Telugu Global
Arts & Literature

మీకు ఇది తగునా..?

మీకు ఇది తగునా..?
X

సాయంత్రం ఆరు గంటల సమయం.రమేష్ సోపాలో కూర్చొని సెల్ చూస్తున్నాడు.ఇంతలో బయటనుండి భార్గవి కూరగాయలు తీసుకొని వచ్చింది.

" ఆఫీసు నుండి రాగానే సెల్ పట్టుకుని కూర్చున్నారా ? " రావడంతోనే అంది భార్గవి.

" వాట్సాప్ లో ఒక ముఖ్యమైన ఫైల్ చూస్తున్నాను.మా బాస్ పంపించాడు " తల ఎత్తకుండానే బదులిచ్చాడు రమేష్.

" అవునవునులే,బాగా చెబుతున్నారు " వ్యంగంగా అంటూ కిచెన్ లోనికి వెళ్ళింది భార్గవి.

స్కూల్ నుండి సోని,రజిని లు స్కూల్ ,టిఫిన్ బ్యాగ్ లతో ఇంట్లోకి వచ్చారు.రజిని బ్యాగ్ తెరిచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసి రమేష్ దగ్గరికి సంతోషంగా వచ్చి

" డాడీ, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి." అంది.

రమేష్ చూడకుండానే "అక్కడ పెట్టు " అన్నాడు.

రజిని మరింత సంతోషంతో "చూడండి డాడీ " అంది.

" చెప్పేది నీకు కాదా ..? "

రమేష్ కోపగించుకోగానే, రజిని మొహం లో అప్పటివరకున్న ఆనందము ఒక్కసారిగా పోయింది. మారు మాట్లాడకుండా రజిని బాధతో సోపా ముందున్న టీపాయ్ పై ప్రోగ్రెస్ కార్డు పెట్టి కిచెన్ లోకి వెళ్ళింది.

ఇదంతా కిచెన్ లో నుండి గమనిస్తున్నభార్గవి రమేష్ దగ్గరకు వచ్చి

"అమ్మాయి ఎంత బాధపడిందో చూసారా ? కార్డు చూడవచ్చు కదా ! " అని అంది.

రమేష్ మాట్లాడలేదు.భార్గవి విసురుగా కిచెన్ లోనికి వెళ్ళింది. పెద్ద అమ్మాయి సోని రమేష్ దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని డాడీ అని పిలిచింది.

"చెప్పమ్మా ? " అని ప్రేమగా అన్నాడు రమేష్.

" చెల్లెలంటే మీ కెందుకంత కోపం.దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడొచ్చు కదా డాడీ " అంది.

రమేష్ సెల్ పక్కన పెట్టి సోని వైపు చూసి

" అది కాదు బంగారం.నీకర్థం కాదులే? సరే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు."

సోని బ్యాగ్ తెరిచి రిపోర్ట్ రమేష్ కు ఇచ్చింది.రమేష్ రిపోర్ట్ చూసి సోని భుజాన్ని తట్టి గర్వంగా చూసాడు.

"వెరీ గుడ్ మై చైల్డ్ .9.3 జీపీఏ వచ్చింది." అన్నాడు.

" థ్యాంక్స్ డాడీ " సోని నవ్వుతూ అంది.

సోని స్టడీరూమ్ లోకి వెళ్ళింది.భార్గవి టీ తెచ్చి రమేష్ కి ఇచ్చింది.పక్కన సోపాలో కూర్చుని

" మీ పద్ధతి ఏమి బాగా లేదండి.మీరు రజిని విషయంలో చాలా తప్పు చేస్తున్నారు." మెల్లగా అంది

రమేష్ అహం దెబ్బతింది.ఒక్కసారిగా కోపంతో

"నీకు ఏమి తెలియదు ,ఊరుకో " గట్టిగా అన్నాడు.

" అది కాదండి, ఇద్దరు మన పిల్లలే కదా! ఒక్కరిని ప్రేమగా చూసి,మరొకరిని అయిష్టంగా చూస్తే ఆ పసి మనసు తట్టుకుంటుందా చెప్పండి." భార్గవి సర్ది చెబుతున్నట్లుగా మాట్లాడింది.

" సోని ఈ ఇంటి మహాలక్ష్మి. ఆ బంగారు తల్లి పుట్టిన తర్వాతే నాకు బాగా కలిసి వచ్చింది.ప్రమోషన్ వచ్చింది.ఈ ఇల్లు కట్టాము " టీ త్రాగుతూ అన్నాడు రమేష్.

" ఆపండి, రజిని చేసిన తప్పు ఏంటి ?" నిలదీసింది భార్గవి.

" నీకు తెలియదా ? " అన్నాడు రమేష్.

