Telugu Global
Arts & Literature

ఆలంబన

ఆలంబన
X

'అతనికి అంతకోపం ఎందుకొ చ్చుoటుంది ? అలాంటి పని నేనేం చేశానో? 'అని వింధ్య రాత్రంతా ఆలోచిస్తూనే వుంది.అయినా కారణం బోధపడలేదు.ఏదైనా చెబితేగా తెలిసేది. చెప్పకుండా సాధించేవాళ్ళతో ఎవరు నెగ్గగలరు.

ఉదయం ఎనిమిది గంటలయింది.త్వరత్వరగా షాపుకి తయారవుతూ కాఫీ కలిపి సాత్విక్ కోసం చూసింది. హాల్లో పేపర్ చదువుతూ కనిపించాడు.

"కాఫీ "అంటూ కప్పు అందించింది రాత్రి కురిసిన కన్నీళ్ల వానలో ఎర్రబారిన కళ్ళను కనపడనీకుండా.

"లంచ్ బాక్స్ సర్దనా?" అంది వంటింట్లోకి వెళుతూ. "ఏం అక్కర్లేదు" అన్నాడు నిర్లక్ష్యంగా. ఆమెలో ఉక్రోషం తన్నుకొచ్చింది. "నా చేతి వంట వద్దా? అసలు నేనేవద్దా?" అంది చుర్రున చూస్తూ.కాఫీ కప్పు నేలకేసి విసిరికొట్టి గదిలోకి వెళ్ళి బట్టలువేసుకుని బయటకు వెళ్ళిపోయాడు సాత్విక్.

ఆ కప్పులానే ముక్కలైన మనసుని కూడదీసుకుంటూ ఒక్కొక్క మెట్టూ దిగుతూ బయటకు నడిచింది. తను ముందుకు వెళుతున్నా మనసు వెనక్కే తీసుకెళుతోంది.

ఎనిమిది నెలల క్రితం సాత్విక్ తో బస్టాప్ లో మొదలైన తీయని పరిచయం. ఇద్దరిమధ్యా జరిగిన సంభాషణంతా చెవుల్లో మారుమోగుతోంది.

***

"వద్దన్నా నావెంట పడతావెందుకు?"అంది.

"ప్రతిక్షణం నీ సమక్షాన్ని కోరుకుంటున్నానుకాబట్టి"అన్నాడు.

"నేను కాదంటే?" "నా బతుకు శూన్యం"

"నేను కనపడకపోతే?" " నా కళ్ళకు చీకటే"

"నీ మాటలతో నాకు విసుగు తెప్పించకు"

"నీ మందార మధుర హాసం వినపడకపోతే నేను పూర్తిగా పిచ్చివాడనైపోతాను"

"మన కులాలు వేరు" "కలసిన మనసులకన్నా కులాలు గొప్పవా?"

"నువ్వు అనాధవని మా పెద్దలకు అభ్యంతరాలుంటాయి" "అనాథను కాబట్టే నాకొక కుటుంబం కావాలని చెప్పి వాళ్ళని ఒప్పిస్తాను" "ఒప్పుకోకపోతే?" "నచ్చచెబుదాం" "అయినా ఒప్పుకోకపోతే"

"ఓడిపోయి బతకలేను. నువ్వు లేని చేదు జీవితాన్ని ఊహించలేను" "అటూ ఇటూ ఎవరూ లేకుండా ఒంటరిగాఎలా బతుకుతాం?" " మన అనురాగం గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చెబుదాం"

"నేను మా ఇంట్లో చెప్పేసాను" "ఏమన్నారు?" అతను ఆతృతగా అడిగాడు.

" ఏమంటారు. వద్దన్నారు. నిన్ను మర్చిపొమ్మన్నారు. మళ్లీ అతన్ని కలిస్తే మర్యాదగా ఉండదన్నారు.ఒకవేళ తమని కాదని పెళ్లిచేసుకుంటే గడప తొక్కమన్నారు."

