Telugu Global
Arts & Literature

తోడు(కథ)

తోడు(కథ)
X

‘’మేము నువ్వు రమ్మన్నా రామురా...మాకు ఇక్కడే బాగుంది.’’నేనుజగన్నాధం గారింటి వాకిట్లో అడుగు పెట్టేసరికి వినిపించిన మాటలు ఇవి.నాకు ఇంటిలోకి వెళ్ళాలో వద్దో తెలియలేదు,వెళ్ళడం భావ్యం కాదని వెను తిరిగాను.ఇంతలో తులసమ్మ గారు చూసినట్టున్నారు.

‘’వెళ్లిపోతున్నావే౦ జానకిరామ్.లోపలి రా,’’అన్నారు.

‘’బాబాయ్ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కద౦డి.డిస్ట్రబ్ చేయడం ఎందుకని.’’

‘’పర్వాలేదు మా అబ్బాయితోనేలే,,,నీకు తెలియనిదేముంది.లోపలికి రా.’’

నేను కాస్త మొహమాటంగానే లోపలి వెళ్ల్లాను.నేను వాళ్ళ కోసం తెచ్చిన మందులు అక్కడ టీపాయ్ మీద పెట్టాను.జగన్నాధం గారి మొహం సీరియస్ గా వుంది.’’అదిగో అలా వు౦డవద్దు అని చెప్పానా.జానకి రామ్ వచ్చాడుపలకరి౦చండి.’’అంది తులసమ్మగారు.

‘’ఆ,,ఆ ,,జానకిరామ్ వచ్చావా.?’’

‘’ఆ మొన్న మీరు తెమ్మన్న మందులు తెచ్చాను.’’

‘’ఆ..మళ్ళీ ఫోన్ వచ్చింది,దానితో కాస్త డిస్ట్రబెన్స్.’’అన్నారు.

‘’మిమ్మల్ని ఒక విధంగా నేనే ఇలాచేసానేమోఅనిపిస్తుంది.పోనీ...’’

‘’అలా ఎందుకు అనుకు౦టావు జానకిరామ్.నువ్వు చెప్పింది మాకు నచ్చింది,’’

నాకు ఆఫీస్ టైమైంది.నేను వాళ్ళకు చెప్పి బయలుదేరాను.ఇద్దరి మొహాల్లోగాంభీర్యం చోటు చేసుకుంది.కారు డ్రైవ్ చేసుకుంటూ ఆ వీధి లోకి వచ్చాను,దాదాపు ఏడాది క్రితం జరిగిన విషయ౦ గుర్తుకొచ్చింది.

***

‘’పేపరు ఏది?ఏవస్తువు పెట్టిన చోట వుండదుకదా.’’కాస్త విసుగ్గానే అంది తులసమ్మగారు.

‘’ఇక్కడఈ టీపాయ్ మీదే పెట్టాను.’’

‘’ఇక్కడే వుంటే అంత పెద్ద పేపరు కనపడదా.’’

‘’ఏమో నీ చత్వారం కళ్ళకి కనిపించడం లేదేమో.’’

‘’అబ్బో మీ కళ్ళు పదేళ్లపిల్లల కళ్ళు మరి.’’వాళ్ళు అలాగా అధికారపక్ష,ప్రతిపక్షాల్లగా

వాది౦చుకు౦టూనేవున్నారు.

ఇంతలో"బామ్మగారు మీ పేపర్ మా కా౦పౌ౦డులోపడిపోయింది.’’

అంటూ వచ్చాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి.కోప౦గా చూసింది తులసమ్మ గారు భర్తవైపు,దో౦గ కు తేలుకుట్టినట్టుచూసారు,జగన్నాధ౦గారు.

అదీవిషయ౦.పొద్దున్నేపక్కి౦టాయన జగన్నాధ౦గారుపేపరు తిరగేయడం చూసి రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టారు.ఆయన తో మాట్లాడిరెండిళ్ళమధ్య వున్న గోడమీద పేపరు పెట్టి మర్చిపోయారు.తులసమ్మ గారికిభర్త చేసిన పిచ్చి పని కి కోపం వచ్చింది. కానీ వాదించే ఓపీక లేక కాస్త దుమ్ము పడిన పేపరు దులుపుకుని చదవసాగింది,

‘’ఇదిగోవంటఅయిపోయిందా?.’’ఆవిడను మంచి చేసుకోవడానికి అన్నట్టు అడిగారాయన.

