యశోధరా ఈ వగపెందుకే ! (కవిత)

యశోధరా ఈ వగపెందుకే వారు బౌద్ధులు తాపసులు చింతలంటవు వారిని
జరా మృత్యు భయాలుండవు సరిగ్గా బోధివృక్షం కిందే
జ్ఞానోదయం అవుతుందని వారికి ముందే తెలుసు !
ఆ అర్ధరాత్రి అనంతయాత్రకి
ఆరంభం తెలియనిది నీకేనే యశోధరా ఈ వగపెందుకే
అతుక్కుని గవాక్షానికి
అలా దిగులు చూపెందుకే నీకు సూర్యోదయమంటేనే
అసలు భయమెందుకే
ఫరవాలేదులే
నీ ఎదురుచూపు వృధా పోదులే ఎప్పుడో ఓనాడు
దీక్ష బూనిన కాషాయదారి
భిక్షాపాత్రతో నీ ఇంటిముంగిట కూడా చెయిజాచి వస్తాడటలే శిధిల దేహంబుతో నువ్వు దీనవదనంబుతో
ఎదురు వస్తావని ఏ ప్రాణమో భిక్ష వేస్తావని అతని మనసులో ఎక్కడో
ఉంటుంది కాబోలు యశోధరా ఇంక వగపెందుకే వారు బౌద్ధులు తాపసులు చింతలంటవు వారిని జరామృత్యు భయాలుండవు అష్టాంగ మార్గాన నువ్వు మాత్రం
అలా చుక్కలని చూడకే యశోధరా ! నువ్వింక త్యాగాలు చేయకే !
- జయప్రభ