e - తరం (కథ)
“మరి ఉద్యోగం చేయించే ఆలోచనే లేనప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ ఎందుకు చేయించారు ?” విక్రం గొంతు కాస్త తీవ్రంగానే వచ్చింది.
విశాలమైన హాలులో అందంగా, సౌకర్యంగా ఉన్న సోఫా సెట్ పై కూర్చొని, తింటున్న స్వీట్ మధురిమను ఆస్వాదిస్తున్న నేను ఒక్కసారిగా విస్తుపోయాను . ఎప్పుడూ మిస్టర్ కూల్ లా ఉండే మావాడు అంతలా మండిపడేసరికి.
పెళ్ళివారి వైపు చూసాను. పిల్లతండ్రి బిక్కచచ్చి, పిల్లతల్లి విస్తుపోయి ఉన్నారు. ఎదురుగా కుర్చీలో కూర్చున్న పెళ్లి కూతురు విజయ తలదించుకొని ఉండటం వలన భావాలు బయటకు తెలియలేదు.
“అదికాదు బాబూ !ఆడపిల్లకు నలుగురితో పాటు చదువు ఉండాలి అని చదివించాం. ఉద్యోగం కోసం అయితే కాదు” వివరణ ఇవ్వబోయాడా పిల్ల తండ్రి.
“మీరు చెప్పింది బాగుందండి. చదువు ప్రాధాన్యత తెలుసుకున్నందుకు చాలా ఆనందం వేస్తుంది. కానీ ఉద్యోగం అవసరం లేదు అన్నప్పుడు ఏదైనా డిగ్రీ చెయ్యించవలసినది. రాత్రనక పగలనక ఆ టెస్ట్, ఈ టెస్ట్ కోసం కష్టపడి చదివి, సరైన ర్యాంక్ కోసం టెన్షన్ పడి, మంచి కాలేజిలో సీట్ కోసం కౌన్సిలింగ్ చుట్టూ తిరిగి నానా బాధలు పడి ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తే...మీరు ఇలా అనడం బాగాలేదండి” ఆవేశం తగ్గినట్లుంది మావాడికి -కొద్దిగా నెమ్మదిగానే చెప్పాడు.
“ఈ కాలంలో సాధారణ డిగ్రీ చదివే అమ్మాయిలను మీలాంటి సాఫ్ట్ వేర్ వాళ్ళు చేసుకోవడం లేదు గదా బాబూ !అందరూ ఇంజినీరింగ్ అడుగుతున్నారని పిల్లని బి.టెక్. చదివించాము” పిల్లతల్లి అసలు విషయం చెప్పింది.
“నేను మీ అభిప్రాయాలు తప్పు అనడం లేదు. కాని, బి.టెక్. చదివిన అమ్మాయిని ఇలా ఖాళీగా ఉంచకూడదు అంటున్నాను.
సోఫాలో నా పక్కనే కూర్చున్న నా శ్రీమతి ఏదో అనబోతుంటే ‘ఆగు’ అన్నట్లు తన చేతి మీద చెయ్యి వేసాను.
ఒక అరగంట క్రితమే మేము మా అబ్బాయికి సరైన సంబంధం అని తెలిసి ఈ పిల్లవారింటికి వచ్చాము. మావాడు విక్రం మాస్టర్స్ చేసి, బెంగుళూరులో కంప్యూటర్ ఇంజినీర్ గా మంచి పొజిషన్ లో ఉన్నాడు. బాగా చదువుకొని జాబ్ చేసే అమ్మాయి తన భాగస్వామిగా రావాలని మావాడి కోరిక.
‘విజయ బి.టెక్. చేసిన అందమైన అమ్మాయని, వినయం, సంస్కారం గలదని, పిల్లతండ్రి సుబ్బారావు గారు ప్రభుత్వ ఉద్యోగని, మర్యాదలు ఉన్నవారని , ఒక్కసారి వచ్చి పిల్లను చూసి వెళ్ళండ’ ని మధ్యవర్తి నా చెవిలో చేసిన మోటివేషన్ తో విక్రంను ఒప్పించాను.
