Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    శుక్లాంబరధరం

    By Telugu GlobalSeptember 18, 20237 Mins Read
    శుక్లాంబరధరం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    శుక్లాంబధరం విష్ణుం

    శశివర్ణం చతుర్భుజమ్।

    ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥

    అన్న శ్లోకం కొన్ని వందల యేళ్లనుండీ భారతీయుల నోళ్లల్లో నానుతూ వస్తోంది. అయినా, ఏ మాత్రమూ తన తీపిని కోలుపోలేదు. దీని అర్థాన్ని నిర్ణయించే ముందు, ఈ శ్లోకం వాఙ్మయంలో ఎక్కడెక్కడ ఉందో పరిశీలిద్దాం.

    పద్మపురాణం: వేదవ్యాసుడు రచించినటువంటి పద్మపురాణం లో నాలుగవదైన పాతాళఖండంలో పురాణమాహాత్మ్యకథనం అనే అధ్యాయంలో శివరాఘవసంవాదంలో శివుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం ఉంది. ఇందులో శివుడు పురాణశ్రవణమెలా చేయాలి అన్న దానిని వివరిస్తూ, పురాణాన్ని వ్యాఖ్యానించే వ్యక్తిని భక్తిగా ఇంటికి రావించాలనీ, అతడిని సత్కరించాలనీ ఇత్యాది విధివిధానాన్ని చెబుతూ, ముందుగా దేవతలను పూజించాలని చెబుతూ ఈ శ్లోకాన్ని చెప్పాడు. అయితే దీని తరువాత వచ్చిన శ్లోకపంక్తి – సభాసదశ్చ సంపూజ్య గణేశం ప్రార్థయేత్తతః అని. అంటే, తరువాత గణేశుడిని ప్రార్థించవలెను అని దానర్థం. తరువాత పార్థించడమేమిటి? పైన శ్లోకంలో ప్రార్థించాము కదా అని ఒక ప్రశ్న. పై శ్లోకాన్ని ఉపయోగించే శివుడు ప్రార్థించమంటున్నాడు అని ఒక అన్వయం చెప్పవచ్చు. కాదు, పై శ్లోకం విష్ణుపరమని ఆయన ఉద్దేశం, కనుక పైదీ క్రిందదీ వేరూ అని కూడా వాదన చేయవచ్చును. శ్లోకమున్నది కానీ అది విష్ణుపరమా, గణపతి పరమా అన్న అర్థం పద్మపురాణం లో లేదు అని ప్రస్తుతానికి రూఢి చేసుకుందాం.

    స్కాంద పురాణము :

    ________________

    పురాణాలలో అతిపెద్దదైన స్కందపురాణంలో ఐదవదైన అవంతీఖండంలో విష్ణుభక్తి మాహాత్మ్యాన్ని వివరిస్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి మరొకటి –

    లాభస్తేషాం జయస్తేషాం_ అన్నది. ఇది జనార్దనుడి మీద శ్లోకమని అందరికీ తెలిసినదే.

    తరువాత శ్లోకం –

    అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజ్యతే యః సురైరపి, సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః

    అని ఉన్నది. అంటే, దేవతలు సైతం, తమ కోరికలు తీరడానికి ఎవరిని పూజిస్తారో, అటువంటి సర్వవిఘ్నాలనూ హరించేటువంటి గణాధిపతికి నమస్కారము అని. ఇది వినాయకప్రార్థన అనుకుంటే, పైన ప్రారంభశ్లోకం వినాయకుడిదే అని ఎలా అంటారు? కనుక అది విష్ణు

    సంబంధమైనదే అనవచ్చు.

    లేదా, ఏం, రెండుసార్లు వినాయకుడి ప్రార్థన రాకూడదని నియమమున్నదా? రావచ్చు అని కూడా చెప్పవచ్చు. అదే స్కాందపురాణంలో మూడవదైన బ్రహ్మఖండం మొదటి అధ్యాయమైన సేతుమాహాత్మ్యవర్ణనము ఈ శ్లోకంతోనే మొదలవుతోంది.