‘’వంటకాకుండా పేపరు చూస్తానా?ఇన్ని రోజులైనా నా అలవాట్లు అర్ధం కావడంలేదా.’’మళ్ళీ రంగం లోకి దిగింది ఆవిడ.తప్పుతనదికాబట్టి జగన్నాధం గారికి ఏ౦జవాబు చెప్పాలోతెలియలేదు.ఆయననురక్షి౦చడానికన్నట్టు నేను వాళ్ళఇంట్లో ప్రవేశి౦చాను.’’రా..రా..జానకిరామ్ నీ గురించే అనుకు౦టున్నాము.

నీకునూరేళ్లుఆయుశ్షు.’’ఆన్నారు,జగన్నాధం గారు.

‘’అబ్బాఈనలభైకే బోర్ గావుంద౦డి.మిగతాఅరవైఎందుకులెండి.’’అన్నాను నవ్వుతూ.

‘’ఎందుకా,,ఈయన లాటివాళ్ళతో వాదించడానికి.’’కోపంగా అన్నారావిడ.నేనునవ్వేసాను.జరిగి౦దంతా చెప్పారావిడా.తీసినవస్తువు తీసినచోట పెట్టె అలవాటు లేని నేను ఏమని చెప్పను.

‘’నా మీద నేరారోపణ చేయడమేనా అతనికి అన్నo పెట్టేదు౦దా.’’

అన్నారాయన.

‘’మీ పనులతో మతిమరపు,

పరధ్యానం కూడా వస్తోంది.’’ఆవిడ కుర్చీ లో౦చి లేచారు.

‘’అయ్యోవద్దమ్మా,మొన్న మీరు తెమ్మన్న సరుకులు ఇద్దామని వచ్చాను.మొన్ననే ఇవ్వాలి తేవడం మర్చిపోయాను."

‘’సరిపోయింది ఈ విడలాగే నీకు మతిమరుపు ఉ౦దన్నమాట.’’

‘’ఆ..మీరుచేసే పనులతో ఏమైనా వచ్చేట్టు వుంది.అందుకే పేపరు గోడమీద వదిలేసారు.’’

‘’మా కోడలు ఊరిను౦ఛి వచ్చిందా?’’అడిగారావిడ.

‘’లేదండి వేసవిసెలవులు కదా.తీరికగావస్తుంది’’ అన్నాను.

‘’మరి భోజనం చేయడానికి ఏమిటి అభ్య౦తర౦.’’అడిగారాయన.

‘’నేను వంట చేసుకు వచ్చాను రాత్రికి తి౦దామన్నా శనివారం.’’అన్నాను

ఇంతలో వంటఇ౦ట్లో౦చి బుస్ మన్న చప్పుడు విని నేను కిచెన్ లోకి చూసి పాలు పొ౦గి పోతూ౦టే స్టవ్ ఆపేసాను,

‘’అబ్బా పొద్దున్నే స్టవ్ కడిగాను,మళ్ళీ ఇప్పుడు కడగాలి.’’

‘’నేను స్టవ్ కడుగుతాను,’’అన్నాను.

‘’పరవాలేదులే,వంట అయిపోయిందిగా మెల్లిగా కడుగుతాను.’’

‘’ఇప్పుడు మతిమరపు ఎవరిదీ,?’’అన్నారు జగన్నాధం గారు.ఆవిడజవాబు చెప్పకు౦డా తల తిప్పుకున్నారు.

‘’దానిదేము౦డి లెండి మతిమరపు మానవసహజం..’’అన్నాను బయలుదేరుతూ.

జగన్నాధం గారు మా నాన్నగారికి స్నేహితులు.ఇద్దరూ రెవిన్యూ డిపార్టుమెంట్ లో పనిచేసారు,ఇప్పుడు నాన్నగారు లేకపోయినా వీరితో నా బంధం కొనసాగుతోంది.వాళ్ళ ఇల్లు మా ఇ౦టికి అయిదారు వీధుల అవతల.జగన్నాధం గారి కొడుకు కూతురు ఇద్దరూ అమెరికా లో వుంటారు.ఇక్కడవుండేదివీరిద్దరే.

వృద్ధాప్యం వలన ఓపీక వుండదు.అందుకే ప్రతి చిన్న పనికి వాదించుకు౦టారు.ఇద్దరినీ చూస్తూ౦తే ‘’మిధున౦’’ గుర్తుకొస్తుంది.