కాని ముందే చెప్పాడు విక్రం “ నాకు జాబ్ చేసే అమ్మాయే కావాలి. కానీ మీరు చెప్తున్నారని ఈ సంబంధం చూడటానికి వస్తున్నాను. కాని పిల్ల జాబ్ చేస్తానంటేనే చేసుకుంటాను. లేకపోతే అక్కడే నో చెప్పి వచ్చేస్తాను”.
అయితే అంత అందమైన అమ్మాయిని చూడగానే మావాడు మనసు మార్చుకొంటాడని మధ్యవర్తి మాటలతో నేను కూడా ధైర్యంగానే తలవూపి, పిల్లను చూడటానికి వచ్చాము.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. విజయ అందాల కుందనపు బొమ్మ. ప్రసన్నంగా ఉన్నఆమె ముఖం , నడక, మాట తీరు మాకు బాగా నచ్చాయి. విజయ తల్లి తండ్రులు కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు. విజయ తండ్రి మాటల సందర్భంలో “ఆడవాళ్లు ఉద్యోగం చెయ్యడం మా ఇంటా,వంటా లేదు. అందుకే నా కూతురుని జాబ్ కి పంపలేదు” అన్న మాటలకు ఒక్కసారిగా విక్రంకు ఆవేశం వచ్చి ఇలా గట్టిగా నిలదీశాడు.
రెండు నిమిషాలు అందరూ మౌనంగా కూర్చున్నాము లోలోపలి ఆలోచనలతో.
ఇలాంటివి ఎన్నో చూసిన మధ్యవర్తి వాతావరణాన్ని తేలిక చెయ్యడం కోసం “ మరేంలేదు సుబ్బారావు గారూ !పెళ్ళికొడుకు ఆలోచన నాకు బోధపడింది. బెంగుళూరు పెద్ద సిటి. ఖర్చులెక్కువ. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తే ఏదో వేణ్ణిళ్ళకు చన్నీళ్ళుగా తోడూ ఉంటుందని ,అంతే....” సర్ది చెప్పబోయాడు.
“అదేమీ కాదు నేను నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాను. నాకు నా భార్య సంపాదనపై ఆధారపడవలసిన అవసరం లేదు.” తూటలా వచ్చింది విక్రం నోటి వెంట.
“మరెందుకు బాబూ !అమ్మాయి ఉద్యోగం చెయ్యాలనే పట్టుదల మీకు”?అయోమయంగా అడిగినట్లున్నా, వ్యంగ్యం కనబడింది మధ్యవర్తి మాటలలో.
అందరి ముఖాల్లో కుతూహలం కనబడింది విక్రం సమాధానం ఏం చెప్తాడా అని ?
సోఫా లోంచి లేచి నిలబడి మా అందరిని చూస్తూ ఒక చిన్ననవ్వు నవ్వాడు.
నాకయితే నిజంగానే మతి పోయింది ఆ నవ్వు వెనుక ఉన్న మర్మం తెలియక.
"'న స్త్రీ స్వతంత్రమర్హతి ‘ అన్న మాటను నరనరాన జీర్ణించుకున్న మనందరికీ నా మాటలు కాస్తా ఇబ్బందిగా ఉండవచ్చు” విక్రం ఉపోద్ఘాతంతో ఉలిక్కిపడ్డాము.
“భర్త అడుగులకు మడుగులు వత్తుతూ, వండి పెడుతూ, చాకిరీ లు చేస్తూ భార్య అంటే ఇలానే ఉండాలి అన్న భావన మన సమాజంలో అధికశాతం నమ్మే ఒక బలీయమైన సిద్ధాంతం. ఆడవాళ్ళూ కూడా మాతో పోటి పడి చదువులలో రాణిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. కాని వంటింటి కుందేళ్ళుగా ఉండిపోతున్నారు. మరి వారు విద్యార్థి దశలో పడిన శ్రమ అంతా వృధాయేనా. ఇరవై సంవత్సరాల కష్టం గంగలో కలిసిపోవల్సిందేనా? “
గదిలో ఉన్న అందరం మౌనంగా విక్రం మాటలు వింటున్నాము.