భార్గవి రమేష్ వైపు అసహ్యంగా చూసింది.

" ఇదేనా మీ పెద్దరికం. మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని అనుకోలేదు." బాధగా అంది

"ఇక్కడి నుండి వెళ్ళు "కోపంగా గద్దించాడు రమేష్.

" నేను వెళ్ళను.మీ మనసు మారేదాకా వెళ్ళను కాక వెళ్ళను " వాదనకు దిగింది భార్గవి.

రమేష్ లేచి నిలబడి

"అయితే, నేనే వెళ్తాను." అంటూ బెడ్ రూమ్ లోకి కోపంగా వెళ్ళాడు.

రజిని కిచెన్ రూమ్ నుండి భార్గవి దగ్గరకు వచ్చి నిలబడింది.భార్గవి ఆగకుండా వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంది.

" ఏమైందమ్మా,ఏడుస్తున్నావ్ " అడిగింది రజిని

" ఏమి లేదమ్మా " బాధ ను దిగమింగుకుని నవ్వుతూ అంది భార్గవి.

"నాకు తెలుసమ్మా,డాడీ నిన్ను తిట్టాడు."

" అది కాదు రజినీ "

రజిని సోపాలో భార్గవి పక్కన కూర్చుని ఏడ్చింది.

"అమ్మా, డాడీ కి నేనంటే ఎందుకు ఇష్టం లేదు.అక్కను మంచిగా చూస్తాడు.నన్నేమో ఎప్పుడు ద్వేషంగానే చూస్తాడు.నేను ఏమి తప్పు చేసానమ్మా ? " ఏడుస్తూనే ఉంది రజిని.

నువ్వు పుట్టడమే తప్పమ్మా మనసులో అనుకుని

భార్గవి రజినిని దగ్గరకు తీసుకుంది.భార్గవి మౌనాన్ని రజిని మళ్లీ ప్రశ్నించింది. ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక భార్గవి కొద్దిసేపు మాట్లాడలేదు.ఆలోచనలో పడింది.

" మాట్లాడవమ్మా "

భార్గవి రజిని గదవ పట్టుకుని బుజ్జగిస్తూ మొదలెట్టింది.

"బంగారు తల్లి , పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా, డాడీ కి మీ ఇద్దరూ ఇష్టమే ,అక్క ను చదివించిన్నట్లుగానే నిన్ను చదివిస్తున్నాడు.అక్కకు ఏమి కావాలో నీకు అలాగే కొనిస్తున్నాడు కదా! ఆయనకు నీపై చాలా ప్రేమ ఉంది.పైకి కనిపించదు.అంతే "

"అబద్ధం చెబుతున్నావు.అక్కతో ఎంతో ప్రేమగా మాట్లాడుతాడు.నేను ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడడు. " చిన్నబుచ్చుకుంది రజిని.

ఎలా సముదాయించాలో భార్గవికి తోచలేదు. రజిని ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. సోని స్టడీ రూమ్ నుండి హాలు లోక్ రాగానే భార్గవి టాపిక్ మార్చింది.

"రామ్మా, సోని ఇలా కూర్చో "అంది.

సోని సోపాలో భార్గవి పక్కన కూర్చుంది.

"ఈరోజు స్కూల్ లో ఏమి జరిగిందో చెప్పమ్మా " అడిగింది.

"అమ్మా, ఈరోజు స్కూల్లో పెద్ద మీటింగ్ జరిగింది……."

" భార్గవి..ఇలా రా " లోపలి నుండి రమేష్ పిలుపు విని

" డాడీపిలుస్తున్నారు.మళ్ళీ వస్తాను.వచ్చాక చెబుదువు కానీ " అనుకుంటూ భార్గవి లోపలికి వెళ్ళింది. రమేష్ వైట్ షర్ట్ కనిపించడం లేదంటే భార్గవి డ్రెస్సింగ్ రూమ్ లో వెతికి ఇచ్చింది.

"రజిని, ఎందుకెడుస్తున్నావు? " చెల్లెలి కన్నీళ్లను చూసి అడిగింది సోని

"నేనా,ఎందుకెడుస్తాను? ఏడవడం లేదు.."

" సరేలే ,అమ్మ నేను రాగానే టాపిక్ మార్చింది.ఏమి మాట్లాడుకున్నారే మీరు "మళ్లీ అడిగింది సోని

రజిని ఏడ్చింది.

"అక్కా,డాడీ కి నేను ఎందుకు నచ్చడం లేదు.నేనేమి తప్పు చేసానో అర్థం కావడంలేదు." అడిగింది రజిని

"నాకు తెలిసింది చెబుతాను. మరేమో ఎవరికి చెప్పవద్దు. " మెల్లగా అంది సోని.

