింగ్ కి ఆర్టికల్ అందజేయండి" అంటూ కాల్ కట్ చేశాడు.
కాంతమ్మ టీ కొట్టు అతనన్నట్టుగానే ఎప్పుడూ జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. వయసుతో సంబంధంలేకుండా చిన్నాపెద్దా అందరూ ఆమెని "కాంతమ్మక్కా..'' అనే పిలుస్తారుంటారు. కాంతమ్మకీ అలా పిలిపించుకోవడమే ఇష్టం! అందర్నీ తన స్వంతవారిగా భావిస్తూంది.
కనకారావుకి కాంతం గుర్తుకు రాగానే ఒళ్ళంతా జివ్వుమని వేడెక్కినట్టయింది. మనసు గాల్లో గిరికీలు కొట్టింది. టీ కొట్టు కాంతానికి రమారమీ ఓ ముప్పయిఐదేళ్లు ఉంటాయి. సన్నగా, నాజూగ్గా ఉండి, మల్లెపువ్వులా మిలమిలా మెరిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ని తలదన్నేలావుంటుంది.
ఇంటర్వ్యూ అనంతరం, ఎంతోకొంత 'తాయిలం పడేసైనా తాంబూలాన్ని సొంతం చేసుకోవాలని' అని మనసులో గట్టిగానే ఖాయపర్చుకున్నాడు. ఇంటర్వ్యూకి అడగాల్సిన ప్రధానమైన ప్రశ్నలన్నింటినీ నోట్ పేడ్ మీద పొందుపర్చుకుని, పరిశీలనగా చూసుకొని తనకుతాను "శబాష్..." అనుకుంటూ కితాబు ఇచ్చుకున్నాడు. కనకారావు, తను చాలా తెలివైనవాడినని బలంగా నమ్ముతాడు!
మధ్యాహ్నం ఒంటి గంటవుతోంది. బయట ఎండ మెండుగా కాస్తోంది. కనకారావు చకచకా పెన్ను, ప్యాడ్ బ్యాగులో వేసుకుని బండిమీద బయల్దేరి, కాంతం చెప్పిన అడ్రసుకి తొందరగానే చేరుకున్నాడు. కాంతం, ఓ గుడి దగ్గరకు వచ్చాక ఫోన్ చెయ్యమంది. కనకారావు, కాల్ చేసిన రెండు నిమిషాలకు ఆమె వచ్చింది. తను ముద్దమందారపు రంగు చీర కట్టుకుంది. 'మధురవాణిలా మరులుగొల్పుతూ, ముద్దొచ్చేలా ఉంది' అనుకున్నాడు కనకారావు. ఆమె అతన్ని దగ్గర్లోగల తనింటికి తీసుకెళ్లింది.
ఆమె నివాసం-మూడు గదులున్న చిన్న డాబాఇల్లు. ఆ ఇల్లు ఆమె స్వంతంగా కొనుక్కున్నదేనట. ఇంట్లోని సామానులన్నీ చక్కగా సర్దుకుంది. వరండాలో ఓ ముసలావిడ ఇద్దరు వృద్ధసాధువులకి భోజనం వడ్డిస్తోంది. కనకారావు, కాంతాన్ని అనుసరిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ఆ చిన్న హాల్లో ఆమె చూపించిన సోఫాలో కూర్చుని, గదంతా పరికించి చూశాడు. కాంతం అతనికి ఫ్యాన్ స్విచ్ వేసి, లోనికి వెళ్ళింది. ఆ హాలు చిన్నగా వున్నా, ఆమెలాగే చాలా అందంగా, చూడముచ్చటగా ఉంది. కనకారావు, వృత్తినిర్వహణలో భాగంగా తన బ్యాగులోంచి పెన్ను, పేడ్ బయటికి తీసాడు.
కాసేపటికి తర్వాత కాంతం అతనికి ఏదో పండ్లరసం తీసుకొచ్చి ఇచ్చింది. గ్లాసు అందుకునే నెపముతో ఆమె చేతివేళ్ళను తాకాడు. అతని శరీరము ఒక్కసారిగా చలించింది. ఒంట్లోని నరాలన్నీ మెలికలు తిరిగిపోతూ నాట్యంచేసేయి. నెమ్మదిగా జ్యూస్ తాగుతున్న అతని దృష్టిని ఓ విషయం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడే ఓ మూలగావున్న టేబుల్ మీద విశ్వంగారి ఆ కవితా సంపుటి కనిపించింది.
