Telugu Global
Arts & Literature

గురుపౌర్ణమి ప్రాముఖ్యత

గురుపౌర్ణమి ప్రాముఖ్యత
X

నారాయణ సమారంభాం!

శంకరాచార్య మధ్యమాం!-

అస్మద్గురు పర్యంతం!

నమామి గురుపరంపరామ్...

మనది శాశ్వతమైన సనాతన ధర్మం, దీనికి భగవానుడైన నారాయణుడు ఆది గురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుంచి వశిష్ఠుడు, వశిష్ఠుని నుంచి శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి శుకుడు. శుకుని నుండి గౌడపాదుడు, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదుడు. ఆయన నుండి ఆదిశంకరాచార్యులుసనాతన వేద ధర్మాన్ని స్వీకరించారు. ఆ సనాతన ధర్మాన్నిఉపదేశించి, మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే గురువే గురువు.

నారాయణుని నుండి శంకరాచార్య వరకు, మళ్లీ ఆయన చెప్పిన ధర్మాన్నే మనకు చెప్పిన మన గురు పరంపరకు గురువందనం.

గురువంటే ఎవరు? "సత్యాన్ని తెలిసినవాడు, దానిని తెలుసుకోవాలనుకొనే వారికి త్రికరణ శుద్ధిగా సహకరించేవాడుగురువు "అన్నారు ఆదిశంకరాచార్యులు.

గురువు తన మహత్త్వం చేతా, అనుగ్రహం చేత మనకు జ్ఞానమును దానం చేస్తాడు. గురువు సంప్రదాయానికి అతీతుడు. ఈ మానవ జన్మఎంతో ఉత్తమమైనది అట్టి జన్మను మనం సార్థకం చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. మనం బతకడానికి జీవనోపాధి, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి ఇల్లు ఎంత ముఖ్యమో, ఆదర్శప్రాయమైన జీవితానికి గురువు అంత ముఖ్యం.

ప్రతివానికి తొలిగురువు తల్లి, విద్యాభ్యాసం చేసేటప్పుడు విద్య నేర్పు వారు గురువు. జీవిత పరమావధిని గూర్చితెలుసుకొని ఉత్తములుగా జీవించుటకు తప్పనిసరిగా సత్సాంగత్యం, సద్గురువు ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది. ఎన్నిసత్గ్రంథాలు చదివినప్పటికీ ఎంతో ఉత్తములుగా వున్నప్పటికీ జీవన్ముక్తులు కావడానికి అది చాలదు.

మనల్ని ప్రతినిమిషం గమనిస్తూ మనం చేసే ప్రతి పనిలోనూ చక్కని అవగాహన, సహకారాలను అందించే గురువు మనకు లభించినప్పుడు. మన జన్మసార్థకం అయినట్టే

సద్గురువు అంటే ఒకబట్టలుతికే వ్యక్తి వంటివాడని, మలిన వస్త్రాలను అతను ఏరకంగా శుభ్రపరుస్తాడో, అలాగే 'గురువు' అజ్ఞాన మనే మలి నాన్ని పొగొట్టి 'జ్ఞానమనే వెలుగును అందిస్తాడని శాస్త్ర గ్రంథాల వల్ల విదితమవుతుంది. అట్టి గురువుని విశ్వా సపూర్వకంగా ఆరాధించే దినాన్నే మనము "గురుపూర్ణిమ" అని వ్యవహరిస్తున్నాం.

ఆది కాలం నుంచి ఆచార్యుడు, గురువు ఇద్దరూ ఒక్కటే.. 'ఆచార్య దేవోభవ' అని ఆచార్యునికి అతడుకోరిన దక్షిణ ఇవ్వాలని 'ఆచార్యవాన్, పురుషోదర' అంటేఆచార్యుడన్నవాడే జ్ఞాని కాగలడని ఉపనిషత్తులు తెల్పు తున్నాయి.

విద్యకు పూర్ణత, అనుష్టానాన్ని కలిగించేవారు గురువులు అజ్ఞానాంధకారము సద్గురువు అనుగ్రహము వలనేతొలగును. గురు కటాక్షముతో అర్హుడైన వాని చిత్తమందు అజ్ఞానము తొలగి భగవంతుని సాక్షాత్కారముచే నిత్య సుఖ శాంతులు కలుగును.

భగవంతుని చేరటమనేది అంత సులభ మైనది కాదు. దానికి ఎంతో సాధన కావాలి. అందుకు మనప్రయత్నం ఫలించాలంటే మార్గదర్శకత్వం అవసరం. ఆమార్గం చూసేవాడే గురువు తగిన గురువు దొరకటం ఒక అదృష్టం వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువుగాలభించే వరకు మనసు పరిపరి విధాల పోతుండేది. రామకృష్ణుని పరిచయం తర్వాత ఇక తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఒక గురువుగారి వద్ద ఓ శిష్యుడు ఉండేవాడు గురువుఏదైనా చెబితే దానిని ఉన్నది ఉన్నట్టుగానే అర్థం చేసుకునే వాడు ఆచరించేవాడు కానీ అంతరార్థం మాత్రం తలకు ఎక్కించుకునే వాడు కాదు.