విక్రం ప్రశ్నలకు సమాధానం మాదగ్గర లేదని మాకు తెలుసు. సుబ్బారావు గారి భ్రుకుటి ముడతలు పడి, ఆయన లోలోపల సంఘర్షణ ను
తెలియజేస్తోంది .సుబ్బారావు శ్రీమతి కుడిచెయ్యి ఆవిడ నోటిపైకి అప్రయత్నంగానే వెళ్లినట్లుంది.
“ఎందుకు నా భార్య ఉద్యోగం చెయ్యాలి అంటున్నాను అంటే ఎక్కడైనా ఉద్యోగం చేస్తే తనలో మానసిక పరిణితి వస్తుంది. పుస్తకాలు నేర్పిన విజ్ఞానానికి లోకాన్ని చూసిన అనుభవం తోడవుతుంది. ఒత్తిడులు,సమస్యలను తట్టుకొనే శక్తి, అధిగమించే తెలివితేటలు అబ్బుతాయి. తనకు సొంతంగా ఆలోచిందే విధానం వస్తుంది. నా భార్యకు సొంత వ్యక్తిత్వం ఉండాలనేది నా కోరిక” మా అందరి ముఖాలు చూసాడు. అందరం తననే చూడటం గమనించి కొనసాగించాడు.
“బయటకు వెళ్ళడం వలన ఏది మంచి ఏది చెడు అన్న వివేకం తెలుస్తుంది. చుట్టూ ఉండే రకరకాల మనుషులను, మనస్తత్వాలను పరిశీలించే శక్తి అలవడుతుంది. తద్వారా తన భర్త, పిల్లలను,ఇంటిని తీర్చిదిద్దుకొనే సామర్ధ్యం తెలియకుండానే వస్తుంది.”
ఎందుకో విజయ తల్లితండ్రుల ముఖాలు అప్రసన్నంగా ఉన్నట్లు, విక్రం మాటలు వారికి నచ్చనట్లే నాకనిపించింది.
“అన్నింటి కంటే ముఖ్యంగా నా భార్యకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి”
అర్థమయి అవనట్లున్న ఆ మాటకు అందరం తెల్లముఖం వేసాము. అది గమనించిన విక్రం నవ్వుతూ
“ ప్రతి చిన్న అవసరానికి నాపై ఆధారపడకుండా, తనకు ఏం కావాలన్న స్వేచ్చగా కొనుక్కోనే తృప్తి తనకుండాలి. నా సంపాదనలో కొంత భాగం తనకోసం పక్కన పెట్టి, ఖర్చు పెట్టుకోమని చెప్పవచ్చు. కాని అది ఆమెకు వస్తువులను ఇస్తుంది కాని , ఆనందాన్ని ఇవ్వదు. తన సొంత సంపాదన సంతృప్తి వేరు. అందుకే ఉద్యోగం చెయ్యమని చెప్తున్నాను. చదివిన చదువు సార్థకం అవుతుంది, ఇటు తన కాళ్ళపై తను నిలబడగలుగుతుంది. “
నేను చెప్పవలసింది చెప్పాను అన్నట్లుగా సోఫాలో కూర్చున్నాడు. నా చెయ్యి పట్టుకొని అడుగులు నేర్చిన ఆ చిన్నబాబేనా ఇంత పరిణితి గా మాట్లాడింది అన్న ఆశ్చర్యం, ఆనందంతో అభినందనపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చాను. .
అప్పటికే చిన్న బుచ్చుకున్న ముఖంతో ఉన్న సుబ్బారావుగారు “ మంచిది , మీరు చెప్పవలసింది చెప్పారు. మేము ఆలోచించి చెప్తాము” ఇక మీ సంబంధం మాకొద్దు అన్నట్లుగా ముఖం పెట్టి చెప్పారు.
‘అయ్యో మంచి అమ్మాయి, విక్రంకు సరైన జోడి మిస్ అవుతుందే’ అన్న బాధతో లేచి గుమ్మం వైపు రెండు అడుగులు వేసాము.
“అంకుల్, ఒక్క క్షణం ఆగండి” విజయ తియ్యని స్వరం విని వెనక్కి తిరిగాము.
