నా పెళ్లి !
ఇవాళ నాకు విశ్వనాథ సూర్యనారాయణ తో పరమ సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగిన రోజు. . [ జూన్ 14 ]
పెళ్లి అంటే బొత్తిగా ఒక ఊహ , స్పష్టంగా లేని , 17 సంవత్సరాల వయసులో జరిగిన పెళ్లి నాది .
ఇంటర్ వరకూ చదివిన చదువు . ఇల్లు కాక మరో లోకం తెలియని టీనేజ్ పిల్లల్లోని అమాయకత్వం . 1975 వ సంవత్సరంలో నేను ఉన్న స్థితి .
పెళ్లి కార్డు మీద , సూర్యనారాయణ -- బెర్ట్రెండ్ రస్సెల్ గారిది -- ఒక కొటేషన్ వేయించి పెళ్లి కార్డుని అచ్చువేయించుకున్నాడు తన ముచ్చట కోసం . నాకు ఆయన అంటే ఆ బెర్ట్రెండ్ రస్సెల్ గారు ఎవరో కూడా తెలీదు . అప్పట్లో నాకు తెలుగు కాక మరో భాష రాదు . నేను చదివింది మొత్తం తెలుగు మీడియం లో ! చిన్నతనాన క్రిస్టియన్ మిషినరీ స్కూల్ , తరవాత జిల్లా పరిషత్ హైస్కూల్ ఆ తరవాత ఆ అన్నవరం సత్యదేవి ఉమెన్స్ కాలేజీ .
తలదించుకునిస్కూల్ నించి ఇంటికి - ఇంటి నించీ స్కూల్ కీ ! కాలేజీ అయినా నా రొటీన్ ఇదే !
పెళ్లి , ఆ కాలంలో మా ఇళ్లల్లో అలాగే జరిగేది . పై చదువులు చదువుకోవడం అన్నది అసాధ్యం . చదివించేవాళ్లూ లేరు . చదువుకో అని సూచించిన వారూ లేరు . కానీ జ్ఞానం అన్నది ఒక దాహం . అది గనక మీలో పుట్టిందా మీరు ఆ దాహాన్ని మరి ఆపుకోలేరు . అలా మొదలైంది నా జ్ఞాన తృష్ణ !
తన 23 సంవత్సరాల వయసులోనే సూర్యనారాయణ దగ్గర మంచి లైబ్రరీ ఉండేది . పుస్తకాన్ని చేతపట్టగల వీలు - నువ్వు ఎందుకు పుస్తకాన్ని చదువుతున్నావూ ? ఆపు అని అనేవాళ్ళు ఎవరు నా చుట్టుపక్కల లేకపోవడం - ఇల్లు కదలకుండా ఒక ఆడపిల్ల ఉండడం మాత్రమే తప్ప ఆ అమ్మాయి ఏమి చదివేది ? ఆ చదువు ఆమెని ఏ పంథా లో ఆలోచింప చేసేదీ అర్ధం చేసుకోగల వ్యక్తులు రక్షించి ఆనాడు ఇళ్లల్లో లేకపోవడం - ఇలా చదువు ని మొదట సాహిత్యం గా మాత్రమే చదవడం మొదలుపెట్టి అలాగే ఒక ఐదు సంవత్సరాలు కొనసాగించి - చివరికి ఇలా కాదు నా విద్యాభ్యాసాన్ని నేను కొన సాగించాలి అన్న దృఢ నిర్ణయం చేసి - ప్రయివేట్ గా ఆంధ్రా యూనివర్సిటీ నించి-- బీఏ చేసి -- ఉస్మానియా యూనివర్సిటీ లో చేరి ఎంఏ , ఎంఫిల్ , పీహెచ్ డీ ఇత్యాదివి అన్నీ ఒక పదేళ్ల పాటు చాలా శ్రమపడి చదివి -- అన్నీ విజయవంతంగా పూర్తీ చేసేను . ఆ క్రమంలో నేను చాలా ఆలోచనలు చేసేను . చాలా పుస్తకాలని చదివేను . చాలా వివరంగా నా ఆలోచనలని ఎన్నింటినో రాసేను . చెప్పేను కదా ... జ్ఞాన సముపార్జన అన్న దాహం మొదలు అవ్వాలి తప్ప-- అది ఆగదు అని .
