Telugu Global
Arts & Literature

ఎవరివో ! నీవెవరివో !!

ఎవరివో ! నీవెవరివో !!
X

ఎవరివో చెలీ!

నీవెవరో చెలీ !

తొలి వేకువ ఘడియలలో

కులుకు వెలుగురేఖవో !

లే -- అరుణ మయూఖవో !

నవ వసంత సీమలో

నడయాడే రాగినివో !

నాగస్వరం విని తలూచు

నవ్య దివ్య నాగినివో !

మధ్యందిన తపన బాపు

మర్రినీడ చలువవో !

పిపాసుల తృష్ణ బాపు

పీయూష మరందమువో !

నీలి జలద పంక్తి కురియు

తొలకరి చిరుజల్లువో !

గలగలమని సాగిపోవు

నిర్మల సెలయేటివో !

శక్తి శుద్ధ గర్భ జనిత--

మైన ఆణిముత్యమువో !

ఇంద్రధనువులోన నీవు

సాంద్ర సప్తవర్ణినివో !

శరత్కాల మేఘమాల

లోన చంద్రబింబమువో !

బెదురు హరిణి నేత్ర యుగళ -

మందు కదులు చంచలవో !

హిమ కణముల చిలకరించు

చల్లని హేమంతమువో !

రమణీయాకృతిగ వెలయు

ప్రకృతి సీమంతినివో !

ఎవరివో చెలీ !

నీవెవరివో చెలీ ! !

"రసస్రవంతి"-కావ్యసుధ

(విశ్రాంత, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)

First Published:  19 May 2023 6:57 PM IST
Next Story