"ఎవరికి చెప్పనులే ! " ఏడ్పు అపి అంది రజిని.

"ఒట్టు " చేయి చాపింది సోని

రజిని సోని చేతిలో చేయి వేసింది.

"డాడి కి నువ్వు కొడుకుగా పుడతావని కలలు కన్నాడట.నేను పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాడట.రెండోసారి కొడుకు పుట్టాలని ఎందరో దేవుళ్ళ కి మొక్కుకున్నాడట.నువ్వు పుట్టేసరికి ఆయన ఆశలు ఆవిరై నీ మీద ద్వేషం పెంచుకున్నాడట.ఒకసారి మమ్మీ డాడీ తో ఈ విషయమై గొడవపడింది.అప్పుడు నాకు తెలిసింది." భయపడుతూనే అటు ఇటు చూస్తూ చెప్పింది రజిని.

"ఇందులో నా తప్పు ఏముందక్కా? "అమాయకంగా అడిగింది రజిని.

"బాధపడకు చెల్లి,ఎదో ఒక రోజు డాడీ నీ విలువ తెలుసుకుంటాడులే. " ఓదార్చింది సోని

"ఆ రోజు వస్తుందా అక్కా.." ఆశగా అంది రజిని.

కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది.

" ఎవరొచ్చారో చూడండి. " కిచెన్ నుండే చెప్పింది భార్గవి.

సోని వెళ్ళి తలుపు తెరిచింది.ఎదురుగా స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణ మూర్తి.

"గుడ్ ఈవినింగ్ సర్ " రెండు చేతులు జోడించి అంది. కృష్ణ మూర్తి ఇంట్లోకి వచ్చాడు.రజిని నిలబడి నమస్కారం చేసింది.

"కూర్చోండి సర్ " కుర్చీ చూపించింది రజిని.

"థాంక్యూ " అంటూ కృష్ణ మూర్తి కూర్చున్నాడు.

లోపలి నుండి రమేష్ వచ్చి నమస్కారం చేసి,సోపాలో కూర్చున్నాడు.భార్గవి నీళ్ల గ్లాస్ తెచ్చి ఇచ్చింది.

" కంగ్రాచ్యులేషన్ రమేష్ గారు " ఆనందంగా చెప్పాడు కృష్ణ మూర్తి.

"దేనికి సర్ .." ఆశ్చర్యంగా అడిగాడు రమేష

"ఏమ్మా ,మీరు చెప్పలేదా ? " కృష్ణ మూర్తి పిల్లల వైపు చూస్తూ అన్నాడు.

" ఏమి జరిగింది సర్ " భార్గవి అడిగింది.

"ఇంత పెద్ద విషయం ఇలా సింపుల్ గా చెబుతున్నానని ఏమి అనుకోవద్దండి " అన్నాడు కృష్ణ మూర్తి.

రమేష్ భార్గవి వైపు చూసాడు. భార్గవి అంతే ఆశ్చర్యంగా చూసింది.వారికి ఏమి అర్థం కావడం లేదు.

"మీ అమ్మాయి మా స్కూల్ లో చదవడం మాకు గర్వముగా ఉంది సర్.మీరు ఎంతటి అదృష్టవంతులండి.అసలు విషయానికి వస్తాను. మా స్కూల్ లో చదివి అమెరికా లో స్థిరపడిన ఒక ఎన్నారై "బెస్ట్ స్థూడెంట్ అవార్డు "ఏర్పాటు చేసి స్కూల్ లో ఒకరిని ఎంపిక చేయమని మాకు చెప్పారు.మేము ఒక కమిటీని నియమించాము.విద్యా సంబంధిత అన్ని అంశాలలో ప్రతిభా సామర్థ్యములు పరిగణనలోకి తీసుకున్న కమిటి ,చదువులో,ఆటల్లో,సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ గల ఎనిమిదో తరగతి చఫువుచున్న మీ అమ్మాయి రజిని ని ఎంపిక చేసాము……" హెడ్ మాస్టర్ మాటలు పూర్తికాకముందే

"నిజమా సర్ ? " ఆతృతగా అడిగాడు రమేష్.

" అవును డాడీ, ఈరోజు మీటింగ్ లో చెల్లె ను అందరు మెచ్చుకున్నారు." అంది సోని.

రమేష్,భార్గవి హెడ్ మాస్టర్ వైపు తదేకంగా చూస్తున్నారు.