అప్పడే లోనికివెళ్ళొచ్చిన కాంతం, అతనికి ఎదురుగా ఉన్న దివాణకాట్ మీద కూర్చుంటూ "అడగండి సార్...!" అందామె. ఆ మాటలో 'నాకు చాలా పనులున్నాయి....' అన్నట్టుగా అంది.
కనకారావు, తన మొట్టమొదటి ప్రశ్నగా "మీరు కవిత్వాన్ని కూడా చదువుతారా?!" అనుమానంగా అడిగాడు వ్యంగ్యం నిండిన స్వరంతో. అతని ప్రశ్నకి కాంతం చిన్నగా నవ్వుతూ "'మీరు అడిగింది ఆ పుస్తకాన్ని చూసి అనుకుంటా! అది మా టీ కొట్టు దగ్గర ఎవరో మర్చిపోతే, ఏంటో చూద్దామని తెచ్చానండి. 'మీరు కూడా...'అని అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు... మాలాంటి వాళ్లు కవిత్వం చదవకూడదా సార్?!" కాస్త నొచ్చుకున్నట్టుగా అడిగింది, కాంతం.
కనకారావు వెంటనే సర్దుకున్నట్టుగా "మీరు చదవకూడదని కాదు. అంత సంక్లిష్టమైన సాహిత్యం మీకు అర్ధమవుతుందా...అని అడిగాను. అంతే!"అన్న అతని మాటలకు, కాంతం చిన్నగా నవ్వేసింది.
కనకారావు తన ఇంటర్వ్యూని ప్రారంభిస్తున్నట్టుగా పూర్వాశ్రమములో మీరు 'సెక్స్ వర్కర్' అటకదా! ఆ జీవితాన్ని ఎందుకని వదిలేసారు?" అడిగాడు. ఆమె సమాధానం కోసం కాంతం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. "మనిషికి మార్పు ఎప్పుడూ అనివార్యమే కదా.." అందామె బదులిస్తున్నట్టుగా.
మలిప్రశ్నగా కనకారావు "మీరు ఎంతవరకు చదువుకున్నారు? వేశ్యా వృత్తిలోకి ఎలా ప్రవేశం జరిగింది?!"అడిగిన కనకారావు ప్రశ్నకు, కాంతం అతనివైపు చిరాగ్గా చూస్తూ "నేను పెద్దగా ఏమి చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే నా చదువు కొనసాగింది.
ఇక ఈ వృత్తిలోకి ప్రవేశమంటే, అదేమన్నా గృహప్రవేశమా... చెప్పండి, ముహూర్తం పెట్టుకుని దిగటానికి, జీవితమంటే ఏంటో తెలియని యవ్వనదశలో ఓ మృగాడి మోసానికి బలైపోయాను. ఆ సమయములో నిర్లక్ష్యముతో తీసుకున్న దుందుడుకు నిర్ణయాల మూలంగా అందులోకి నెట్టివేయబడ్డాను.
నాకు ఓ బిడ్డ పుట్టాక ఆ వృత్తికి పూర్తిగా స్వస్తిచెప్పి, ఆ సంకెళ్లకు దూరంగా స్వేచ్ఛగా, స్వచ్చంగా బ్రతుకుతున్నాను..." అని, దీర్ఘంగా శ్వాస తీసుకుని భారంగా నిట్టూర్పు వదిలింది, ఇప్పుడైతే-ఒక ఒడ్డున సేదతీరుతున్నానన్న ఉపశమనం ఆమె కళ్ళల్లో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతోంది.
"మీకింకా వయసూ, జీవితం రెండూ ఉన్నాయి. ఒక మగతోడు కోరుకోవడంలేదా?" అతని ప్రశ్నకు సమాధానంగా "నాకు-ఒక తల్లి, కొడుకు, కూతురూ వున్నారు. వారే నాకన్నీ...! ఇక ఎటువంటి మగతోడు నాకక్కర్లేదు..." అంది కాంతం సుస్పష్టంగా.
