ప్రముఖ నాట్యవధాని రచయిత కీ.శే. ధారా రామనాథ శాస్త్రి
ధారా రామనాథ శాస్త్రి గారు సంప్రదాయక వైదిక కుటుంబంలో 1932 జూన్ 11 న ఒంగోలు లో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించారు . ఈయన తాత ధారా వెంకటసుబ్బయ్య,తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే నాటకాలు,బుర్రకథలు చూసి ప్రభావితుడయ్యారు. చీరాల తెనాలిలో ప్రాథమిక విద్యా పూర్తి చేశారు. 1947-49 మధ్యకాలంలో గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. తరువాత బి.ఏ. చదివారు. మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఏ. పూర్తిచేశారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కె.వి.ఆర్.నరసింహం పర్యవేక్షణలో ‘తెలుగులో కృష్ణకథ’ అనే అంశం మీద పరిశోధించి పి.హెచ్.డి సాధించారు.
1953లోవొంగోలు లోని సి.ఎస్.ఆర్.శర్మ కాలేజీలో అధ్యాపకుడిగా చేరి 1995 జూన్ నెల వరకు పనిచేశారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఎందరో శిష్యులను తయారు చేశారు. వీరి భార్య పేరు సావిత్రి. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
నాట్యావధానము అనే నూతన ప్రక్రియను ఈయన ప్రారంభించారు. పృచ్ఛకులు సాంఘిక చారిత్మిక, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలలో ఏదైనా ఒక సన్నివేశం చెబితే అప్పటికప్పుడు పది నిమిషాలలో ఆ సన్నివేశానికి తగిన ఆహార్యంతో పాత్రోచితంగా నటించడం ఈ అవధానంలో భాగం. అంటే నాట్యావధాని నటుడు, రచయిత, దర్శకుడు, మేకప్‌మేన్ ఈ నలుగురి పని ఒక్కడే చేయగలగాలి. నటన, సాహిత్య సంపద, ఆశుధోరణి తోపాటు ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయగలగాలి. ఈ నాట్యావధానాన్ని మొదట 1953లో ఒంగోలులో ప్రారంభించి సుమారు 500కు పైగా ప్రదర్శనలిచ్చి ఎందరో ప్రముఖులను మెప్పించగలిగారు. ఈయన నాట్యావధానాన్ని ప్రశంసించిన వారిలో పుట్టపర్తి సత్యసాయిబాబా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి,పండిట్ రవిశంకర్, ఏ.ఎస్.రామన్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, పృధ్వీరాజ్ కపూర్ , భారత రాష్ట్రపతి వి.వి.గిరి,ఎన్.టీ. రామారావు వంటి అనేకులు ఉన్నారు.
వీరు కేవలం నాట్యావధానంతోనే సరిపెట్టకుండా రచనలు కూడా చేశారు. వీరి రచనలు:
విశ్వవీణ (నృత్యనాటిక),అస్పృశ్యులు (నృత్యనాటిక),రత్నగర్భ (నృత్యనాటిక),కోటిదీపాలు (నృత్యనాటిక),తపోభంగం (నృత్యనాటిక),ముక్తసస్య,కృష్ణలహరి,రామలహరి (రెండు భాగాలు),కాహళి,పద్మకోశము,వరివస్య,స్మృతిపీఠం,తెలుగులో కృష్ణకథ,భారత కథాలహరి,ఉదయభాను (బాలసాహిత్యం, కథలసంపుటి),పృథ్వీపతి(నాటకం),ధర్మత్రివేణి(నాటకం),
మహాదాత(నాటకం),కంచుగోడలు(నాటకం),నారాయణం (నాటకం),రామగుప్త (నాటకం),సంభవామి యుగేయుగే (నాటకం),కృష్ణ(నవల),కృష్ణమాచార్యకృపానందలహరి,
నాట్యావధాన స్మృతిపీఠం,నాట్యావధానం లక్ష్య-లక్షణ సమన్వయం,యోగవాసిష్ట కథాలహరి,రసలోకంలో తూర్పుపడమరలు,నాట్యప్రగతి
వీరందుకున్న పురస్కారాలు:
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం,బళ్ళారి రాఘవ అవార్డు,అనంత లక్ష్మీకాంత సాహితీపురస్కారం,రామరాజభూషణ సాహిత్యపరిషత్ పురస్కారం,పల్లె పూర్ణప్రజ్ఞాచార్యుల సాహితీ పురస్కారం,పెద్దిబొట్ల బ్రహ్మయ్య స్మారక సాహితీ పురస్కారం,అ.జో.వి.భో. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం,విజయవాడలో కనకాభిషేకం,సనాతన ధర్మ ట్రస్ట్ వారి ప్రతిభాపురస్కారం
*నాట్యావధాన కళాస్రష్ట, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ ధారా రామనాధ శాస్త్రి (85) శనివారంఆగస్టు 2016 స్థానిక మామిడిపాలెం తన స్వగృహంలో కన్నుమూశారు.
1993 లో ప్రతిష్టాత్మక 'త్రివేణి ' ఆంగ్ల త్రైమాసిక పత్రిక జూలై -సెప్టెంబర్ సంచికలో కవి సుధామ 'అగ్నిసుధ ' కవితాసంపుటి పై డా.ధారా రామనాథ శాస్త్రి గారి సమీక్ష ఇది .