Telugu Global
Arts & Literature

మహిళలూ మేల్కొనండి! (వ్యాసం)

మహిళలూ మేల్కొనండి! (వ్యాసం)
X

మొన్న మొన్నటిదాక ఎంతోమంది స్త్రీలు, అనుమానించే భర్తల ఆధిపత్యం కింద ఉంటూ నానా అగచాట్లుపడుతూ ఎన్నో చిత్రహింసలకు కూడ గురవుతూ వచ్చే వాళ్ళు. మరికొంతమంది భర్తల చేతిలో హత్య కావింపబడడం లేదా నరకం చూపిస్తున్న భర్తనుండి తప్పించుకునే వేరే దారి కానరాక తామే ఆత్మహత్య చేసుకోవడం చూసాం. కానీ ఈమధ్యకాలంలో ఈ రోల్స్ రివర్స్ అయినట్లు అగుపడుతోంది. ఈ విషయం ఈ మధ్య టీవీలలోనూ, వార్తాపత్రికలలోనూ వస్తున్న వార్తలనుబట్టి మనకు తెలుస్తోంది.

అసలు కొందరు మహిళలు ఈ మధ్య వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాక ఇంకొక్క అడుగు ముందుకు వేసి తమ ప్రియుడితో కలిసి తాళి కట్టిన భర్తనే హతమార్చడంలో పడ్డారు .ఇదిఇంతవరకూ మనం కనీ వినీ ఎరుగని విషయం!

ఈ విధంగా భర్తలను, ఒక ప్రణాళిక ప్రకారం ప్రియుడితో కలిసి పైలోకాలకు పంపించడం వింటుంటే ఒళ్ళు జలదరించకమానదు.

మన మహిళలు, ఇంతగా దిగజారిపోయి, స్త్రీ జాతికే మచ్చ తెచ్చే విధంగా, ప్రవర్తించడం చూస్తుంటే మనం ఎటు పయనిస్తున్నాము అని ఆశ్చర్య పోక తప్పదు.

మొన్నటిదాకా ఇదే కారణంచేత పురుషులపై దుమ్మెత్తి పోసిన మన మహిళాలోకంలోనే కొంతమంది స్త్రీలు ఈ విధంగా నేడు వివాహేతర సంబంధాలు పెట్టుకుని, స్వంత భర్తనే దారుణంగా హత్య చేస్తుంటే సభ్యసమాజం ఎక్కడ తల పెట్టుకోవాలో తెలీని పరిస్థితి.

అంతేకాదు !మన భారతీయ సాంప్రదాయానికి ఇదొక గొడ్డలి పెట్టు!!!

అసలు స్త్రీలు ఇటువంటి దుశ్చర్యలకు, పాల్పడే ముందు ఒక్కసారి తమ కన్న పిల్లలను, అనాథలుగా చేస్తున్నామే అని ఆలోచిస్తే ఇటువంటి ఘోరమైన పనికి పూనుకుంటారా అన్న ప్రశ్న ఉదయించక మానదు.

వీటన్నిటికీ కారణం ఏంటీ అని సైకియాట్రిస్ట్ లను గానీ సైకాలజిస్ట్ లను గానీప్రశ్నిస్తేఏమంటున్నారో చూద్దాం……

ఒక కుటుంబంలో భార్యా భర్తా, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. భర్త తన ఆఫీసులోగానీ లేక వ్యాపారంలోగానీ ఎక్కువ సమయంకేటాయించడం జరుగుతుంది. ఆ ఒత్తిడి కారణంగా అతను తరుచూ ఇంట్లోవాళ్ళ మీద చిరాకు పడడం, భార్యను ఏదో ఒకటి అనడం వగైరా జరుగుతూంటాయి. పెళ్ళైన క్రొత్తలో ఉన్నటువంటి రొమాంటిక్ మూడ్ లో భర్త ఉండడు. అదే అతని కొంప ముంచుతుంది.కానీ నాణానికి మరో వైపు చూస్తే, ఉదయంనుంచీ ఇంటిపనీ, వంటపనీ, పిల్లలను చూసుకోవడం వగైరా నూట తొంభై వ్యవహారాలలో మునిగి తేలుతూ, ఉక్కిరిబిక్కిరి అయి ఉన్న భార్య, కనీసం రాత్రయినా , భర్త చల్లని మాట, చల్లని చూపునూ, ఆదరణనూ, ఓ తీయని మధురానుభూతినీ ఆశించడంఅసహజమేమీ కాదు. అందుకు సెక్సే అక్కరలేదు. ఒక ప్రేమతో కూడిన సాన్నిహిత్యం,కౌగిలింత ఇవే ప్రతీ వివాహతా భర్తనుంచి ఆశించేవి.

ఇదంతా, తమ వర్క్ ప్రెషర్లో గమనించలేని భర్త ఉదాసీనంగా ఉంటాడు. అంతే కాదు మరునాడు కార్యక్రమంకోసం తనను తాను ప్రిపేర్ చేసుకోవడంలో మునిగిన భర్తను చూసి ఎంతో అసంతృప్తి కి గురవుతుంది భార్య.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇద్దరిమధ్యా అనుబంధం బీటలు వారుతుంది.ఇక్కడే పురుషుడు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది.