    విష్ణుసహస్రనామము

    ___________________

    సుప్రసిద్ధమైన విష్ణుసహస్రనామంలో ప్రారంభంలో ఈ శ్లోకం వినవస్తుంది. ఇక్కడ కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థనే అని అంటే, కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థన కాదు, అలా అని విష్ణుమూర్తి ప్రార్థన కూడా కాదూ, వైకుంఠంలో వైష్ణవగణాలకు అధిపతి అయిన విష్వక్సేనుడని ఒకాయనున్నాడూ, ఆయనకూడా ఏనుగుతలను కలిగి, విఘ్నాలను పోగొడతాడూ అంటూ ఇది విష్వకేనస్తుతి అంటూ తృతీయమార్గంలో అన్వయాలు చేసారు. అయితే నేను పరిశీలించిన కొన్ని మహాభారతప్రతులలో, అనుశాసనికపర్వంలో ఎక్కడైతే విష్ణుసహస్రనామం చెప్పబడిందో ఆ చోట ఈ శ్లోకం లేదు. కనుక ఇది వైష్ణవపరమా, వినాయకపరమా అన్నది తెలియదు.

    ఇతరగ్రంథాలు:

    ______________

    మనకు తెలిసినటువంటి నోములూ, వ్రతాలూ, ఇతర పూజావిధివిధానాల వాఙ్మయం ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. దానితో పాటుగా, ఫలదీపిక వంటి జ్యోతిష్యగ్రంథాలూ, అహిర్బుధ్న్యసంహిత, సాత్త్వతసంహిత ఇత్యాది సంహితాగ్రంథాలూ, వందలాదిగా దేవతా స్తోత్రాలూ ఈ శ్లోకాన్ని తమ మొట్టమొదటి శ్లోకాలలో ఒకటిగా పెట్టుకున్నాయి. అయితే, పెద్దల నోళ్లనుండి వినేటపుడు వినాయకుడి అర్థమే ధ్వనిస్తుంది కానీ, విష్ణుమూర్తి అర్థం ధ్వనించదు వీటిల్లో.

    ఇప్పుడు అసలు ఈ శ్లోకానికున్నటువంటి అర్థాన్ని పరిశీలిద్దాం.

    శుక్ల= తెల్లనైనటువంటి,

    అంబర= వస్త్రమును,

    ధరం= ధరించినవాడినీ;

    విష్ణుం= విష్ణువునూ;

    శశి= చంద్రుడితో సమానవైనటువంటి

    చంద్రసంబంధమైనటువంటీ,

    వర్ణం= రంగు కలిగినవాడినీ; చతుర్భుజం= నాలుగు భుజాలతో విరాజిల్లేవాడినీ;

    ప్రసన్న= నిర్మలమైనటువంటి,

    వదనం= ముఖము కలిగినవాడినీ; సర్వ= సమస్తములైన, _

    విఘ్న= ఒక పని చేసేటప్పుడు వచ్చే అడ్డంకుల యొక్క, _

    ఉపశాంతయే= ఉపశాంతి (శాంతించుట) కొరకు; _

    ధ్యాయేత్= ధ్యానము చేయవలెను.

    వినాయకుడి పరంగా అన్వయాలు –

    _________________________

    ఈ శ్లోకం వినాయకుడిది అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదౌ పూజ్యో గణాధిపః అన్న సూక్తిననుసరించి, ఈ శ్లోకం చాలా రచనలలో మొదటగా చేరి ఉండటం. రెండు,సర్వవిఘ్నోపశాంతయే అన్న వాక్యం. ప్రసిద్ధంగా గణపతి విఘ్నాలకు అధిపతి. విఘ్నాలను తొలగించడం కోసం మన పెద్దవాళ్లు గణపతిని చిలవలు పలవలుగా ప్రార్థించారు. ఈ ప్రార్థన విష్ణువును చేసినట్లుగా ఎక్కడా కనపడదు.