అంతే, అతను చెయ్యి మణికట్టు కోసుకుని హాస్పిటల్ లో చేరాడు. తిండి మానేసి జీవచ్చవంలా మారాడు. అతని దగ్గరకు పరిగెత్తుకెళ్లి

"ఐ లవ్ యూ.మనం పెళ్లిచేసుకుందాం" అని చెబితే ఆకాశాన్నంటిన ఆనందంతో

ఉక్కిరిబిక్కిరయ్యాడు.తన చేతుల్ని తీసుకుని ఆత్మీయంగా అతనిగుండెకు హత్తుకున్నాడు. మంత్రాలు,మంగళ వాయిద్యాలలేవీ లేకుండానే గుళ్లో తాళికట్టాడు. తన చేయందుకున్న ఆరోజు అతని కన్నుల్లో వేయి సంతోషాల కాంతిపూలు విరిసాయి.

ఇద్దరూ ఒక్కరై ప్రారంభించిన జీవిత ప్రయాణంలో కలబోసుకున్న తీపి కలలన్నీమమతల తీరాన్ని చేరేవేళ.....

యాత్ర ఇంత కఠినంగా మారిందెం

దుకని? అప్పుడు తన మాటలతో మురిపించేవాడు. ఇప్పుడు తను కనపడితేనే చిరాకు పడుతున్నాడు. ఆనాడు ప్రతిక్షణం తన సమక్షాన్ని కోరుకునేవాడు.ఇప్పుడు అకారణంగా విసుక్కుంటున్నాడు.

నూరేళ్లు అనుభవించాల్సి అమృత ఫలం ఎనిమిది నెలలకే చేదైపోయిందా?

ఎందుకీ కక్ష సాధింపులు?.

బస్ స్టాప్ లో బస్సెక్కి కోఠీ సెంటర్ లో దిగింది వింధ్య. పదినిమిషాలు నడిచాక తను నడుపుతున్న మహిళా 'ఫ్యాబ్రిక్ డిజైన్ సెంటర్' కి వెళ్ళింది . అందులో పనిచేసే పది మంది లేడీ స్టాఫ్ అప్పటికే వచ్చేసారు. రకరకాల మోడల్స్ బట్టలు కుట్టి ఆన్లైన్ లో అమ్మడం చేస్తుంటుంది.

"నిన్న కొనమన్న ఫ్యాబ్రిక్ దొరికిందా?" అడిగింది వాళ్ళు చేసిన డ్రెస్ డిజైన్స్ ని పరిశీలిస్తూ.

"లేదు మేడం,ఇక్కడెక్కడా దొరకట్లేదు. వంశీగారు ముంబై టెక్స్టైల్ మిల్ కి ఆర్డర్ పెట్టారు. రెండ్రోజుల్లో వచ్చేస్తుంది." చెప్పింది స్టాఫ్ మెంబెర్.

"సరే, నిన్న రిపేర్ కి ఇచ్చిన మిషన్ వచ్చిందా?" " వంశీగారు నిన్ననే బాగుచేయించుకొచ్చేశారు". "ఓకే..

సెలవులకు వెళ్లిన ఎంబ్రాయిడరీ వర్కర్స్ వచ్చారా?" " ఇంకా రాలేదు మేడం,

వంశీగారు వేరే చోట ఇచ్చి వర్క్ పూర్తిచేయించుకొచ్చారు" "సరే, మీ పన్లు మీరు కానీయండి. రేపటికల్లా మనం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నాలుగు బండిల్స్ ప్యాక్ చేసి గుజరాత్ కి డెలివరీ పంపాలి. "అని చెప్పి సరుకు చెక్ చేయడానికి గోడౌన్ వైపు నడిచింది వింధ్య.

వంశీ రాకతో షాపు ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. అందరూ మహిళలే అతనొక్కడే మగవాడు. ఆడవాళ్ళందరికీ ఆర్ధిక స్వావలంబన ఉండాలని సాత్విక్ తనతో ఆ షాపు పెట్టించాడు. అందులో నిరుపేద మహిళలకు పనికల్పించాడు. ఆరునెలల్లో కొంత ప్రగతి సాధించి నప్పటికీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగలేదు.అప్పుడే పనికావాలంటూ తనదగ్గరకు వచ్చాడు వంశీ.

"ఇక్కడ అందరూ ఆడవాళ్లే పనిచేస్తారు. మీరింకో ఉద్యోగం చూసుకోండి సారీ"అని చెప్పేసింది వింధ్య. "లేదు మేడం ..నాకెవరూ పనివ్వట్లేదు. మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర.అందుకే మా అమ్మగారిని చూసుకుంటూ మధ్యాహ్నం వస్తూ పోతూ ఉండటానికి వీలుంటుం

దని ఇంతగా అడుగుతున్నాను." అని చెప్పాడు. తల్లి సెంటిమెంట్ కావడంతో జాలి కలిగి ఒప్పుకుంది.