ఓ రోజు గురువుగారు సర్వము బ్రహ్మమే అని బోధించారు. దానిని ఆ శిష్యుడు జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు. విద్యాబోధన అయ్యాక వీధిలోకి బయలు దేరాడు.ఇంతలో అతనికి ఓ ఏనుగు ఎదురయ్యింది. పైనున్న మావటి వాడు తప్పుకో తప్పుకో అని అరిచినా పట్టించుకోలేదా శిష్యుడు.

'నేనెందుకు తప్పుకోవాలి నేను బ్రహ్మము ఏనుగు బ్రహ్మమే.బ్రహ్మమునకు తన వల్ల అపాయమేముంటుంది? అని కదలక అలాగే నిలబడ్డాడు. ఆ ఏనుగు వచ్చి ఆ శిష్యుడ్ని తొండంతో పట్టుకుని పక్కకు విసిరివేసింది. అతడికి బలమైన గాయాలు తగిలాయి. గురువు వద్దకు వెళ్ళి జరిగింది చెబుతాడు.

అందుకా గురువు మంచిది, నీవును బ్రహ్మమే ఆ ఏనుగూ బ్రహ్మమే, కానీ మావటి బ్రహ్మము తప్పుకోమని పై నుంచి నిన్ను హెచ్చరించాడు కదా. ఆ బ్రహ్మము మాటనీవెందుకు పెడచెవిన పెట్టావు? అంటూ మంద లిస్తాడు.

అక్కడి నుంచి ఆ శిష్యుడు గురువు చెప్పింది యథాతథంగాఅర్థం చేసుకోకుండా అందులోని అంతరార్థం కూడా గ్రహించ సాగాడు.

గురువుల మాటల్లోని అంతరార్థం, అందులోని సారాంశం తెలుసుకోవడమే శిష్యుల ముఖ్యవిధి.ఈనాడు ఈ మాయా ప్రపంచంలో గుణహీనులైనప్పటికీ గురువులమనే వారు. పుర్వాచారాలను వదిలి సంచరించేవారు. తెలియని వేదాంతాన్ని చెప్పి మోసగిస్తూ ఇతరులను శిష్యులుగా చేసుకొనేవారు. ఇంద్రియ నిగ్రహం లేనివారు.

కాంతా కనకాలపై ఆశ వదలలేని వారు 'ఈ శరీరం అనిత్యం' అని తెల్పుతూ తమ శరీరంపై భ్రాంతిని వదలలేని మాయాగురువులున్నారని వారితో జాగ్రత్తగా మెలగాలని శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు తమ 'కాలజ్ఞానంలో తెల్చియున్నాడు.

అట్టి మాయ గురువులు, అవినీతుల పట్ల జాగరూకులై ఉండమని హెచ్చరించాడు.

మన భారతీయ సంప్రదాయములో సద్గురువు మంత్రోపదేశము చేసేటపుడు తన హస్తము శిష్యుని శిరస్సున వుంచి, నాదమునకుస్థానమైన కుడి చెవిలో సన్మంత్రోపదేశము చేస్తారు. ఆ విధముగా గురువు యొక్క హస్తమా శిష్యుని యొక్క మస్తకమును స్పృశించి చైతన్యపరచు కారణంగా, ఆ హస్తమస్తక సంయోగస్థానమును శక్తిపాత స్థానమని అంటారు.

ఆ హస్త స్పర్శవల్ల,కుడి చెవిలో ఉచ్చరించిన మంత్రోచ్ఛారణవల్ల సన్మంత్ర దేవతా, శిష్యుని యొక్క కూడా స్థానమైన బ్రహ్మరంధ్రము ద్వారాబిందు స్థానమును బేరి, బీజముగా ఏర్పడి, పిమ్మట ఉర్ధ్వమూలముతో, ఆరో ముఖముగా, శాఖోపశాఖలుగా, శరీరమంతా అనగా మస్తకాది పాదుకాంతము విస్తరిస్తుంది.

శబ్దమయ మంత్రదేవతా శక్తి యొక్క ప్రసార లక్షణమును సవివరముగా తెలిసినవారిని సద్గురువులని, పాదుకాంతదీక్షాపరులని అంటారు. సద్గురువు పాదస్పర్శ చేసి, ఆయన అనుగ్రహించినమంత్రమును, శిష్యుడు సంప్రదాయ రీతిలో అంతర్ముఖముగా చేయు అనుష్టానక్రియతో ప్రకాశ మానమవుతాడు.అందువలన భగవంతుని కన్నా గురువే ప్రధానం !

-కావ్యసుధ

First Published:  3 July 2023 9:31 AM IST
Next Story