Telugu Global
Arts & Literature

తీర్పంటే ఇలా ఉండాలి

తీర్పంటే ఇలా ఉండాలి
X

అనగనగా ఓ ఊరు. ఆ ఊరుకి ఓ రాజు. అతనెంతో మంచివాడు. సభలో విచారణ జరుగుతోంది. ఓ రైతు ఫిర్యాదు చేశాడు.

అదేంటంటే, తన భూమిలోకి మేకలు వచ్చి పంటనంతా మేసేసాయి..... ఎంతో కష్టపడి వేసిన పంటంతా పోయింది.... డబ్బులు పోయాయి... ఇక నేనేం చేయాలి.... మీరే సరైన తీర్పు చెప్పాలి అని రైతు వేడుకున్నాడు.

సరే. ఆ మేకల యజమాని ఎవరో గుర్తించి అతనిని సభకు తీసుకురండి అని రాజు ఆదేశించాడు. భటులు ఊళ్ళోకి వెళ్ళి మేకలయజమానిని పట్టుకొచ్చారు. రాజు విచారణ జరిపి తీర్పు ఇచ్చారు.

రైతుకు కలిగిన నష్టపరిహారంగా నీ దగ్గరున్న మేకలను అతనికి ఇవ్వాలన్నదే ఆ తీర్పు.

ఇదంతా రాజుగారి కొడుకైన యువరాజు చూస్తూనే ఉన్నాడు.

ఈ తీర్పు మరింత మెరుగ్గా ఉండవచ్చని అతను అనుకున్నాడు.

ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు.

రాజు సరే నువ్వనుకున్నదేంటో చెప్పు అన్నాడు యువరాజుని.

యువరాజు చెప్పాడు....

నీ మేకలన్నింటినీ ఏడాది కాలంపాటు ఆ రైతుకి ఆప్పగించు. ఆ ఏడాదిలో ఆ మేకలు కనే పిల్లలు, ఇచ్చే పాలు, ఎరువు అన్నీ రైతుకు చెందుతాయి. అనంతరం నీ మేకలను నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు యువరాజు.

ఈ తీర్పు బాగుందన్న రాజు తన బరువుబాధ్యతలన్నింటినీ అదే రోజు తన కొడుకైన యువరాజుకు అప్పగించాడు.

ఎవరైనా కావచ్చు ఓ శిక్ష ఆనుభవించే వ్యక్తి ఆ శిక్షాకాలం తర్వాత సమాజంలో మళ్ళీ మంచిగా బతికేందుకు అవకాశం కల్పించేలా ఉండాలన్న యువరాజు తీర్పు, ఆలోచన అందరికీ నచ్చాయి.

కానీ కొన్ని తీర్పులు అలా ఉండటం లేదు. ఓ శిక్షను అనుభవించిన తర్వాత నలుగురిలోనూ తన బతుకు బతకలేకపోతాడు. సమాజం అతని వంక వేలు చూపుతూ బతకడానికి నీకు అర్హతే లేదని మాటలు అంటుంది. అటువంటి వైఖరి సరైనది కాదన్నదే యువరాజు అభిప్రాయం.

- యామిజాల జగదీశ్

First Published:  18 Dec 2022 11:28 AM IST
Next Story