"మీ పని నాకు నచ్చకపోతే ఏ క్షణంలోనైనా తీసేస్తాను" అని చెప్పింది. అతను పనిలోచేరిన నెలలోనే సేల్స్ పెరిగాయి.రాబడి పెరిగింది. అతన్ని తీసేసే కారణం కనపడలేదు. కానీ అందరూ ఆడవాళ్ళున్న షాపులో ఒక అబ్బాయి ప్రవేశం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడింది. కానీ వంశీ ముభావంగా ఉంటూ తనపని తనుచేసుకు పోతున్నాడు.

గోడౌన్ లోంచి బయటకు వచ్చి లెక్కలు చూస్తుంటే ఒక అనుమానంవచ్చింది వింధ్యకి.ఒకవేళ వంశీని పనిలో పెట్టుకున్నానని సాత్విక్ కి కోపం వచ్చిందేమో? అలా అయితే చెప్పొచ్చుగా తక్షణం అతన్ని పనిలోంచి తీసేస్తాను. అది కారణం అయ్యుండదు. వంశీ రాకముందు నుంచే సాత్విక్ ప్రవర్తనలో మార్పొచ్చింది.ఈరోజు గట్టిగా అడిగి తెలుసుకోవాలి.ఈ భారాన్ని తొలగించుకోవాలి అనుకుంది.

రాత్రయింది. సాత్విక్ బయటే భోజనం చేసొచ్చి తనగదిలో పడుకున్నాడు. వింధ్య వంటిల్లు సర్దేసి చక్కగా ముస్తాబై అతని గదిలోకి వెళ్ళింది. పడుకుని పుస్తకం చదువుకుంటున్న సాత్విక్ ముందుకు వెళ్లి అతనికి దగ్గరగా నిలబడి

"నా చేతిలో ఏముందో చెప్పుకోండి" అంది గుప్పిళ్ళు మూసిన చేతులు చూపిస్తూ.

అతను ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. "పోనీ నేనే చెప్పనా?" అంటూ గుప్పెళ్ళు విప్పి చూపించింది. ఆమె చేతిలో రెండు చెక్కిన రాళ్ల ఆఠీన్ ఆకారపు గుర్తులు.వాటికి ఎర్ర రంగు వేసినవి.

పెళ్లికాకముందు ఆ రాళ్ళని స్వయంగా సాత్విక్ చెక్కి తనకు ప్రేమ కానుకగా ఇచ్చాడు. వాటివైపు ఓసారి చూసి పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి పడుకున్నాడు. వింధ్య మనసు చివుక్కుమంది.

"మీకేమైందండీ, ఎందుకిలా వుంటున్నారు? ఇటు చూడండి." అంది అతని ముందుకు వెళ్లి కళ్ళలో కళ్ళు కలిపి చూస్తూ. ఆమె కట్టుకున్న తెల్లచీర,మల్లెపూలవంక తీక్షణంగా చూసాడు. అతని చూపుల వేడికి ఆమె అనురాగాల విరులు వాడి

పోయాయి."ఒంట్లో బాగాలేదా?" అంది. "నాకు ఇంట్రెస్ట్ పోయింది" అన్నాడు

ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక అతనికి దూరంగాజరిగింది.అతను నిద్రకు ఉపక్రమించాడు. అద్దం ముందు నిలబడి తనను తను చూసుకుంది. ఎనిమిది నెలల్లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

మొహం లావై నాజూకుదనం తగ్గింది. అయితే మాత్రం.ఇంట్రెస్ట్ పోవడం ఏంటి?భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికీ, శారీరక అందానికీ సంబంధం ఏముంది? కలిసి కలబోసుకునే కబుర్లలో వుండే ఆత్మీయత చాలదా ఈ జీవితానికి? అయితే తన అందం చూసి పెళ్లి చేసుకున్నాడా?అతని వ్యామోహాన్ని తను ప్రేమనుకుని మోసపోయిందా?

ఆరాత్రంతా ఆమెను దుఃఖపుటలలు ముంచెత్తుతూనే ఉన్నాయి.

