కాలంతో ప్రయాణం
కాలంతో ప్రయాణం
ఎలా ఉంటుందో
నిన్ననే నాకు తెలిసింది. ..
నవ్వుతూనే ఆహ్వానించి
అంతలోనే చేయి
వదిలేస్తుంది...
కాలంతో కలిసి నడిచే
జీవితం మాత్రం
ఎప్పుడూ పైకి కనిపించని
ఒక అందమైన మ్యూజియం
గతించిన జ్ఞాపకాలు అందులో
నిత్యం భద్రం..
మనం నడిచే రహదారి
కూడా జీవితంలో ఒక భాగమే..
ఏమిటో నిన్న నా దారి నన్ను
వెంటబెట్టుకుని ఒకసారి
వెనక్కు తీసుకెళ్లింది...
ఎన్నో అడగాలని
ఆరాటపడ్డాను..
కానీ ఏదో బాధ
నన్ను ఆపేసింది...
ఐనా మనసులో ఎక్కడో
తెలియని ఆనందం
తన్నుకొచ్చింది...
నన్ను తనతో నడిపించే
ఇలాంటి ఒక కాలం కోసమేగా ఇన్నాళ్లు నేను వెతికింది..
నా తపస్సు ఫలించింది.
కనిపించే ఈ హద్దుల
కంచెల్ని చెరిపేసి
కాసేపు జీవించమని
మనసు చెప్పింది...
కానీ ఎదో భయం..
అడుగుపడడంలేదు..
కాలంతో ప్రయాణం అంటే
కత్తి మీద సాము లాంటిదే..
చివరికి నా గమ్యం
నా వెనకాలే వచ్చింది...
మీ మనుషులకు
దొరకని ఒక విలువైన
నిధిని అని
నా విధిని గుర్తుచేసింది..
కలిసి ప్రయాణించింది
కొన్ని నిమిషాలే ఐనా
మనసుకు కాస్త ఊరట
అందించింది....
కాలానిది, గమ్యానిది
ఎప్పుడూ ఒకటే మాట..
అన్వేషించు, శోధించు
సాధించు...
నీ ప్రయత్నమే
నీ విజయం అని
నవ్వుతో
నన్ను సాగనంపింది...
-ఇందువదన
(ప్రభుత్వోపాధ్యాయురాలు విజయవాడ)