ఇంతకీ ఆ బెర్ట్రెండ్ రస్సెల్ గారిని నేను నా పెళ్లి అయిన మరో ఎనిమిది సంవత్సరాలకి కాబోలు చదివాను . అప్పటి వరకూ ఇష్టంతో చలాన్ని మాత్రమే చదివాను . చలం రచనల ద్వారా రస్సెల్ గారిని గురించి తెలుసుకుని ఆయన పుస్తకం " మ్యారేజ్ & మోరల్స్ " ని , కొని తెచ్చుకుని ఏకబిగిన -- ఊపిరి తీసుకోనంత గాఢంగా చదివేసేను . రస్సెల్ ని చదివేనాటికి బహుశా నాకు ఇరవై రెండేళ్లా ? అనుకుంటాను . ఆ పుస్తకం ఆ రోజుల్లో నన్ను [ చలం రచనల తరవాత ] చాలా గాఢంగా ప్రభావితం చేసింది . ఇవాళ్టికీ , అది నాకు ప్రియమైన పుస్తకాలలో ఒకటి . ఆ తరవాత ఎప్పుడో రస్సెల్ గారి ఆటో బయోగ్రఫీ కూడా చదివాను . చాలా ఇష్టం నాకు బెర్ట్రన్డ్ రస్సెల్ గారంటే !!
చాలా లేత వయసులోనే నా మీద ఇలా , చలం ... రస్సెల్ గార్ల ప్రభావం అనుకోకుండానే పడింది . హేతు బద్ధంగా ఆలోచనలు చేయడానికీ ! ఒక విషయాన్ని ఒకే కోణంలోంచి కాకుండా భిన్న కోణాల నించీ చూడడానికీ ఈ రచయితలు నాకు మొదట్లో సహాయ పడ్డారు . నేను బహుశా నా పద్దెనిమిది సంవత్సరాల వయసులో కాబోలు , విశ్వనాథ సత్యనారాయణ గారి " వేయిపడగలు " చదివాను . ఆ ఉద్గ్రంథాన్ని సైతం అంతే దీక్షగా అంతే -- అంతే ఆసక్తిగా చదివాను . ఇంకాస్త పెద్ద అయ్యేకా ... నేను , ఆయన ఇతర పుస్తకాలనీ ఆయన " రామాయణ కల్పవృక్షాన్నీ " చదివాను ఆమూలాగ్రంగా !! సత్యనారాయణ గారు సైతం చాలా మంచి రచయిత . భిన్న మైన రచయితాను . ఆయన " విష్ణు శర్మ ఇంగిలీషు చదువు " " హాహాహూహూ " లు నాకు బాగా నచ్చినవి . అయితే నన్ను చలం ప్రభావితం చేసినట్టుగా - రస్సెల్ గారు ప్రభావితం చేసినట్టుగా సత్యనారాయణ గారు చేయలేదు . బహుశా నేను భిన్న సంప్రదాయం పట్ల ఎక్కువ నమ్మకాన్ని పెంచుకున్నందు వల్ల కాబోలు! రచయితగా ఆయన అంటే నాకు ఇష్టమే గాని - సత్యనారాయణ గారి మార్గం నాది కాదు . ఆయన ఆలోచనలూ నా ఆలోచనలూ పూర్తిగా భిన్నమైనవి . ఆయన సనాతన వాది . నేను సనాతన మార్గాన్ని అనుసరించిన దానినే కాను .
నేను కవిత్వం రాసేకా - సాహిత్య విమర్శ లో పండాకా -- చాలామందిని చదివాను . నామార్గం నాకు ఏర్పడ్డాకా -- నాకు ఇతర రచయితల మార్గాల అవసరం తీరిపోయింది . చాలా తొందరగానే నా మార్గం నేను వేసుకున్నాను . నా నడక నాదిగా నడిచాను .