    మరి, వినాయకుడికి అన్వయించడానికి ఈ శ్లోకంలో ఉన్న అడ్డాలు ఏమిటంటే

    విష్ణుం అన్న పదం- వినాయకుడిని మనకు తెలిసినదానికి విరుద్ధంగా లకుమికరా (లక్ష్మీప్రదుడా – లక్ష్మీగణపతి మనకు తెలుసును) అనీ, ఆంజనేయావతారం (హనుమంతుడి అవతారమనీ) అన్నట్లు మనకు తెలుసు. కానీ విష్ణువన్న పదం వినాయకుడికి వాడబడటం, అదీ ఇంత సూటిగా అని ఇంకెక్కడా మనము చూడము. అయితే, దీనికి పెద్దలు చెప్పిన వివరణలు – ఒకటి, వినాయకుడూ విష్ణువూ ఒక్కరే అన్న సమన్వయమైన అర్థాన్ని ఈ శ్లోకమిస్తోందని. రెండు, విష్ణువంటే ఇక్కడ విష్ణుమూర్తి అని కాదు, వ్యాపనశీలః విష్ణుః అనే వ్యుత్పత్తిననుసరించి వినాయకుడు సర్వాంతర్యామి అన్న అర్థం ఇందులో ఉందని. ఈ అన్వయం సమంజసమైనదే.

    ఈ విష్ణుం అన్న పదం అడ్డం వచ్చిందని భావిస్తూ మరికొంత మంది ఈ శ్లోకానికి శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం అన్న పాఠాంతరాన్ని పెట్టి, ఏ గొడవా లేదని ఊరుకున్నారు.

    శశివర్ణము – వినాయకుడు ఏ రంగులో ఉంటాడు అంటే, అథర్వణవేదంలోని గణపత్యుపనిషత్తు ఆయన్ను “రక్తం, లంబోదరం, శూర్పకర్ణకం, రక్తవాససం, రక్తగంధానులిప్తాంగం, రక్తపుష్పైస్సుపూజితం”అని వర్ణించింది.

    గణపతి ఎర్రగా ఉంటాడట, ఎరుపు బట్టలే వేసుకుంటాడట, ఎరుపుగంధం పూసుకుంటాడట, ఎర్రని పుష్పాలతో పూజించబడతాడట. మరి ఈ శ్లోకంలో ఆయన్ను తెలుపు బట్టలు ధరించినవాడనీ, తెల్లగా ఉంటాడనీ అన్నారే? అంటే, గణపతికి రూపాలనేకం ఉన్నాయి. తొమ్మిది రూపాలను కొంతమంది చెబితే, కొంతమంది ఇరవై రూపాలను చెప్పారు. కొన్నింటిలో గణపతికి మూడవకన్ను ఉంటే, కొన్నింటిలో చంద్రవంక ఉంటుంది. అంచేత గణపతి తెల్లగా ఉండడనీ, తెలుపు బట్టలు కట్టుకోడనీ చెప్పలేము. కనుక ఇది గణపతికి సాధ్యమయ్యేదే.

    అంతే కాక, మనకు సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు తెలుసు. వాటిలో సత్త్వము జ్ఞానానికి సంకేతం. దానికి వాడే రంగు తెలుపు. అందుచేత, సత్త్వస్వరూపమైనటువంటి వినాయకుడు, జ్ఞానప్రదాత అయి, తెలుపు రంగులో ఉంటాడని విరవణ.

