హేరంబుని హెచ్చరిక
"ఓరీ త్రాష్టుడా!" బిగ్గరగా వినిపించిన ఆమాటలకు భయపడి చుట్టూ
చూసాడు గిరీశం.
"టీవీ ఆపలేదా?" పక్కనే కూర్చుని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటోన్న భార్య ఉమను అడిగాడు గిరీశం.
"ఆపే ఉందండీ....అయినా ఈ గదిలోనుంచే కదా ఆ మాటలు వినిపించాయి?" అమాయకంగా అడిగింది ఉమ.
"కాదులే పక్కింటినుంచి ఉంటుంది! అదీ మంచిదేలే...రేపటినుంచి వాళ్లు టీవీ పెట్టుకుంటే గోడ పక్కనే చెవి పెట్టి మనమూ వినవచ్చు." విప్పారిన ముఖంతో చెప్పాడు గిరీశం.
"మరీ అంత పీనాసితనం పనికిరాదండీ!" ఉమ హితవు పలకబోయింది.
"ఆ ఏంచెయ్యాలో నాకు తెలుసులే!" ఎప్పటిలానే దబాయించాడు గిరీశం.
"ఏం తెలుసురా నీకు మూర్ఖుడా?! నీ ఎదురుగా ఉన్న నన్నే గుర్తుపట్టలేకున్నావు?" మళ్ళీ గంభీరమైన గొంతు ప్రశ్నించింది.
భార్యాభర్తలిద్దరూ తేరిపారచూసారు. "వినాయకస్వామేమోనండీ!" వినాయకుని ప్రతిమ వైపు చూసి లెంపలేసుకుని దణ్ణం పెట్టుకుంటూ చెప్పింది ఉమ.
"అంతేనంటావా? స్వామీ నమోనమ: ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహే..." పాటందుకున్నాడు గిరీశం.
"మూర్ఖుడా... పాటల సంగతి తర్వాత. పత్రి సంగతేం
చేసావురా?"గద్దించింది గణేశుని కంఠం.
"స్వా...స్వామీ... పత్రి సంగతేంటంటే... నిన్న కొందామనుకునే బజారుకు వెళ్లాను స్వామీ... కానీ ఆకాశాన్నంటే ఆ ధరలు చూసి..." గబగబా రెండు చెంపలనూ ఛెళ్లుమని వాయించుకుంటూ, తడబడుతూ చెప్పాడు గిరీశం. "ఆ... ధరలు చూసి..." గద్దించాడు గణాథ్యక్షుడు.
"నేను అక్కడికీ చెబుతూనే ఉన్నా స్వామీ... మన లంబోదరునికి ఇరవయ్యొక్కరకాల పత్రి అంటే చాలా ఇష్టం. ఖరీదైనా తప్పకుండా తీసుకురండి అని. కానీ నా మాట వింటేనా స్వామీ?" వాపోయింది ఉమ.
ల్యాప్‌టాప్ తీసుకొచ్చి నా ఎదురుగా ఉంచి అంతర్జాలంలో ఆకుల బొమ్మలన్నీ చూపించి నేను సంతుష్టుడినయ్యేలా నన్ను మోసం చేద్దామనుకున్నావురా నీచుడా!" గౌరీతనయుడు గద్దించాడు.
"అంటే... ఎలాగైనా మీకు చేరుతుందనే ఉద్దేశంతో అలా..." నసిగాడు గిరీశం. "మరి ప్రసాదాలెందుకురా చేసిపెట్టారు?" ప్రశ్నించాడు పార్వతీనందనుడు.
"అంటే... తర్వాత నేను తింటాను కదా..." గభాల్న అనేసి నాలిక్కరుచుకున్నాడు గిరీశం. "అంటే నీవు ఆరగించుదామనే కానీ నాకు నివేదన చెయ్యడం కాదన్నమాట నీ ఉద్దేశ్యం?" కోపంగా అడిగాడు గజాననుడు. "క్షమించండి స్వామీ... మీ తర్వాతనే కదా మేము ఆరగించేది?" కరివదనుడి కాళ్లు పట్టేసుకున్నాడు గిరీశం.
"అవును స్వామీ ఈసారికి మన్నించండి. వచ్చే ఏడాదినుంచీ తప్పకుండా అన్ని రకాల పత్రులతోనూ మిమ్మల్ని పూజించుకుంటాము." నమస్కరించింది ఉమ."అసలు నాకిష్టమైన ఏకవింశతిపత్రి ధరలు అంత ఎగబ్రాకడానికి కారణం ఎవర్రా?" అడిగాడు ఆఖువాహనుడు.
"వ్యాపారస్తులు స్వామీ... ఎవడి మటుకు లాభాలు గడిద్దామనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదనుకోండి." పితూరీని చెప్పాడు
గిరీశం.
"కాదురా... దానికి కారణం మీరందరూ. పచ్చని చెట్లను నరికి విలువైన వనమూలికలనూ ఔషధాలనూ మీరు మృగ్యం చేసుకుంటున్నారు. అందుకే వాటి ధరలు కూడా మిన్నంటుతున్నాయి." విఘ్నరాజు వివరించాడు. "నిజమే స్వామీ... కరెక్టుగా చెప్పారు." ముక్తకంఠంతో చెప్పారు ఉమాగిరీశాలు.
"అందుకే ఇకనైనా మొక్కలు నాటండిరా. చెట్లను విచ్చలవిడిగా నరికేయడమే కాదు. వాటి స్థానంలో కొత్తమొక్కలు మొలిచేలా చూసుకోండి. లేకపోతే ప్రకృతిసంపదకే కాదు. కనీసం మీకు కూడా ఈ భువిపై స్థానం ఉండదు. మరొక్కమాట... మా అమ్మానాన్నల నామధేయాలను కలిగి ఉండటం వలన ఈ పర్యాయానికి క్షమిస్తున్నాను." హేరంబుని హెచ్చరికను విన్న వాళ్ళిద్దరూ, "అలాగే స్వామీ!" అంటూ సాష్టాంగపడ్డారు.
- రాజేష్ యాళ్ల ( విశాఖ )