మర్నాడు సాత్విక్ ని నిలదీసి అడిగింది. మళ్లీ రాత్రి సమాధానమే ఇచ్చాడు. "అంతకు మించి చెప్పేదేం లేదా? నానుంచి ఏదీ వినాలనుకోవట్లేదా? "అంది. "లేదు" అన్నాడు. "అయితే ఇప్పుడేం చేద్దాం?" అంది. "విడిపోదాం "అన్నాడు."ఇదేనా పరిష్కారం?" అవునని అతని సమాధానం. ఆసక్తి లేని చోట అరక్షణం కూడా ఉండటం నాకిష్టంలేదన్నాడు. ఆత్మాభిమానం దెబ్బతినడం కన్నా పెద్ద అవమానం లేదని తననుకుంది. ఒకప్పుడు అతని ఇష్టాన్ని గౌరవించింది. ఇప్పుడు అతని అయిస్టానికీ తలవంచింది .

"నన్ను వదిలి వెళ్ళిపోతారా?" అంది ఉద్వేగాన్ని అణుచుకోలేక అతని అక్కున చేరబోతూ. పక్కకు జరిగి "అవును"అన్నాడు.

"ఇదే మీ నిర్ణయమైతే సరే. " అంది.అతను బట్టలు సర్దుకున్నాడు. "చివరిగా ఒక్కసారి ఆలోచించండి. బంధాలు ఇంత తేలిగ్గా తెంపుకుంటే మిగిలేది శూన్యమే" అంది.

" నా శూన్యం గురించి నువ్వాలోచించకు. తిరిగి వస్తాననికూడా అనుకోకు.మనం సంప్రదాయబద్ధంగా పెళ్లిచేసుకోలేదు.

కాబట్టి విడాకులతో కాదా పనిలేదు" అని చెప్పి గడపదాటాడు. ఆమె మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది.

'అనుభూతులకు ఆధారం మనసా,

శరీరమా? అవి అతనికి కలగకపోవడానికి కారణం నేనా?అతనా? 'తెగని ఆలోచనలలో సతమతమయ్యింది.ఆమె చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం కూడా

ఆమె దుఃఖాన్ని చూసి జడుసుకుంది.

**

"మేడం! అమ్మా నాన్నల్ని మించిన అండ మరొకరు వుండరు. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మనండి" అన్నాడు వంశీ ధైర్యం చెబుతూ.

"ఏ మొహం పెట్టుకొని రమ్మంటాను.వాళ్ళు వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందనుకుంటారు" అంది.

"పొరపాటు . వాళ్లెప్పుడూ అలా అనుకోరు మేడం. మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనుకుంటూ ఉండుంటారు. లేదని తెలిస్తే క్షణంనిలవలేరు.

వచ్చేస్తారు" అన్నాడు. ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది. విషయం తెలియగానే వచ్చేసారు. వాళ్ళు ఆమెను ఏమీ అడగలేదు. అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడనే ప్రశ్నకు 'ఇంట్రెస్ట్ లేక' అనే సమాధానం విన్నాక.

కానీ వాళ్లలో కలిగే

ఎన్నో ప్రశ్నలకు ఆమె ప్రమేయం లేకుండా జారే కన్నీటి చుక్కలే సమాధాన. మయ్యాయి.

పూర్తిగా నిస్తేజం ఆవరించిన ఆమె షాపు మూసేయ్యాలనుకుంది. షాపులోని వర్కర్స్ వచ్చి తమకు ఆధారం పోతుందని. అలా చేయొద్దని వింధ్యని బతిమలాడారు.

"వంశీ,నేను రాలేనుగానీ, ఓ పది రోజులు షాపు మీరే చూసుకోండి" అంది వింధ్య.

" సరే మేడం" అన్నాడు. క్యాలెండర్ లో ఒకనెల గిర్రున తిరిగిపోయింది.

"షాపుకి వెళితేనన్నా నీ మనసు కాస్త కుదుటపడుతుందేమోనమ్మా. వంశీకే అన్ని పనులూ అప్పజెప్పేస్తే, అతను మాత్రం ఎన్నని చూసుకుంటాడు చెప్పు...షాపుకి వెళ్లి కాసేపు కూర్చునిరా" అంటున్న తల్లికేసి నిరుత్సాహంగా చూసింది వింధ్య.