    గణపతి అన్వయాన్ని సమర్థిస్తూ, ప్రసన్నవదనం అనే పదానికి ప్రసన్నో మత్తవారణః అని ఒక వ్యుత్పత్తిని నేను పెద్దవారి వద్ద విన్నాను. అంటే ప్రసన్న వదనుడంటే ఏనుగుముఖం కలవాడు అని. అయితే ఈ వ్యుత్పత్తి ప్రసిద్ధ సంస్కృతనిఘంటువులలో నాకు తారసపడలేదు.

    గణపతి పరంగా ఈ శ్లోకార్థమిది –

    తెల్లని బట్టను ధరించినవాడినీ, సర్వవ్యాపకుడినీ, తెల్లని వర్ణంలో ఉండేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ (అయిన వినాయకుడిని) సమస్తమైన విఘ్నాల ఉపశాంతి కోసం ధ్యానము చేయవలెను.

    విష్ణుమూర్తి పరంగా అన్వయాలు

    ఈ శ్లోకం విష్ణుమూర్తిదే అని చెప్పడానికి ప్రధానబలం విష్ణుం అన్న పదమే. విష్ణువు త్రిమూర్తులలో ఒకడు కదా, ఆయన్ను విఘ్నోపశాంతికై ప్రార్థన చేయకూడదా అని కొంతమంది చేసే వాదం.

    తెలుపు రంగు : బాగానే ఉంది, మరి విష్ణువు నలుపు రంగులో ఉంటాడని కదా ఆయన్ను నీలమేఘశ్యాముడన్నాం. పచ్చనిబట్ట కట్టుకుంటాడని కదా పీతాంబరుడన్నాం. మరి శుక్లాంబరమూ, శశివర్ణమూ ఆయనకెలా అన్వయిస్తారు? అంటే, దానికి వచ్చిన సమాధానం – కృతయుగంలో విష్ణువు తెల్లగానే ఉండేవాడూ అని. దీనికి ఒక ఉదాహరణ – సత్యనారాయణ వ్రతకల్పంలో కథాప్రారంభంలో నారదుడు వైకుంఠానికి వెడతాడు కదా. అక్కడ శేషతల్పంపై పరుండిన విష్ణువుని చూసి ఆయన తెల్లని రంగులో ఉన్నాడని స్తోత్రం చేస్తాడు. అలాగే, పీతాంబరుడని ఆయన్ను అన్నంతమాత్రాన తెలుపుబట్ట కట్టుకోడని ఏముందీ అని ఒకటి.

    విష్ణుపరంగా ఈ శ్లోకానికి చేకూరిన బలం అప్పయదీక్షితులు. ఈయన మహాపండితుడు. శివుడంటే పంచప్రాణాలైనా, శివుడికీ కేశవుడికీ భేదం లేదన్న అద్వైతమార్గావలంబి. ఈయన వరదరాజస్తవమని కంచివరదరాజు మీద ఒక స్తోత్రం వ్రాసాడు. అందులో 27వ శ్లోకంలో ఇలా అన్నాడు –

    యుక్త్యాగమేన చ భవాన్ శశివర్ణ ఏవ

    నిష్కృష్ట సత్త్వ గుణమాత్ర వివర్త మూర్తిః।

    ధత్తే కృపాంబుభరతస్త్విషమైంద్రనీలీం

    శుభ్రోఽపి సాంబురమితః ఖలు దృశ్యతేఽబ్దః॥

    అంటే, విష్ణుమూర్తి తత్త్వపరంగా, యుక్తిగా ఆలోచిస్తే తెలుపువాడేనట. దయ అనే రసాన్ని నిలువెల్లా నింపుకోవడం చేత, నీటిని నింపుకున్న మేఘం యొక్క రంగు – అంటే నీలవర్ణంలోకి మారిపోయాడట.

