Telugu Global
Arts & Literature

పువ్వెడు వసంతం కోసం (కవిత)

పువ్వెడు వసంతం కోసం (కవిత)
X

పువ్వెడు వసంతం కోసం (కవిత)

వసంత ఋతువు వచ్చిందో లేదో

ఆ కోకిల కంఠం

ఎలా పేలిపోతోందో చూడు

వృక్షాలు పుష్ప దేవతలై తేలిపోతూఉన్నాయి

వాక్యాలు పట్టాలు తప్పి

ప్రేమ లోయల్లోకి దొర్లిపోతున్నాయి

మాటలు , పాటలు

నినాదాల మైదానాల మీద

రాళ్లై చెప్పులై రాలుతున్నాయి

మిత్రమా !

ఒక్క క్షణ కాలం మరిచిపోదాం

ప్రజల కన్నీళ్లు

పుస్తకాలుగా మార్చి అమ్ముకుతినే కవుల్ని

ఇది చెట్లమీద

పువ్వులూ ఆకులూ

ప్రవహిస్తున్న కాలం

పంచభూతాలన్నీ కుట్రచేసి

మన మీద విసిరేస్తున్న ఇంద్రజాలం

ఇప్పుడు గులాబీలు కూడా

నీ చిరునవ్వుల్ని

కాపీ కొడుతున్నాయి

నీవిప్పుడు ఒక జాబువై

రైలెక్కి , ప్లేనెక్కి వానెక్కి

ఎప్పుడెప్పుడు నా చేతుల్లో వాలిపోదామా అని

ఒక ప్రగాఢ స్వప్న పరిమళాల్లో లీనమయిపోతున్నావు

కానీ నా ఆత్మ కథ

నీకేం తెలుసు ?

ఇవాళ నా కథలో

ఏ తేనెటీగా వాలడానికి

ఒక్క పువ్వుకూడా లేదు

వసంతాలకు ఈనాడు

నేను వాసయోగ్యం కానేమో !

ఎప్పుడు ఆకులు రాలుతాయో

ఎప్పుడు నగ్న శాఖల్లో నక్షత్రాలు పూస్తాయో నాకు తెలీదు

వసంతాలు వస్తున్నాయ్

వసంతాలు పోతున్నాయ్

ఒక్క పువ్వెడు వసంతం కోసం

చెట్లు ఆకులన్నీ రాల్చుకుంటున్నాయి

సజీవ భావోద్వేగం లో జీవితం సత్యాక్షరాలు రాలుస్తుంది

వెయ్యి దీపజ్యోతుల

భుజం తడుతూ

ఒక్క గాలికెరటం కదులుతుంది రేపు

ఎండల పాండిత్యం అనుభవిస్తున్న కర్షకుడికి

అదే

ఒక పువ్వులాంటి కబురు

-గుంటూరు శేషేంద్ర శర్మ

First Published:  30 May 2023 2:46 PM IST
Next Story