వారమంతా ఎంత ఒత్తిడిలో గడిపినా వారాంతంలోనైనా భార్యను, పిల్లలనూ ఏ సినిమాకో, ఏ షికారుకో తీసుకెళ్ళడం లాంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు భార్యలో, భర్త తననూ ,పిల్లలనూ నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే భావనే తలెత్తదు. ఒక తెలివైన మగవాడు చేసే పని అది. కానీ అందరి భర్తలకీ అటువంటి ఆలోచన ఉండదు. కారణం వారు పెరిగిన వాతావరణం,తల్లితండ్రులు, సమాజం కావచ్చు.

భర్త కనుక పైన చెప్పిన విధంగా నడుచుకోని పక్షంలో భార్య తనకి దొరకని ప్రేమనూ, థ్లిల్లు నూ వేరే విధానాల ద్వారా పొందటానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసమే, అంటే స్త్రీల ఈ బలహీనతనే క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్న కొంతమంది పురుషుల వలలో ఈ స్త్రీలు పడడం జరుగుతుంది.

ఉదాహరణకు, ఈ సదరు పురుష పుంగవులు హస్కీ గానూ, తీయగా మార్దవం తొణికిసలాడే గొంతుతోనూమాట్లాడుతారు. అంతేకాదు ఎప్పుడూ ఆమెనూ ఆమె అందాన్నీ పొగడడంతో ఆ మాటలకు ఎప్పుడూ భర్త కూడ తన అందాన్ని పొగడడం ఎరుగని ఆ ఎదుటి స్త్రీ వెంటనే ఆ మాటలకు కరిగిపోవడం జరుగుతుంది. ఇంకా భర్తకి ఏదో అవసరం వచ్చి ఫోను చేస్తే "బిజీగా ఉన్నాను, ఫోను పెట్టేయ్ "అని విసుక్కునే భర్తకూ అదే "ఎలా ఉన్నావు బంగారం "అంటూ ప్రేమగా పలుకరించే అతనికీ ఉన్న తేడాను గ్రహించలేనంత అమాయకురాలు కాదు ఏ స్త్రీ అయినా! అలా రెండు మూడు సార్ల పరిచయానంతరం ఆమె అతని సన్నిథిని కోరుకోనారంభిస్తుంది. అలా అలా ఆ రిలేషన్ షిప్ ముందుకు సాగి సాగి సదరు భర్తనుంచి ఆమె దూరం అవడం జరుగుతుంది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతీ భార్యా తమ భర్తయొక్క ప్రేమపూరితమైన స్పర్శ ని కోరుకుంటుంది.

ఇటువంటి విషయాలలో పాశ్చాత్య పురుషులు భారతీయపురుషులకన్నా ఎంతో ముందుంటారు. అడుగడుక్కీ, ఐ లవ్ యూ, డార్లింగ్, స్వీట్ హార్ట్ లాంటి మాటలతోనూ హగ్గులతోనూ తమ ప్రేమను సున్నితంగా వ్యక్తపరుస్తారు. మన దేశంలో ఇవన్నీ నిషిద్దం! మన దేశపు మగవాళ్ళు సిగ్గు పడతారు. మొహమాటం కూడ కొంచెం ఎక్కువే మన వాళ్ళకు.అందుకే మన దేశపు భార్యలే ఒక్క అడుగు ముందుకు వేసి తమ భావాలనూ, కోరికలనూ నిస్సంకోచంగా భర్తతో చర్చించాలి. ప్రేమతోనే భర్తను జయించాలి. అయినా ఫలితంలేకపోతే ఇతర కుటుంబ సభ్యులతో భర్తకు చెప్పించి అతనిలో మార్పు తేవటానికి శాయశక్తులా ప్రయత్నించాలి.

తను వేసే ఒక్క తప్పటడుగు మూలంగా పిల్లలు కూడ భవిష్యత్తులో తల్లిలాగానే ప్రవర్తించి తమ ఫ్యూచర్ను కూడా నాశనం చేసుకునే అవకాశం ఉంది కావున భార్య ఎంతో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక తాము వివాహేతర సంబంధాల దిశగా పయనిస్తున్నామని అనిపించినా కూడా తనను తాను కంట్రోల్ చేసుకొంటూ భర్తతో ఈ విషయాన్నికూలంకుషంగా, ఒకరితో ఒకరు చర్చించుకున్నాక కూడ ఏమీ ఫలించక పోతే అప్పుడు విడిపోవడమే ఉత్తమం అని నా అభిప్రాయం.

మన రాజ్యాంగం, విడిపోవడాన్ని చట్టబద్దం చేసి దశాబ్దాలవుతోంది. అయినా మన స్త్రీలు వాటినిఉపయోగించుకోకపోతే ఎవరిది తప్పు???అందుకే మహిళలూ, క్షణికానందంకోసం కుటుంబ సభ్యుల భవిష్యత్తును పణంగా పెట్టకండి. అందువల్ల సాధించేదేమీ ఉండదని గ్రహించండి!!!

- మాధవపెద్ది ఉష

First Published:  13 March 2023 1:32 PM IST
Next Story