" అవార్డు క్రింద లక్ష రూపాయల నగదు, పదవతరగతి వరకు ఉచిత విద్య,పుస్తకాలు, ఫీజులు ఇస్తారు.ఇంకా గొప్ప విషయం ఏమిటంటే.. వారం రోజుల పాటు మీ కుటుంబ సభ్యులందరు దేశంలో మీకు నచ్చిన యాత్రా స్థలానికి వెళ్ళి రావడానికి ఫ్లయిట్ చార్జీలు, హోటల్ బిల్లులు అన్ని వారే సమకూర్చుతారు.మరో ముఖ్యమైన విషయం ఆ ఎన్నారై గారు వచ్చే వారం ఇక్కడకు వస్తున్నారు.మీ దంపతులు ఇద్దరికి మా స్కూల్ లో సత్కారం ఉంటుంది.మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించడానికి వచ్చాను."

" చాలా సంతోషంగా ఉంది సర్." రమేష్ ఉబ్బితబ్బయ్యాడు.

భార్గవి కిచెన్ లోనికి వెళ్లి టీ తెచ్చి హెడ్ మాస్టర్ కు,రమేష్ కు ఇచ్చింది.

" మీ శ్రమ వృథా కాలేదమ్మా, రజినిని చాలా సార్లు అడిగాను.నీ ప్రతిభా పాటవాలకు కారకులు ఎవరని… " హెడ్ మాస్టర్ కృష్ణ మూర్తి టీ త్రాగుతూ అన్నాడు.

" ఎవరని చెప్పింది సర్ ? " రమేష్ అనుమానంగా అడిగాడు.

"మీరే నని చెప్పింది." హెడ్ మాస్టర్ చెప్పగానే రమేష్ సిగ్గుతో తలదించుకున్నాడు.

"అవును సర్, మీ అమ్మాయి మీరు తల ఎత్తుకునే విజయాన్ని సాధించింది. మీరు గర్వంగా తల ఎత్తుకోండి సర్."

రమేష్ మాట్లాడలేదు.హెడ్ మాస్టర్ భార్గవి వైపు చూస్తూ

"ప్రతి ఇంటికి నీలాంటి తల్లి చాలా అవసరం. పిల్లలు ఆత్మ విశ్వాసం కోల్పోయిన ప్రతి సారి తల్లులు ధైర్యాన్నిచ్చి ,వారిని అత్యంత శక్తివంతులుగా మారుస్తారు. " అంటూ హెడ్ మాస్టర్ కృష్ణ మూర్తి లేచాడు.

భార్గవి హెడ్ మాస్టర్ కు చేతులు జోడించి నమస్కారం చేసింది.హెడ్ మాస్టర్ సంతోషంగా వెళ్ళాడు. భార్గవి రమేష్ దగ్గరకు వచ్చి

"ఇప్పటికైనా చూసారా ' అంది.

రమేష్ భార్గవి నోరు మూసి

"సచ్చిన పాముని ఇంకా చంపకు. నేనెంత తప్పు చేసానో నాకిప్పుడు అర్థమయింది.జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసాను. చిట్టితల్లి మనసును గాయపరిచాను." అన్నాడు

రమేష్ రజిని ని దగ్గరకు తీసుకొని

"ఈ డాడీ ని క్షమిస్తావా ?" పశ్చాత్తాప పడుతూ అడిగాడు.

"ఐ లవ్ యు డాడీ " అంది రజిని

"ఇక మనింట్లో ఎటువంటి బాధలుండవు.డాడీ మారిపోయారు మమ్మీ. " అంది సోని.

రమేష్ టీ పాయ్ మీదున్న రజిని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని చూసాడు.

"ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. అవార్డు వచ్చినందుకు కాదండి. మీకు రజిని నచ్చినందుకండి. ఈరోజు కోసం ఎంతో ఎదురుచూసానండి. " భార్గవి కళ్ళ నుండి నీరు ఆగడం లేదు.

"అవును డాడీ, మీ ప్రేమ పొందడమే నాకు పెద్ద అవార్డు " ఆనందంగా అంది రజిని.

"అవునమ్మా, పిచ్చి నమ్మకాల భ్రమలో మునిగి అవివేకుడిలా ఇంతకాలం ప్రవర్తించాను.మీ అమ్మ ఈ విషయమై నాతో చాలా సార్లు గొడవపడింది.ఎక్కడా నీకు నాపై ద్వేషం కలగకుండా ప్రయత్నించింది. భార్గవి నాకు భార్య గా లభించడమే గొప్ప అవార్డు."

చిన్న పిల్లాడిలా రోధిస్తున్నాడు రమేష్

నువ్వన్న మాటలు నిజమయ్యాయనే భావనతో అక్క వైపు కృతజ్ఞతగా చూసింది రజిని.

రమేష్ కన్నీళ్ళలో బూజు పట్టిన మూఢ నమ్మకాలు కరిగిపోయాయి.భార్గవి ఆనంద బాష్పాలలో ఆ ఇంటి కంటి పాపల ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది.

- దుర్గం బైతి

First Published:  18 Oct 2023 6:12 PM IST
Next Story