ఆ చిన్ననాట పెళ్ళిజరిగిన ఆ పసి పెళ్లికూతురు నాలోంచి ఎప్పుడో ఇంకి పోయింది . ఎప్పుడు ఆ అమాయకపు బాలిక తెర వెనక్కి తప్పుకుందో స్పష్టంగా ఇవాళ నాకు గుర్తు కూడా లేదు ! ఆలోచించగల ఈ చదువుకున్న యువతి క్షణం ఆగి , ఆ బాలికని గురించి గమనించగల ఒక వ్యవధిని -- అటుపై జీవితం నాకు ఇవ్వలేదు .
ఈ బతుకు ప్రయాణం లో అనేక వ్యవస్థల మీద నాకు ఆమూలాగ్రం నమ్మకం పోయింది . అలాగే " పెళ్లి " మీద కూడా నాకు నమ్మకం పోయింది . ఒక్కో కాలం -- ఒక్కోరకమైన సన్నివేశాలని సమాజం ముందుకు తీసుకుని వస్తుంది . ఆయా పరిస్థితులని -- బుద్ధిజీవులు గమనించుకోవాలి . తదనుగుణంగా వారు మారాలి . అయితే భయం వల్ల - సుఖాలకి అలవాటుపడి మనుష్యులు కొత్త వ్యవస్థల నిర్మాణాలకు పూనుకోరు . పాత వ్యవస్థల్ని destroy చేసే సాహసమూ చేయలేరు . నేను వివాహ వ్యవస్థలో రావలసిన అనేకానేక మార్పులని గురించి నా " మార్గము - మార్గణము " అన్న వ్యాస సంకలనంలో " కొన్ని చేదు మాటలు " అన్న వ్యాసంలో చాలా వివరంగా చర్చించాను . దాన్ని చదవండి .
" పెళ్లి " అన్నదానిలో సైతం మనుష్యులు చాలా మార్పులు చేసుకోవాలి . కొత్త సమాజాలకు పాత నమూనాలు నప్పవు . అలాంటి మార్పులని గురించి ఆలోచనలని చేయలేని వారు , మరింతగా వెనకబడి సంప్రదాయాల పేరుతో మరింతగా కరుకుగా మారిపోతూ ఉంటారు . మనదేశం - మన సంస్కృతీ అని అంటూ మాట్లాడతారు . కానీ సంస్కృతులలో ఎప్పుడూ ఆదాన - ప్రదానాలుంటవి ! సమాజపు తీరు తెన్నులని అనుసరించే మార్పులు సైతం వస్తాయి . అయితే అందరూ అదాటున మారిపోరు . మనుష్యుల సాంస్కృతిక స్థాయిని బట్టీ మార్పుల ప్రవేశం జరుగుతుంది . అలాగే " మార్పులు " అన్నవి ఏమీ శిలాఫలకాలు కావు . అవి ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతూ పోవాలి . చర్చలు జరుగుతూ ఉండాలి . అవసరమైన మార్పులు ఆహ్వానింపబడాలి . పనికిరానివి మూలబడిపోవాలి .
ఇంతకీ ఈ పెళ్లి ద్వారా Bertrand Russel ని నాకు పరిచయం చేసిన విశ్వనాథ సూర్యనారాయణకి , నేను సదా రుణపడి ఉంటాను . " పెళ్లి " ని నేను వ్యవస్థాగతంగా బొత్తిగా నమ్మనప్పటికీ నా నమ్మకాన్ని ఆయన గౌరవించినందుకు కూడా --- ఆయనపట్ల నాకున్న గౌరవం ఇనుమడించింది తప్ప ఎప్పుడూ తగ్గలేదు . ఒక జయప్రభ రూపొందడం వెనక గణనీయమైన విశ్వనాధ సూర్యనారాయణ కృషి ఆమె ఇరవైలలో ఆమె చదువు మొదలు పెట్టిన తొలిరోజులలో ఎంతగానో ఉన్నది ! (జూన్ 14 , 2019)
- జయప్రభ