కమల్ కరాటే మానేశాడు
కమల్ హైదరాబాదులో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి కరాటే నేర్చుకున్నాడు! ఈ మధ్యనే అందులో రెండు బెల్ట్ లు కూడా సాధించాడు!
అయితే అతడి శ్రీమతి మంజులకి ఇలా కరాటే శిక్షణ కోసం డబ్బు తగలబెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు.
"ఎందుకండీ... ఆ కరాటే నేర్చుకుని మీరు చేసేదేముం ది?... పెంకులు పగలగొట్టడమే కదా!" అంటూ వాళ్ళ ఆయన్ని నిత్యం సాధిస్తూనే ఉంటుంది!
"మంజులా! కరాటే విలువ నీకు తెలీదు! ఎవరైనా మన మీదకి దెబ్బలాట వచ్చినప్పుడు ఒక్క దెబ్బతో వాళ్ళని మట్టి కరిపించవచ్చు!! ఆత్మ రక్షణ కి కరాటే ని మించిన ఆయుధం లేదు." అంటూ భార్యకు కరాటే విలువ గురించి ఎప్పటికప్పుడు నొక్కి వక్కాణిస్తూనే ఉంటాడు కమల్.
రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కరాటే వ్యవహారం మంజుల జీర్ణించుకోలేకపోతోంది! ఎందుకంటే ఈ శిక్షణకు వెళ్ళటం ప్రారంభించాక అతడు ఇంట్లో ఉండటం, తనతో గడపటం తగ్గిపోయింది! అయితే ఆఫీసు! లేకపోతే కరాటే స్కూలు!! ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి నాలుగు మెతుకులు తినేసి మంచం ఎక్కేసి నిద్రపోతున్నాడు!
తనతో ఓ సరదా లేదు, ఓ సరసం లేదు! దాంపత్య జీవితానికి కూడా రాను రానుదూరంగా జరిగి పోతున్నాడు !'పెళ్ళాం సుఖానికి పనికిరాని ఆ చేతులు, పెంకులు పగలగొట్టడానికా?'అంటూ ఒకటి రెండు సార్లు అతనితో మంచం మీద దెబ్బలాటకి కూడా దిగింది! అయినా ఫలితం లేకపోయింది! ఈ కరాటే వచ్చాక తనకి ఆ సుఖం తగ్గిపోయిందని మంజులకు చాలా అక్కసుగా ఉంది!
ఇదిలా ఉండగా విజయవాడలో తమ కజిన్ పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. మంజులని తీసుకుని కార్ లో ఉదయాన్నే బయలుదేరాడుకమల్. హైదరాబాదు పొలిమేరలు దాటిపోయిన తర్వాత విజయవాడ రోడ్డులో తొంభై కిలోమీటర్ల స్పీడ్ తో కారు తొక్కుతున్నాడు. వెనక నుండి ఎవరో అదేపనిగా హారన్ కొడుతూ, కమల్ ని వెర్రెక్కిస్తున్నారు!
తన కారును ఓవర్ టెక్ చేసి ముందుకు వెళ్ళి కారుకు కారు అడ్డంగా పెట్టడం, మళ్లీ అంతలోనే స్లో చేసి పక్కకు వెళ్లి పోయి దారి ఇవ్వడం; ఇలా అల్లరి పెడుతున్నట్టు అర్థమైంది కమల్ కి!
కమల్ కోపం నషాళానికి ఎక్కింది! తన కారు అద్దం కిందకు దింపి అవతల డ్రైవర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ప్రారంభించాడు .అవతల వాడు కూడా ఇతడిని ఓవర్టేక్ చేస్తూ తన బుర్ర పైకి పెట్టి "ఆపరా! కారుపు!! నీ అంతు చూస్తాను!!" అంటూ అరిచి, ఎడమకు కోసి కారు ఆపేడు.
"వాడితో గొడవ ఎందుకండీ?" అంటూ వారించ బోయింది మంజుల.
"నీకు తెలీదు మంజులా... ఇలాంటి వాడిని వదలకూడదు. వీడికి నా కరాటే దెబ్బ చూపిస్తాను !" అంటూ కారు ఎడమకు తీసి ఆపేశాడు.
అవతలి వాడు కారు దిగి తమ వంకే రాసాగాడు! కమల్ అతడిని పరికించి చూశాడు! మనిషి తనలాగే బందోబస్తు గా ఉన్నాడు! ఎంత బందోబస్తుగా ఉన్నా ఒకే ఒక్క కరాటే దెబ్బతో సరి!!
"ఎందుకండీ గొడవ?.. కారు పోనివ్వండి." అంది మంజుల భయంగా భర్త వంక చూస్తూ.
" నా కరాటే విద్య పెంకులు బద్దలు కొట్టడానికే కానీ ఇంకెందకూ పనికి రాదని ఎగతాళి చేశావు కదా... ఇప్పుడు చూడు! ...."అన్నాడు భార్యతో.
అవతల వాడు దగ్గరికి రావడంతో, కారు తలుపు తెరిచి కిందకి ఒక్క ఉదుటున దిగబోయాడు.
కానీ సీటులో నుండి లేవటం సాధ్యం కాలేదు! ఎడం చేత్తో పక్కన ఉన్న క్లిప్ ని పీకాడు కానీ, అది ఊడి రాలేదు!
అప్పటికే అవతల వాడు కుడి చేతి పిడికిలిని బిగించి బలంగా కమల్ మూతిమీద కొట్టిన దెబ్బకు, ముందు పళ్ళు రెండు ఊడి కింద పడిపోయాయి!! రక్తం చివ్వున చిమ్మింది!
"నన్నే ఎదిరిస్తావా రాస్కెల్! నేను ఎవరిననుకుంటున్నావు ...ఆల్ ఇండియా రెస్లింగ్ ఛాంపియన్ ని!.." అని గట్టిగా అరుస్తూ తిరిగి కారెక్కి వెళ్ళిపోయాడు వాడు.
ఇదంతా కొద్ది సెకండ్లలో జరిగిపోయింది!
భర్త నోట్లోంచి రెండు పళ్ళు జారిపడి పోవడంతో పాటు రక్తం కారడంతో మంజుల బెంబేలెత్తి పోయింది!
తన చేతిలోని కర్చీఫ్ అతను మూతికి అడ్డంగా కొద్ది సేపు నొక్కి ఉంచింది.
"తీతు బెల్తు తిక్కుకు పోయింది" అన్నాడు కమల్ నత్తి నత్తిగా, ఖాళీ అయిపోయిన పళ్ళ మధ్య నుండి గాలి వదులుతూ!అతని సీటు బెల్టు ఊడి రాలేదని మంజుల కి అర్థమైంది!
ఆ తర్వాత కమల్ కరాటే మానేశాడు!!
- ద్విభాష్యం రాజేశ్వరరావు