"మీరు 'అనాథ' అని విన్నాను. బాబు మాత్రమే మీ బిడ్డని..., ఓ పాపని, ఓ అవ్వని చేరదీశారని, ఆ పాపని మీ బాబుతో పాటే చదివిస్తున్నారని విన్నాను..."అడిగాడు కనకారావు. కాంతం సమాధానంగా చిన్నగా నవ్వేసింది. ఆ నవ్వులోనే సమాధానం స్ఫురించినట్టుగా కనకారావు తన ప్యాడ్ మీద రాసుకుంటున్నాడు.
"అంతే కాకుండా 'ఆకలి' అన్నవారికి రోజూ అన్నంపెడుతుంటారట కదా!" ఆసక్తిగా అడిగాడు కనకారావు. ఆమె సమాధానంగా చిగురించిన మానవత్వం మొగ్గతొడుక్కున్నట్టుగా అదే చిద్విలాసం! 'ఏదో నాకు చేతనయినంత వరకూ చేయగలుగుతున్నా'నన్నట్టుగా ఉంది ఆమె సమాధానపు అరనవ్వు! ఆమె ముఖము- నిండుకుండలాంటి నిశ్చలత్వానికీ, నిరాడంబరతకూ అద్దం పడుతుంది.
కనకారావు, ఆ ప్రహసనంలో ఓ అరగంట పాటు మరికొన్ని విషయాలు కాంతం నుండి రాబట్టుకుని, తన నోట్ ప్యాడ్ లో భద్రపర్చుకున్నాకా,
"'ఆకలి' అని అర్ధించినవారి ఆకలి తీరుస్తున్నారు. నేనూ 'ఆ ఆకలి'తో అల్లల్లాడిపోతున్నాను. నా భార్య పుట్టింటికెళ్ళి చాలా రోజులయ్యింది. మీ ఫీజు ఎంతయినా ఫర్లేదు..."అంటూ తన మనసులో బుసలుకొడుతున్న కోరికని చాలా క్యాజువల్ గా బయటపెట్టాడు, కనకారావు.
అతని మాటలకు కాంతం ఎప్పటిలాగే నవ్వేసింది. ఈసారి ఆమె నవ్వులో ఎటువంటి జీవంలేదు. "మీలాంటివాళ్ళు మాబోటి వాళ్లకు సాయం చేయకున్నా ఫర్లేదు. కానీ ఎప్పటికీ మాలోని మార్పుని స్వాగతించకుండా ఆ బ్రతుకునే బ్రతకమంటున్నారే... అదే నాకు బాధేస్తుంది...సార్!"అంది కాంతం బేలగా, అతన్నే నిర్వికారంగా చూస్తూ.
కాంతం మాటలకు, కనకారావు భళ్ళున పెద్దగా నవ్వేసాడు. అతని వంక చిత్రంగా చూసింది కాంతం. "కాంతంగారు, నా మీద కోపగించుకోకండి. మీలో వచ్చిన మార్పు ఎంతవరకు వాస్తవమాని...చిన్న పరీక్ష! మీరు నిఖార్సైన మనిషని రుజువుచేసుకున్నారు. మీ రుజువర్తనానికి, ఔన్నత్యానికి నా బహుమతిగా ఇది ఉంచండి..."అంటూ తనమెడలోని రెండున్నర తులాల బంగారు పేటగొలుసుని తీసి, కాంతానికి అందించబోయాడు.
ఆమె అతన్ని వారిస్తూ "కనకారావుగారు, ఆకలితో ఉన్నవారికే ఇలాంటివి అవసరం పడతాయి. ఆకలితో ఉన్నవారి దయాదాక్షిణ్యాలు ఈ కాంతమ్మక్కకి అక్కరలేదని మీరు గుర్తిస్తే సంతోషిస్తాను. నేను రోజుకి పదిగంటలు కష్టపడుతున్నది... పదిమందికీ ఆదర్శంగా నిలబడాలని, నలుగురికీ పట్టేడన్నం పెట్టాలని, అంతేగానీ మీలాంటి వాళ్ళు విసిరేసే బిస్కట్లు కోసమో, మాయాగాలంలో చిక్కుకొని విలవిల్లాడిపోవడానికో కాదండి..."అందామె సంయమనం పాటిస్తూ. ఆ అందమైన ముఖం ఆమెకు తెలియకుండానే అరుణకిరణంలా కాస్త ఎర్రబారింది.
