చిన్నప్పుడు......చిత్రం!

రథసప్తమి ఉదయాన్నే
రేడియోలో రజనీ గొంతు..
భక్తిభరితపుఒదుగుతో
"శ్రీసూర్యనారాయణా!!"...
ఒకసూర్యుడు
అన్ని పువ్వులరంగుల్లో..
భలే బావుండేది!!
జిల్లేడాకులు తలపై,
భుజాలపై పెట్టి
రేగుపళ్ళు పడకుండా నిలిపి కాలువనీటిలో మూడుసార్లు మునగటం..భలే బాగుండేది!!
చిక్కుడుకాయలరథాన్ని
ఏడు గుర్రాలుగా సిద్ధపరచి,
ఎర్రచందనగంధం బొట్టుపెట్టినఅలంకరణ!!
ప్రత్యక్షదైవానికి చేసే
ఒకే ఒకపూజ రథసప్తమి!!
ప్రతి మాఘపాదివారం సూర్యారాధనే!!
గొబ్బిపిడకలపై కాయగా
పొంగిన ఆవుపాలు..
ఆనందంగా హర!హరా!-అంటూ అందరిపేరూ చెప్పి
వేసే కడిగిన బియ్యం!
తరిగిన బెల్లం,నెయ్యి వేసి
వండే ఆ పరమాన్నం
పిల్లలందిరికీ నోరూరే మాధుర్యం!!
చిక్కుడాకుల్లో సూరీడుకీ,తులసికీ,అగ్నికీ నివేదనలవటమే ఆలస్యం!!
ఆ రుచి కోసం
పంపకాలలో తగవులు
తీర్చటం అమ్మకే సరి!!
ఆఖరుగా ఆరోగ్యమిమ్మని
ఆదిత్య హృదయం-ఆలపించటం!!
ఇదంతా చిన్నప్పటి చిత్రం!!
ఇపుడో..కాలువస్నానాలా?
చిక్కుడాకులా?
ఇంకా నయం జిల్లేడాకులా?
నిజమైన చిత్రం మాత్రం
ఎప్పటికీ
రోజూ ఉదయించే
సూర్యుడే!!!
-డా.వేమూరి.సత్యవతి