****

ఆఫీస్ ను౦డి ఇ౦టికి వస్తు౦టే తులసమ్మ గరిదగ్గరను౦డి ఫోన్.

కారు ఆపి ఫోన్ తీశాను.’’జానకి రామ్ నన్ను వృద్దాశ్రం లో చేరుస్తావా.’’

‘’అంత మాట అన్నారేమిటమ్మా,’’

‘’మీ బాబాయ్ గారితో పడలేను జానకి రామ్.రోజురోజుకి చాదస్తం ఎక్కువై పోతోంది.’’

‘’వృద్ధాప్యం కదండీ.’’

‘’ఆమాట నాకు వర్తి౦చదా చెప్పు.ఆయనకుడెబ్భైఅయిదు ,

అయితే నాకు అరవైఎనిమిది.అయినా ఏదో చేసి పెడుతున్నాను.అది బాగా లేదు ఇది బాగాలేదు అనివ౦కలు.నావల్ల కాదయ్యా.’’ఈ ఆఖరి మాట కు ఆవిడ గొ౦తు లోదుఃఖ౦ వినిపి౦చింది.నువ్వు ఈ మధ్య మా ఇ౦టికి రాలేదు,ఎందుకు రాలేదో నన్ను ఫోన్ చేసి అడగమ౦టారు.ఆయన్నే ఫోన్ చేయమంటే కోపం.అయినా ఇద్దరే మే ఇంట్లో వుండి వుండీ బోర్ గా వుంది.’’

‘’పిల్లలకు స్కూల్ తెరిచారు కద౦డీ బుక్స్,బాగ్స్ ఇలా ఏవో కొనడం వీటితో సరిపోయింది.పోనీ మీరిద్దరూతీర్ధయాత్రలు చేస్తే.’’అన్నాను.

‘’ఈ వయసులో అవన్నీ తిరగలేము జానకిరామ్.వేళకు తినాలి,మందులు వేసుకోవాలి.ఏదైనా అనారోగ్యం చేస్తే మాకు ఎవరు చేస్తారు.

అందుకేవృద్ధాశ్రమ౦లో చేర్చు’’

‘’మరి మా బాబాయ్ గారిని ఎవరు చూస్తారు.’’నవ్వుతూ అన్నాను.

‘’మళ్ళీ అదేమాట "

’నేను నవ్వేసాను."నా దృష్తి లో మీరిద్దరూవేరువేరు కాదమ్మాఅభేధ౦గా వుండే అర్ధనారీశ్వరులు.’’అన్నాను

‘’మాటలు నేర్చావు.మీ బాబాయ్ గారు పక్కి౦టాయనతోమాటలు

అపేసినట్టున్నారు కాఫీ ఇవ్వాలి.’’అని ఫోన్ పెట్టేసారు.

‘’ఈ విడా వృద్దాశ్రమం లో చేరేది ఆయన్ని వదిలి పెట్టి.

*****

‘’వాళ్ళు ఇద్దరినీ ఒల్దేజి హోం లో చేర్పిద్డామ౦టావా.’’అడిగాను ప్రతిమను.

‘’ఆవిడేదో కోప౦ లో అన్నారనిమీరు వాళ్ళ పిల్ల లతో సంప్రది౦చకు౦డా ఆ పని మాత్ర౦ చేయకండి.ఆ మాట కోస్తే మీరు పిల్ల లు ఆఫీస్ కి,స్కూల్ కి వెళ్ళిపోయాక నాకు ఏమీ తోచదు.నేను ఏ ఆశ్రమ౦ లో చేరాలి.’’అంది ప్రతిమ.

ఆమె తరుచు ఇంట్లో నాకేమీ

కాలక్షే పమ్ లేదు అనడం చాలా సార్లు విన్నాను.ఆమె మా పిల్ల ల చిన్నప్పుడే వాళ్ళను చూసుకోవాలని వుద్యోగం మానేసింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లుఅయ్యారు .తోచడం లేదు,అ౦టు౦ది.

***

నాకు వృద్ధాశ్రమం అంటే నేను వెళ్ళే దారిలో వున్నా అనాధాశ్రమ౦గుర్తుకు వచ్చింది.వాళ్ళు నిజంగా ఎవరూ బంధువులు లేనివారు,ఈ ముసలి ద౦పతులు కు అందరూ వుండి అనాథలుగా వున్నారు.ఒక్కోసారి

ఆ పిల్లలను ఎవరో కొట్టడం వాళ్ళు హృదయవిదారక౦గా ఏడవడం రోడ్డు మీదకే వినిపిస్తుంది. ఈ వుండీ,లేని అనాథల౦దారినీ కలిపితే......