" కాలం తెచ్చే మార్పులలో మన ప్రమేయం లేనప్పుడు నో రిగ్రెట్స్. వదిలేసి వెళ్లిపోయిన అతగాడి గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంతమంచిది. షాపుకి వెళ్లి అక్కడి పనులు చూసుకుంటుంటే కాస్త ఊరటగా ఉంటుంది." అని తండ్రి పలుమార్లు చెప్పాక షాపుకి వెళ్ళటం మొదలుపెట్టింది వింధ్య.

ఆతర్వాత ఆమె దృష్టి మొత్తం షాపు మీద కేంద్రీకరించింది. మూడునెలల్లో ఆర్దర్లు బాగా వచ్చి,అమ్మకాలు జోరందుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరిగింది. ఆమెకు వంశీ అన్నివిధాలుగా తోడుగా ఉండటాన్ని గమనించన వింధ్య తండ్రి ఒక ఒకరోజు...

"వింధ్యా! నీకీ విషయం తెలుసా? వంశీ భార్య చనిపోయి రెండేళ్లయ్యిందిట. మొన్న మాటల్లో నాతో చెప్పాడు" అన్నాడు.

"అవును నాన్నా, అతనికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు పాపం. చాలా మంచిమనిషి." అంది వింధ్య లాప్ టాప్ లో షాపు లెక్కలు సరిచూసుకుంటూ.

"నేనతనితో మాట్లాడాను. జీవిత ప్రయాణం ఆగిపోకూడదు.మళ్లీ పెళ్లి చేసుకోమన్నాను"

"అవునా? మంచి సలహా ఇచ్చారు. అతనేమన్నాడు" అంది సీరియస్ గా వర్క్ చేసుకుంటూ." నిన్ను పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకున్నాడు" " "అవునా...గుడ్...మీమాట విన్నాడు....వ్వాట్.. నన్నా? .. పెళ్లా..?

మీరేం అంటున్నారు నాన్నా.."

అని కలవరపడుతూ అడిగింది .

"మీ నాన్న అన్నదాంట్లో తప్పేం లేదమ్మా.. వంశీ మంచివాడు. అతనికి ఎవరూ లేరు. మీరిద్దరూ ఒకరికి ఒకరు ఆసరా అవుతారని మా నమ్మకం.మా ఇద్దరికీ వంశీ బాగా నచ్చాడు. నువ్వూ ఆలోచించు." అని తల్లి చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. కానీ వంశీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంది.

****

"ఇందులో తప్పేముంది మేడం. పెళ్లంటే ఒక ఆత్మీయతోడు. అందులో కొన్ని అవసరాలుకూడా ఉంటాయి. అవి వాళ్లిద్దరూ మాత్రమే పంచుకోదగినవి. వేరొకరికి పట్టింపు లేనివినా అన్న భావనతో జీవించగలిగే బంధాన్ని కోరుకోవడం తప్పు కాదు. మనసులో మాట చెప్పుకునేందుకైనా మన అనే మనిషి తోడు కావాలికదా." వంశీ చెప్పేదంతా నిజమే అయినా సాత్విక్ వలన అయిన గాయం నుంచి కోలుకోలేక పోతున్నానని చెప్పింది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ప్రేమ గాయానికి మందు ప్రేమే. అంటూ వంశీ రోజూ చెప్పే మాటల ప్రభావానికి తోడు తల్లీ తండ్రీ కూడా ఆమె ఒంటరితనానికి మందు తిరిగి పెళ్లిచేసుకుని సంసారంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగటమని చెప్పారు.

వింధ్య ఆలోచించుకోటానికి కొంత టైం తీసుకుంది. ఒకరోజు వంశీ ఆమె దగ్గరకు వచ్చాడు. "మేడం, నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను" అన్నాడు. "ఏమైంది? ఏదన్నా ప్రాబ్లమా?. " మా పెదనాన్న కూతురికి ఆరోగ్యం బాగోలేదు.ఒకసారి చూసి రావాలి." అన్నాడు. "వెళ్లి రండి. డబ్బులు కావాలంటే తీసుకెళ్లండి" అంది. "సరే మేడం" అన్నాడు

"నన్ను ఇకమీదట మేడం అనకండి. వింధ్య అని పిలవండి చాలు" అంది నవ్వి. "థాంక్యూ వింధ్యా" అన్నాడు చిరునవ్వుతో.

