కవిత్వం రాస్తే
BY Telugu Global4 May 2023 1:30 PM IST
X
Telugu Global Updated On: 4 May 2023 1:30 PM IST
కవిత్వం చదివితే అమ్మ కాళ్లకు మొక్కినట్టుండాలి లేదా
ఎవరెస్టు ఎత్తు కన్నా ఎత్తుకు ఎక్కినట్టయినా ఉండాలని
ఓ కవిగారన్నా సరే...
నాకైతే కవిత్వం రాస్తే
తప్పు చేసినప్పుడు అమ్మ
చెంప దెబ్బ కొట్టి
బుద్ధి చెబుతున్నట్టు
ఉండాలనిపిస్తుంది
నమ్మి గుండెల్లో చోటిస్తే వారి
గుండె గుడులపై తన్ని పోయే వారి గోళ్లలో గుండు సూదులు
గుచ్చుతున్నట్టు ఉండాలనిపిస్తుంది
న్యాయాన్ని నయ వంచన
చేసి నరమేధం సృష్టించే వారి
కుత్తుకను నెత్తురు రాకుండా
కత్తులతో కోస్తున్నట్టు
ఉండాలనిపిస్తుంది
పాపాలు చేసే పాపిష్టి మనస్సులను పరితాపంతో పొగిలి పొగిలి ఏడ్పించేలా
అంతర్మధనంలో అడిగే ప్రశ్న ప్రశ్నకూ పశ్చాత్తాపంతో
శాప విముక్తి కలగుతున్నట్టు
ఉండాలనిపిస్తుంది
నర నరాల్లో కుతంత్రాలతో
నిండిన కుళ్లు రక్తాన్ని తీసేసి
ఎర్రెర్రని నీతి రక్తంతో
డయాలసిస్ చేస్తున్నట్టు
ఉండాలనిపిస్తుంది.
-దుద్దుoపూడి అనసూయ
Next Story