సౌందర్య వేదాంతం
నీ మౌనం ఒక పురాతన భాష
సమస్త భాషల సమగ్ర నిఘంటువు
నీ వదనంలో అరుణానికి
అర్థం తెలీని ప్రపంచం ఉంటుందా?
నీ కంటి కాటుక ప్రవహించే ఆజ్ఞల్ని
శిరసాపాటించనిహృదయముందా?
ఇప్పుడు చెప్పు నీ నవ్వుకు
ఎన్ని రహస్య అర్థాలున్నాయో?
నీవు ఒళ్ళు విరుచుకున్నప్పటి అందం చైనా భాష కి
అర్థం కానిదా
ఇటాలియన్ తీపి
అనువదించు కోలేనిదా
భాషలు నదులేం కర్మ
హంసలు నెమళ్ళు అర్థం చేసుకుంటాయి
నీ నడకలోని పదలయని
అందాల తకధిమి తాళవర్తనాల్ని,
నీకున్న అవయవాల బింకాలో
లేని నడుములో ఒదిగిన పొంకాలో
నీ అందానికి ప్లస్ లూ మైనస్ లూ కాదు
అందానికి అర్థం తెలిసిన వాడు
మాత్రమే చెప్పగలిగిన నిజం.
అందం అంటే చిరునవ్వుల పరిమళమని
అందం అంటే స్పర్శల
రసవద్గీత అని
అదే కదా కాంక్షకి ప్రేమకి
మధ్య కనిపించని గీత
అర్థాలు అలంకారాల కూడిన
నీ అందం
అంతెందుకు నీ ఆత్మకు అద్దం
నీ అందం ఇంత
దేదీప్య మాన సౌందర్యం
పురుష చతుర్థాలకి మలి గమ్యమా
ఆ పౌరుషేయాలకి ఆది సూత్రమా
అమ్మ లాంటి అందం లోంచి
ఎప్పుడూ ఎవరూ పారిపోలేరు.
- ఈతకోట సుబ్బారావు