వంశీ అతని తల్లిని తీసుకుని ఊరు వెళ్లి వారమైంది. ఇంకా రాలేదు. రెండు వారాలు , నెలరోజులు కూడా దాటిపోయింది. అతనినుంచి ఏ కబురూ లేదు.

"నాన్నా, అప్పుడనగా వెళ్లిన వంశీ రాలేదు. నామనసెందుకో కీడు శంకిస్తోంది. ఇతను కూడా నన్ను మోసం చేయట్లేదు కదా!" అంది వింధ్య.

"నువ్వేం అధైర్య పడకమ్మా, అతని చెల్లెలికి ఎలా వుందో ఏమిటో. హాస్పటల్ లో చేర్చారన్నాడుగా. అతను ఆ హడావిడిలో ఉండుంటాడు" తండ్రి చెప్పేది నిజమనిపించినా,ఆమె మనసు ఏ మూలో అనుమానం తొలుస్తూనే ఉంది. "నేనసలు మోసపోయేందుకే పుట్టానా? నాకే ఎందుకిలా జరుగుతోంది?అని వ్యధ కలిగింది ఆమెలో.

ఆమె ఎదురుచూపులతో గడుపుతోంటే అతను వచ్చాడు. అతను రాగానే "మీ చెల్లెలికి ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగింది ఆతృతగా.

" ఆమె ఇక లేదు" అన్నాడు. "అయ్యో..వెరీ సారీ.. అసలేమిటి జబ్బు?.మందులిప్పించారా?" అంది.

" అది మందులతో నయమయ్యే స్టేజ్ దాటిపోయింది. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్. ఎంత ప్రయత్నించినా లాభంలేక పోయింది. బతికిద్దామని ఎక్కడెక్కడికో తిప్పాను.ఆ ఒత్తిడిలో మీకు ఫోన్ చేయలేకపోయాను. సారీ" అన్నాడు.

"సారీ ఎందుకండీ. పాపం మీరు మీ చెల్లెలి గురించి బాధలో ఉన్నారు. వెరీ సారీ.ఆమెకు పెళ్లైందా?"

"అయ్యింది" "అయ్యో, ఇప్పుడు ఆమె భర్త పరిస్థితి బాధాకరం కదా!" అంది నొచ్చుకుంటూ.

"మా చెల్లికి తను చనిపోతానని ముందే తెలుసు.తను లేకపోతే అతన్ని కనీసం పలకరించేవాళ్ళు కూడా ఉండరని భయపడింది. అందుకే ఆమె వుండగానే మా బావని బాధ్యత గల వేరే స్త్రీ చేతిలో పెట్టింది. ఇంకా కొన్నాళ్లలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు" అన్నాడు.

"అవునా, రియల్లీ గ్రేట్ , మీ చెల్లెలికి ఎంత ముందుచూపో చూడండి. తన భర్త ఒంటరివాడు కాకూడదని ఎంత బాగా ఆలోచించింది. హౌ గ్రేట్ షి ఈజ్?!" అంది. "

"అవును , ఇద్దరు కలిసి చేసే ప్రయాణంలో అకస్మాత్తుగా ఒకరు అదృశ్యమైతే మరో మనిషి మానసికస్థితిని అంచనా వేయగలగడం అందరివల్లా కాదు.ప్రేమంటే బాధ్యతగా మెలగడం. తన బాధ్యతను వేరొకరికి అప్పగించి మరలటం, వాళ్ళ ఆనందాన్ని కోరుకోవడం గ్రేట్ కదా" అన్నాడు వంశీ.

పదిరోజుల క్రితమే క్యాన్సర్ తో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడైన సాత్విక్ కి భార్య వింధ్య మీదున్న అమితమైన ప్రేమను తలుచుకుంటూ.

"మీ చెల్లెలిది చాలా గొప్ప వ్యక్తిత్వం. అటువంటి నిస్వార్ధపరులు అరుదుగా వుంటారు." అంది నమస్కరిస్తూ.

"అటువంటి మంచి మనుషుల ఆత్మకు శాంతి కలగాలని ప్రతిరోజూ కోరుకుందాం మనం.అదే వారికి అసలైన నివాళి"

అన్నాడు వంశీ.

- గొర్తి వాణీ శ్రీనివాస్

First Published:  22 April 2023 3:01 PM IST
Next Story