ఒక సెలవు రోజు కుటు౦బ సమేతంగా తులసమ్మ గారి ఇ౦టికి వెళ్లాను.

వాళ్ళు మమ్మల్ని చూసి చాలాసంతోషి౦చారు.ప్రతిమ సహయ౦తో వంట చేసారు.’’నేను చెప్పిన పని ఏ౦ చేసావు జానకిరామ్.’’అన్నారు ఆవిడ.

ఆవిడఆశ్రమ౦ లో చేరే విషయం ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు.నా మొహం చూసి’’ఆయనకు తెలుసు’’ అన్నారావిడ.

‘’చూడు జానకిరామ్ విదేశాల్లో ఉండలేక ఆరునెలల్లో పారిపోయి వచ్చింది.ఈవిడ ఓల్దేజి హోం లో ఎలా ఉ౦టు౦దిచెప్పు’’ అన్నారాయన.

‘’మీకు లాగ మా మనవలు,కొడుకు, కోడలు,కూతురు, అల్లుడు మా కళ్ళ ము౦దు వుంటే ఎంత బాగుండేది..’’అన్నారు తులసమ్మ గారు.

‘’నిజమే,అప్పుడు అమెరికాలో చదవడం,వుద్యోగం గొప్ప అనుకున్నాము.ఇప్పుడు వాళ్ళకి ఆ జీవితం అలవాటు అయిపోయి ఇక్కడకి రాలేకపోతున్నారు.

"నేనేమీ మాట్లాడలేదు.ఎందుకంటే అప్పట్లో ఈ ఇద్దరూ పిల్లలు

విదేశాల లో ఉండటమే గొప్ప అనుకున్నారు.ఇప్పుడు బాధ పడిఏంలాభం.కానీ వాళ్ళను అలా వదిలేస్తే ఏ డిప్రెషన్ లో కో పోయే ప్రమాదం వుంది.’’పోనీమమ్మల్ని పెంచుకొండి.’’అన్నాను నవ్వుతూ.

‘’అంతక౦టేనా.మీరు వెళ్లిపోతార౦టే బె౦గగా వుంది.’’అన్నారు తులసమ్మగారు.

‘’మా నలుగురిని కాదు పిన్నిగారు నలభైమందిని పెంచుకోవచ్చు,మీకు ఇష్టమైతే.’’

‘’నలభైమందా ఎవరు వాళ్ళు.’’

‘’అనాథ శరణాలయం పిల్లలు.వాళ్ళకి సరియైనా తిండి లేదు.మన౦ వారానికొకసారైనా వాళ్ళకి మంచి తిండి పెట్టగలిగితేమీకు మంచి కాలక్షెప౦ వాళ్ళకి మంచి తిండి ,మీకు ప్రతిమ సహాయం చేస్తుంది.’’

‘’అవును పిన్నిగారు నేను కలక్షెపమ్ లేదని విసుగు పడుతున్నాను.మన ఇద్దరం కలిసి చేయవచ్చు.’’

‘’నిజ౦గా చాలా మంచి ఆలోచన జానకిరామ్.నేను మార్కెట్ కు వెళ్లి కూరలు అవీ తెస్తాను ,ఖాళీగా వుంటే మీ పిన్నిగారి తో గొడవ.’’అన్నారు జగన్నాధంగారు.

హమ్మయ్యా ఒక సమస్య పరిష్కారం అయింది.

ఒకరోజు అనాధశరణాలయం వున్న రోడ్ లోంచి వస్తు౦టే నా కారు కి అడ్డంగా పరిగెత్తుకొచ్చిన కుర్రాడు కళ్ళ ము౦దు కనపడ్డాడు.వాడు చేసిన దొ౦గతనం ఇంతా చేసి కాస్త పెరుగు.

తులసమ్మ గారి దగ్గర కొచ్చేముందే మిల్క్ షాప్ లో నెలకి సరిపడా పాలకి డబ్బు కట్టి వచ్చాను.

- ఈరంకి ప్రమీలారాణి

First Published:  1 Feb 2023 4:50 PM IST
Next Story