లేచి నిలబడిన విజయ ముఖంలో దృఢనిశ్చయం కనిపించింది . కూతురు మాటతో ఆశ్చర్యంగా చూస్తున్న సుబ్బారావు గారిని చూస్తూ..
“నాన్నా! నేను అందరి ఎదురుగా ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను చాలా ముద్దుగా పెంచారు. కట్టుబాట్లు, సంప్రదాయాలు చాలానే నేర్పించారు. నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు. మీరూ అమ్మా బెస్ట్ పేరెంట్స్ . కాని ఇప్పుడు విక్రంగారు అన్న మాటలు మీ మనసును నొప్పించాయి. ఆలోచిస్తే , ఆయన మాటలలో వాస్తవం కనిపించింది. నాకు ఆయన, ఆయన ఆలోచనలూ నచ్చాయి. నేను పెళ్ళైన తర్వాత ఉద్యోగంలో చేరుతాను. ఈ సంబంధం ఖాయం చెయ్యండి నాన్నా”.
ఇంతవరకు తలవంచుకొని కూర్చున్న అమ్మాయిలో ఇన్ని భావాలు సుడులు తిరిగాయా ? నా శ్రీమతి నేను ముఖ ముఖాలు చూసుకున్నాము. విక్రం చిరునవ్వుతో రెండు చేతులు కట్టుకొని వింటున్నాడు.
“అదికాదమ్మా !....” ఏదో చెప్పబోతున్న తల్లిని వారిస్తూ...
“అమ్మా, ఆయన ఎంత ముందు చూపుతో తన భార్య ఉద్యోగం చెయ్యాలి, తనకు ఆర్ధిక స్వాతంత్రం ఉండాలని అన్నారో నాకు అర్థమయింది. ఆయన కొన్ని మాటలు చెప్పకూడదని చెప్పలేదు,కానీ ఆయన భావం నాకు అర్థమయ్యింది. రేప్పొద్దున ఎటువంటి ఇబ్బంది వచ్చిన నేను బేలగా, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు అన్న భవిష్యత్ దృష్టితో చెప్పారు. నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉండాలని ఆయన కోరుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసిందమ్మా.“
ఇబ్బందిగా ముఖం పెట్టిన తల్లి చేతులు పట్టుకొని ....
“ అమ్మా, ఆయన మాటలు విన్న తర్వాత ఆయనను చేసుకుంటే నేను అన్ని విధాలుగా సుఖంగా ఉంటాను అన్న నమ్మకం నాకొచ్చింది. భార్యను బానిసలా కాకుండా సాటి మనిషిగా, తన జీవిత సర్వసంగా చూసే మనిషి భర్తగా రావడం కన్నా వేరే మహా భాగ్యం ఏముంటుంది?.”
విజయ మాటలకు తెల్లబోయిన ఆమె తల్లితండ్రుల ముఖాల్లో మెల్లగా ఆలోచనల వీచికలు వీచసాగాయి.
“నా కాళ్ళమీద నేను నిలబడటం, ఆర్థిక స్వాతంత్రం ఉంటే రేపొద్దున మలి వయస్సులో మీకు ఏదైనా అవసరం పడినప్పుడు నేను స్వేచ్చగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చెయ్యగలను. ఆయన చెప్పేది కూడా అదే! అంతే కదండీ” విక్రంను చూస్తూ చిరునవ్వుతో అడిగింది విజయ.
బొటనవేలు పైకెత్తి చిరుమందహాసం చేసాడు విక్రం.
“ఇంత మంచి వ్యక్తి గుమ్మం దాటిపోతే మరి నాకు దక్కరేమో నన్న ఆత్రుతతో నేను ఇలా మాట్లాడాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి” అంటూ మా కాళ్ళ వద్ద వంగి నమస్కరిస్తున్న బంగారు తల్లిని పైకి లేవదీసి
“అలా మాట్లడటమే వలనే కదా ఇంత మంచి అమ్మాయి మాకు కోడలుగా రాబోతోoది” అంటూ నా శ్రీమతి విజయను పొదివి పట్టుకుంది.
అంగీకారంగా సుబ్బారావు దంపతులు కూతురు తలపై చెయ్యి వేసి దీవించారు.
-జి.వి.శ్రీనివాస్