జన్మించడమే కవిత్వం
కవిత్వమంటేనే
కవికి మరోజన్మ
అమ్మ ఎన్ని బాధలు పడి
నాకు జన్మనిచ్చిందో
నాకు తెలియదు కానీ
నాలోంచి కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా
నాకు మరో జన్మ ఎత్తినట్లుంటుంది..
నేను మరో బిడ్డకు జన్మనిచ్చినట్లుంటుంది...
ఉన్నది ఒకటే జీవితం
కవిత్వమేమో
తరగని దాహంలా ఉంది
కొత్త కవిత్వాన్ని ప్రారంభించినప్పుడల్లా
జీవితం
చాలాపొడవుగా
కనిపిస్తోంది
అసలే
ఆశలు, ఆశయాలతో నిండిన
చిన్ని మనసు నాది
లక్షలాది కన్నీటిబొట్లతో అలరిస్తున్న ద్వీపం నాది.
నేనేం రాయలేనని అనుకుంటే..
అలా అనుకోవడం నుండే
నాలో కవిత్వం మొదలు
కవిత్వం ఏదయితేనేమి
పదమెక్కడ
పరాకాష్టను చేరుతుందో భావాలెక్కడ
బరువుగా మారి
కలవర పెడుతాయో!
నా హృదయమే
సృజనాత్మక రంగస్థలం
ఏం చెయ్యాలో
తెలియని స్థితితో
నా జీవితం మరీ కవితాత్మకంగా కనిపిస్తోంది.
స్వేచ్ఛలేని చోట
సర్వం కోల్పోయినట్లుగా
స్వాతంత్య్రమే
స్వాహా అయిన చోట స్వగతం
నిలదీస్తున్నట్లుగా
అక్కడక్కడా నిరాశా నిస్పృహలు
కావలి కాస్తున్నప్పుడు
నేనే కవిత్వంగా
మారిపోతున్నాను.
ఎవరిని మాత్రం ఏమనగలం?
ఓర్చుకోలేనంత
ఓటమి వేర్లనుంచే
సరికొత్త కవిత్వం ఉదయిస్తుందేమో..
ఉద్విగ్నభరిత వాతావరణం కనిపిస్తుందేమో..
వెన్నెల కాంతులు
నన్ను అల్లుకుంటాయేమో..
ప్రారంభమైనా..
ముగింపైనా..
కవిత్వమే కదా కవిని ఆదరించేది..
-శైలజామిత్ర