    ఇంకొక విశేషమేమంటే, ఈ వరదరాజస్తవానికి అప్పయ్యదీక్షితులే వ్యాఖ్యనూ వ్రాసారు. అందులో అంటారు కదా – ఆగమేన, ఆప్తవచనేన చ శశివర్ణమ్. ప్రసిద్ధం హి శివరాఘవసంవాదస్థమ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ఇతి వచనమ్ అని. అంటే, విష్ణువు తెల్లని వాడే. దానికి ప్రమాణంగా పైన మనం చూసిన పద్మపురాణంలోని శివరాఘవసంవాదంలో ఉన్న శుక్లాంబరధరమన్న శ్లోకముంది కదా అని. కనుక, అప్పయదీక్షితుల ప్రకారం శుక్లాంబరధరం అన్న శ్లోకం విష్ణుముర్తిదే కానీ, విష్వక్సేనుడిదో వినాయకుడిదో కాదు.

    మరి విష్ణువు పరంగా ఈ శ్లోకాన్ని చూస్తే – తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నవాడినీ, తెలుపు రంగులో ప్రకాశించేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ, ప్రసన్నమైన వదనం కలవాడినీ (అయినటువంటి విష్ణుమూర్తిని) సమస్తవిఘ్నోపశాంతికోసం ధ్యానం చేయవలెను అని అర్థం చెప్పుకోవాలి.

    ఇతరమైన అన్వయాలు –

    విష్ణువూ, విష్వక్సేనుడూ, గణపతిలతో ఈ శ్లోకం గొడవ అయిపోయిందనుకుంటే పొరపాటే. దీని కథ ఇంకా ఉన్నది.

    1. జైనులు ఈ శ్లోకాన్ని తమ దైవమైన శ్వేతాంబరజినుడికి అన్వయిస్తూ చెప్పుకుంటారని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వ్రాసారు.

    2. దేవతలకైతే ఫరవాలేదు, కొందరు కొంటెగాళ్లు ఈ శ్లోకాన్ని జంతువులకు అన్వయింప చేసారు.

    ఒక పండితుడు ఈ శ్లోకాన్ని తెల్లపిల్లికి అన్వయిస్తూ ఎలా చెప్పాడో చూడండి –

    శుక్లా గౌరీ అంబా యస్య స శుక్లాంబో గణేశః, తం రాతి వాహనీయత్వేనాదత్తే ఇతి శుక్లాంబరో మూషికః, తం భక్షణార్థం ధరతీతి శుక్లాంబరధరో మార్జారః, శశివర్ణః శుభ్రః, చతుర్భుజత్వం తు స్పష్టమేవ, భక్ష్యాలాభేన ప్రసన్నవదనోఽపీతి గౌరమార్జారధ్యానమ్.

    అంటే, గౌరవర్ణంలో ఉన్న స్త్రీని తల్లిగా కలవాడు శుక్లాంబుడు – గణేశుడన్నమాట. ఆయన్ని రాతి అంటే వాహనంగా మోసేది – ఎలుక. శుక్లాంబరధర అంటే ఎలుకట. ఆ ఎలుకని తినడం కోసం ధరించేది శుక్లాంబరధరము అంటే పిల్లి. అది తెల్లనిది, ఆహారం దొరకడం చేత ప్రసన్నవదనం కలది, నాలుగు భుజాలు కలదీ అయినటువంటి తెల్లపిల్లిని విఘ్ననివారణ కోసం ధ్యానించవలెనూ అని.

    3. ఇంకొకడు దీనిని గాడిద పరంగా అన్వయించాడు. అదీ చూద్దాం. శుక్లాంబరధర :అంటే తెల్లని బట్టల మూటను ధరించేదీ; ఎక్కడపడితే అక్కడ తిరిగేది కనుక విష్ణువు అయినదీ; పసుపూ, గౌరవర్ణమూ కలిసిన తెలుపు రంగులో ఉండేదీ; నాలుగు భుజాలు కలదీ; అసలు బుద్ధి లేని పశువు కావడం చేత ఏ చింతా దానికి ఉండదు కనుక ఎప్పుడూ ప్రసన్నంగానే ఉండేదీ అయిన గాడిదను విఘ్నోపశాంతి కోసం ధ్యానించవలెను అని.

