ఇప్పుడు కావాలో విజయం
రాశులు పోసిన ధన రథాలపై
దర్జాగా కూర్చుని
జీవితాన్ని పరుగులు పెట్టించే ధనోన్మాదులకు
రథచక్రాల కింద నలిగిపోతున్న చలిచీమల్లాంటి
బడుగు బతుకుల చప్పుళ్ళు వినబడవు
ఆ చలిచీమలకు కావాలో బతుకు విజయం
ఆకలితో పేగులు లుంగచుట్టుకుపోతూ
కడుపుల్ని చేత పట్టుకుని
చెత్తకుండీల్లో విసిరేసిన
ఎంగిలాకుల మెతుకుల్ని ఆబగా తినే అభాగ్యులు
ఆ అభాగ్యులకు కావాలో అన్నవిజయం
కష్టాలగుట్టు పెదవి దాటనీకుండా
పొద్దస్తమానం రక్తం ధారపోసి
సాధించుకున్నఇల్లాళ్ళ కూలి డబ్బుల్ని
నోటకరచుకుపోయే గద్దలు
తాగుబోతు భర్తలు
ఆ ఇల్లాళ్ళకి కావాలో తెగింపు విజయం
పుస్తకాల బరువులో బాల్యాన్ని కుక్కి
ఆటపాటలంటే ఏమిటో తెలీకుండా
కేరింతల సంతోషాన్ని దూరం చేసే
చదువుల చెరసాలల్లో మగ్గిపోతూ పసిపిల్లలు
ఆ పసిపిల్లలకు కావాలో బాల్యవిజయం
చదువుకోవాలనే కాంక్షని
అలవికానిపనుల కోసం వెచ్చించి
మూల్యం చెల్లించే అసంఖ్యాక బాలకార్మికులు
ఆ బాలకార్మికులకు కావాలో విముక్తివిజయం
అవసరం తీరాక
ఆశల్ని తగలేసే నాయకుల్ని నమ్ముకుని
ఐదేళ్ళ భవితవ్యాన్నీ ఆకాంక్షల్నీ
మద్యానికీ డబ్బుకీ పంచి
ఓటుని స్వయంకృతంగా
చిదిమేసుకునే కోట్ల ప్రజానీకం
ఆ ప్రజలకు కావాలో ఆశావిజయం
డబ్బుకి తప్ప జీవితాలకు విలువలేదని
రాత్రికిరాత్రి రూపాయల కోటల్లో పాగాలు వేసి
నిజాయితీ కంటికి కునుకు దూరం చేస్తున్నారు
అక్రమార్జనా పరులు
ఆ నిజాయితీకి కావాలో చిరునవ్వు విజయం
-కొంపెల్ల కామేశ్వరరావు