"ఎట్లు మరణింతు"..మధుర కవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తి...కవితా ఖండిక -ఓ స్మృతి కిణాంకం
బెళ్ళూరి శ్రీనివాస మూర్తి గారు రాయలసీమ కవికోకిల, మధురకవి, అభినవ కాళిదాసు, కవితా తపస్వి బిరుదులను పొందారు. వారు "తపోవనము" "కావ్యగంగ" ఖండ కావ్యాలను, "వివేకానందము" ద్విపద కావ్యాన్ని, "రెడ్డి రాజ్య మహోదయము" "శిల్ప వాణి" తదితర కావ్యాలను రచించారు. రాయల సీమ కవి కుమారులలో అగ్రేసరులని ,కీట్సు వంటి వారని ప్రశంసలను పొందారు.
"కాంక్షలేవేఱు, నా మనోగతులె వేఱు
పూరిగుడిసెలలోనైనఁ బుత్తుగాని
గీతమల్లక బ్రదుకు సాగింపలేను
భావగానంబె నాదు సర్వస్వమవని!"
అని ఆలపించిన మధుర కవి శ్రీ శ్రీనివాస మూర్తి గారు.
"భారతి పత్రిక అవ్యాజ్య వాత్సల్యం తో భిక్ష పెట్టనిచో నా జీవితములో ఏనాడో కవితా సన్యాసము స్వీకరించి యుండ వలసిన వాడనే. భారతి నాకు గావించిన మహోపకృతి మరపు రానిది," అని తమ కవితలను ప్రకటించిన పత్రికకు కృతజ్ఞతలనర్పించుకున్న భవ్య స్పందనా బద్ధులు.
పల్లె జీవన ప్రకృతి సుభగత్వానికి తన్మయులై ఆ స్వచ్ఛందత్వంలో అజరామరత్వాన్ని కోరారు.
బెళ్ళూరి వారు తమ "తపోవనము" ఖండ కావ్యం లో రమణీయమైన పైరు పచ్చల పల్లె పొత్తును
విడచి "ఎట్లు మరణింతు" నంటూ వ్యాకులతను వ్యక్తం చేసిన చిన్ని ఖండిక లో అమృతమయమైన సందేశమిచ్చారు.
"లలిత సాంధ్య రాగంబులు, వలపు గొలుపు
నలశకుంత గీతంబులు చెలిమి నెరపి
బ్రతుకు తెరవైన ప్రకృతి సంపదలు విడిచి,
యెట్లు మరణింపవలెనంచు నేడ్తుస్వామి. "
అని ప్రకృతి పురుషునికి చేసిన విన్నపంలో ఈ పుడమి పై పుట్టుక ఎంత ఘనమో తెలిపారు.
ప్రకృతి లో పరమాత్ముని, ఆతనిలో ప్రకృతి సొబగును పరవశించి కనుగొన్న పరమ సుఖమును దూరం చేసుకొని "యెట్లు మరణింపవలెనంచు నేడ్తుస్వామి. అంటూ, ఇంతటి పర్యావరణ సంపదను పోగుచేసుకున్న బ్రతుకు భాగ్యాన్ని విడిచి పోవుట యెట్లన్న పరివేదన ను పఠితలకు పంచారు.
"అమృతము సృజించె ప్రకృతి సౌందర్య మహిమ " వెర్రినై ఎరుక మాలి, మోవి చేర్చితి విసపు గిన్నె "ఎట్లు మరణింతు " నంటూ ప్రతి ఒక్కరికీ జీవన భద్రతను అన్యాపదేశంగా వినిపించారు.
మింట జెలువొందు నాషాఢ మేఘములకు
మధుర తరమైన కేదార మాలికలకు
మైత్రి పొసగించు ప్రకృతి సామరస్యాన్ని విడిచి మరణించలేను
అంటూ కంట నీరు కార్చారు.
"ప్రకృతి పూజించి -తన్మయత్వంబు నొంది -పరమ ఋషులొందు నానంద భాగ్యమునకు-దవ్వుగా కాంక్ష లెల్ల వ్యర్థములు గాగ "మరణింప నేరనని విన్నవించు కున్నారు.
ఈ చిన్న ఖండిక లో కవి జీవన సౌందర్య విమర్శను కావించారు. లౌకికమయమైన అసమ చిత్తానికి అమృతమయమైన తాదాత్మ్యాన్ని కలిగించారు. పునీతమైన ప్రకృతి సాన్నిధ్యం లో పరి పూర్ణతను సాధించి శాశ్వత ఆనందాన్ని పొంద గోరారు.
అమూల్యమైన ప్రకృతి సన్నిధిని విడచి దూరం కాలేని కవి మృదుల భావన, సహజ శోభల కేదార సీమల రమ్య వాటికలకు కొని పోతుంది.
"శైశవం నుంచి బీళులే నా పుస్తకాలయములని , ఏకాంత వాసినై, ప్రకృతి ఒడిలో లాలింపబడుటయే నా జీవన పరమార్థమని" చెప్పుకున్న కవి తపస్వి "పద్య రచన ఆర్జవ గుణ నిధి" అనిన శ్రీమాన్ రాళ్ళపల్లి గారి ప్రశంస ఈ నాటి మనిషి జీవన గమనానికి మృత్యు భయాన్ని పోగొట్టి ఊర్జితమైన అమర జీవన మార్గ నిర్దేశాన్ని కావిస్తుంది.
పాటలే వినిపింతురా! -నా బ్రతుకు పాటతో పయనించురా !అని ఆనందము నభిషేకించుకున్న కవి శ్రీనివాస మూర్తిగారు.
<><><><><><><><><>
(జయంతి :ఫిబ్రవరి 4 -1910
వర్థంతి :ఫిబ్రవరి 5-1988)
<><><><><><><><><>
-రాజేశ్వరి. దివాకర్ల
(వర్జినియ ,యు .ఎస్)