కనకారావుకి సాంతం అర్ధమైంది. తన ఆటలు ఆమె ముందర చెల్లని కాసులతో సమానమని. అలాంటి వ్యక్తిత్వాన్ని తనెంత చులకనగా భావించి, ప్రవర్తించింది అతనికి అప్పటికిగానీ అవగతం కాలేదు. కొన్ని క్షణాలుపాటు తప్పు చేసినవాడిలా తన మొహాన్ని రెండుచేతులతో దాచుకున్నాడు.
అతని కళ్ళల్లో ఇదివరకటి వాంఛలేదు. ఎప్పుడో పాతాళానికి తోక్కేసిన మానవత్వం తట్టిలేపినట్టుగా, అతనిలోని నిజమైన మనిషి మేల్కొన్నట్టుగా నిర్మలమైన, పరితప్తమైన మార్పు అతని ముఖంలో చోటుచేసుకుంది. కొన్ని క్షణాలు- ఇరువురి నడుమ గాఢమైన నిశ్శబ్దం చోటుచేసుకుంది.
కనకారావు నెమ్మదిగా తల పైకెత్తి ఆమెవైపు సాభిప్రాయంగా చూసాడు. అప్పటికే కాంతం కళ్లల్లో నీటిచెమ్మ చేరింది. ఆమెనలా చూడగానే కనకారావుకీ పశ్చాత్తాపంతో కంట్లోకి నీళ్లు తన్నుకు వచ్చాయి. అంతే-అతనికి తెలియకుండానే "క్షమించు, కాంతమ్మక్క.." అన్నాడు పొడిబారిన పెదాలతో. కాంతం అతన్ని అమితాశ్చర్యంగా చూసింది.
అతని కళ్ళు వర్షించడానికి సిద్ధంగా వున్నాయి. కాంతం-వేయి వసంతాలు ఒకేసారి విరబూచినట్టుగా హాయిగా నవ్వేసింది. నవ్వులో పున్నమినాటి వెండివెన్నెల వెలుగులు గుభాలిసున్నాయి.
"కాంతమ్మక్కా, ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని పరిచయంచేసే ఘనత నాకు దక్కడం, నా అదృష్టంగా భావిస్తున్నాను. నీ జీవనగమనానికి విజయోస్తు!" అంటూ అక్కడ నుంచి నిష్క్రమించడానికి లేచాడు.
బయట నుంచి పోస్ట్ మేన్ "మేడమ్, పోస్టు..." అంటూ మూడు కవర్లు ద్వారబంధం లోపల పడేసి వడివడిగా వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి బయటికి వస్తోన్న కనకారావు దృష్టి ఓ కవరు మీద టు అడ్రస్ వున్నచోట పడింది. 'టు - విశ్వం' అనే అక్షరాలు అతన్ని నమ్మశక్యంకాని విభ్రాంతికి గురిచేసాయి. సంభ్రమాశ్చర్యాలతో కాంతమ్మక్కని చూశాడు. నిరాడంబరతత్త్వం, మానవత్వం కలగలిపిన విశిష్ట వ్యక్తిత్వం మూర్తీభవించిన ఆమె ఆ కవర్లని చేతిలోకి తీసుకుంటోంది.
కనకారావు బయటికి నడుస్తూ "కాంతమ్మక్కా...! గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడమంటే- ఏంటో అనుకున్నాను. ఈ రోజే మూసుకుపోయిన నా కనురెప్పలు తెరిపించావు. ఈ తెలివితక్కువవాడిని క్షమించు! మన ఇంటర్వ్యూ రెండోభాగం కూడా ఉంటుంది. మళ్ళీ కలుస్తాను...!!"అంటూ గుండెలనిండా నిండిన భావోద్వేగంతో ఆమెనుండి సెలవు తీసుకున్నాడు.
- శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు