Telugu Global
Arts & Literature

ఎన్నాళ్లు?

ఎన్నాళ్లు?
X

పుస్తకం

కేవలం కాగితాల కట్ట కాదు

ఒక కరదీపిక

వినోదం

దట్టించి చుట్టిన పూతరేకు

జ్ఞాన పరిమళాలు గుప్పుమనే

మొగలిపొత్తు......

పేజీలు పేజీలుగా విచ్చుకునే పుస్తకం

ఊరేగింపులో పిడికిళ్లకెరటాల నినాదఘోష

పుస్తకం

ప్రమాణ పూర్తిగా జీవిత రాజ్యాంగం

జీవన గానం!

కాని నాలోని పాఠకునికి

"సింగిల్ సెల్' శిక్ష ఖరారయ్యాక

ముక్కారు పంటలు పండే భూములు

రియల్ ఎస్టేటు కాటుకు

ఇళ్ల స్థలాలుగా మారినట్టు

దివ్వెల వరుసలా

పొందికగా ఉండే నా లైబ్రరీలోని

పుస్తకాల దొంతర్లు.....

దోమలకి ఫుడ్ పార్సిళ్లలా మారాయి

పళ్ల పళ్లెం పై కప్పిన లేసు ఛద్దరులా

సాలెగూళ్లు...సాలీళ్లకాలనీ మాదిరి పుస్తకాల రేక

నా చేయి తాకక

టేబుల్ మీది పుస్తకం

నీరవ నిశ్శబ్దంలో సమాధిరాయిని తలపిస్తోంది

గుర్రపుడెక్క అలుముకున్న పంటకాల్వలో

కట్టేసిన

బల్లకట్టు వలె దిగాలుగా ఉంది

జ్ఞానం జ్ఞానమే

సమాచారం సమాచారమే

వజ్రం వజ్రమే

ఎంత మెరిసినా రంగురాయి రంగురాయే

నదీ స్నానం మరిచి

బకెట్ స్నానం మరిగినట్టు

తల్లి పాల వంటి పుస్తకానికి దూరంగా

ఎన్నాళ్లీ పోతపాల బతుకు?

ఎన్నాళ్ల డబ్బాపాల బతుకు?

-ఎస్.హనుమంతరావు

First Published:  5 Feb 2023 9:47 PM IST
Next Story