Telugu Global
Arts & Literature

సనాతన ధర్మం -కొన్ని నాస్తిక గొంతులు

సనాతన ధర్మం -కొన్ని నాస్తిక గొంతులు
X

వేదాలు

సృష్టి ధర్మాలు

దైవ వాక్కులు

లిఖిత మార్గాలు.

నాల్గు వేదాలూ

జీవన పద్దతుల్ని భాషిస్తుంటే

వర్గ బేధాలు

దమన కాండ రూపాలౌతున్నాయి.

ఏ మత గ్రంథమైనా

ధర్మాన్ని గొడుగు లా కాస్తుంది.

మంచిని తొడుగుకొమ్మంటుంది.

సూక్ష్మ o గా చూస్తే

వృత్తి విద్య

కులవిద్య కు

పరిమితం కాలేదు.

విశ్వవేదిక పై

ఎంచుకునే వృత్తి కి

స్వేచ్ఛ వుంది.

సమస్య అంతా

ఎక్కడ బానిసత్వం

తొంగి చూస్తుందో

ఎక్కడ అజ్ఞానం రాజ్యమేలుతుందో

ఎక్కడ వివేకం నశిస్తుందో

ఎక్కడ శ్రమ విలువ జారిపోతుందో

అక్కడ చైతన్య దీపాలు వెలగాలి

అక్కడ తిరుగుబాటు నడవాలి

కొన్ని సమస్యలకు

నిరసన ఆయుధమైతే

కొన్ని సమస్యలకు

మూలాల్ని సవరించాలి.

సనాతన ధర్మం

ఎలా ఉండాలో ధర్మబోధ చేస్తే

నాస్తికం భౌతికమై కూచుంది.

వాదాలు ఎవయినా

మనిషి వాస్తవం

మనుగడ వాస్తవం

మానవత్వం బోధించే

సిద్ధాంతం

నిజమైన వాస్తవిక అవసరం.

మనిషిని

మనిషిగా చూసే కళ్ళలో

దైవత్వముంది

దైవత్వ భావనే

మనిషిని నైతికంగా నడిపిస్తుంది.

విలువలు ఇచ్చి పుచ్చుపైనే

మనుషులుగా జీవిద్దాం.

మరో భావితరాలకి

మార్పులు జరిగినా

ఈ ధర్మ భూమి లో

విలువల నిధి గా వెలిగిపోదాం.

గవిడి శ్రీనివాస్

First Published:  29 Nov 2023 5:25 PM IST
Next Story