Telugu Global
Arts & Literature

కొన్ని సందర్భాలు

కొన్ని సందర్భాలు
X

తెలిసిన వారే

తెగువను నేర్పించిన వారే

రోజు రోజుకు కనుమరుగవుతున్నారు

అంచనాలు తరుగుతున్నాయి తప్పటడుగులు పెరుగుతున్నాయి

అలసట లేకుండా మనసు తలంపులతో

తగువు లాడుతున్నది దారితప్పిన మనిషి

దరికి వచ్చేదెప్పుడో

మానవీయమైన

పందిరి కిందికి

మనమంతా చేరేదెప్పుడో...!

నడిచిన బాటనే కావచ్చు కొత్తగా దర్శనమిస్తుంది

నడిచే మనుషుల ముఖాలు నిత్యం మారుతుంటాయి అందుకేనేమో

ఊళ్ళో యాత్రికున్నై దారులన్నింటినీ పలకరిస్తుంటాను

పూలు వికసించిన తోటల్లా ఇప్పుడు బాటలన్నీ మాటలతో విలసిల్లుతున్నాయి..!

అనుభవాలు చెలిమెల వంటిది

గత కాలపు గుర్తులను తలచుకున్నప్పుడల్లా తడియారని స్పర్శలా తనువంతా ఉప్పొంగుతాయి

తోడుకున్న కొద్ది

ఊరుతున్న జలంలా జీవనోత్సాహం ఉరకలేస్తుంది ఉరుముతున్న ఆందోళనలతో చెదిరి పోతున్న

నల్లని మబ్బుల్లా చెలిమలెప్పుడు ఇంకిపోవు అనుభవాలెప్పుడు వీడిపోవు..!

- గోపగాని రవీందర్

First Published:  25 July 2023 4:29 PM IST
Next Story