    ఇటువంటి చమత్కారాలకేం గానీ, ఈ శ్లోకం ఇంతకీ ఎవరిది అని భక్తులను అనుకోమంటారు అంటే –

    1. తర్కాలూ, పాండితీప్రదర్శనలూ, దైవశ్లోకాన్ని జంతువులకు అన్వయించి చెప్పే చమత్కారాలూ చూసి బావుందనుకోడానికే కానీ, దైవభక్తిని అవి ఏనాటికీ అతిశయించలేవు. భక్తి అన్నిటికన్నా గొప్పది.

    2. ఈ దేశంలో దేవతల రూపాలు వేరు కానీ సమన్వయిస్తే అందరూ ఒకటే. అందుచేతనే ఇన్నిన్ని వ్యాఖ్యానాలను సాధ్యపరిచారు. పుష్పదంతుడని ఒక మహాకవి శివభక్తుడు. ఆయన శివుడి మీద “శివమహిమ్నస్తోత్ర” అని వ్రాస్తే ఒక పండితుడు దానికి విష్ణుపరంగా వ్యాఖ్యానం చెప్పాడు. ఇందాకా మనం చూసిన అప్పయ్య దీక్షితులు సైతం “నారాయణ” అన్న పదానికి శివుడి పరంగా వ్యాఖ్య చేద్దామని ప్రయత్నించి, అందులో “ణ”కారం అడ్డు తగులుతోంటే, ణత్వం బాధతే అన్నాడట. రూపధ్యానంలో తేడా ఉంది, కానీ తత్త్వ ధ్యానంగా పరతత్త్వమొక్కటే. అదే అసలు హైందవమతస్వరూపం.

    3. అదలా ఉంచితే, ఈ శ్లోకం అర్థాన్ని సంప్రదాయబద్ధంగా రూఢి చేసుకుని, ఇతర దేవతార్థాలనూ గౌరవించడం సరైన పద్ధతి. నేను శాంకరస్మార్తసంప్రదాయానికి చెందినవాడిని. మా పెద్దలు దీన్ని వినాయకుడి అర్థం లోనే చెబుతారు. నేనూ అదే నమ్ముతాను. ఆ శ్లోకం చదివేటప్పుడు ఆ రూపాన్నే ధ్యానిస్తాను. చెప్పవలసినపుడూ అలానే చెబుతాను. అలా అని, విష్ణువుకు ఉన్న అన్వయాన్ని తోసిపుచ్చను. గౌరవిస్తాను, ఆనందిస్తాను కూడా. దీన్ని విష్ణువు పరంగానో, విష్వక్సేనుడి పరంగానో నమ్మేవారు ఆ రకంగా భావన చేయడం, గణపతి అర్థాన్ని సమాంతరంగా గౌరవించడం సరైన పద్ధతి, నా దృష్టిలో.

    ఈ ఇబ్బంది ఈ శ్లోకానికే అనుకోలేము. విష్ణువన్న పదానికి రాముడని, రాముడన్న పదానికి విష్ణువనీ, దశరథుడంటే విష్ణుమూర్తి అనీ అర్థాలు సరైన మార్గంలోనే సాధించవచ్చు. ఆ సాధించడం భాషలోని పరిధిని విస్తరించే గుణానికి సంబంధించిందే కానీ, అందులో పడి అసలు భావనను పాడుచేయడం కోసం ఉన్నది కాదు. భావన చేయలేనపుడు సాహిత్యానికి విలువ లేదు.

    – పరిమి శ్రీరామనాథ్

    Ramanath Parimi Shuklambaradharam
    Previous Articleరూ.650 కోట్ల విలువైన ఫైటర్ జెట్ మిస్సింగ్.. దయచేసి జాడ చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి
    Next Article ఇంకొంచం అలానే నవ్వుతూ వుండు..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.