వంట జీవన కళ (కథ)
"పోస్ట్ " అన్న తపాలు బంట్రోతు కేక కి బయటికి వచ్చింది సరళ. తనకి వచ్చిన రిజిస్టర్డ్ కవరుని సంతకం చేసి తీసుకుని, అతనికి ధన్యవాదాలు చెప్పింది సరళ.
లోపలికి వచ్చి, కూర్చుని తీరికగా కవరులోని, కాగితాన్ని తీసి చదవసాగింది. అది ఒక ప్రసిద్ధమైన సంస్థలో ఆమెను కాంటీన్ చీఫ్ గా నియమిస్తున్నట్లు వచ్చిన అప్పాయింట్మెంట్ ఆర్డర్. దాన్ని పూర్తిగా చదివింది. తనకు ఆర్ధిక స్వాతంత్య్రం వచ్చినందుకు ఆమెకు చాలా సంతోషం కలిగింది. ఆ ఆర్డర్ ని పూజగదికి వెళ్లి దేవుని పటాల ముందు పెట్టి, నమస్కరించింది.
ఇంతలో బయటికి వెళ్లిన తలిదండ్రులు, తమ్ముళ్లు వచ్చారు. అందరితోనూ తన సంతోషాన్ని పంచుకుంది.
సరళ ఉద్యోగంలో చేరింది. క్రమంగా తన పనితనంతో యాజమాన్యాన్ని, ఉద్యోగులను మెప్పించింది. అప్పుడప్పుడూ రకరకాల వంటల గురించి ఆకాశవాణిలో, కొన్ని సంస్థలలో కూడా ప్రసంగాలని ఇచ్చేది.
సరళ ఆ ఉద్యోగంలో చేరి, రెండేళ్లయ్యాయి. తలిదండ్రులు సరళకి పెళ్లి ప్రయత్నాలు చేయసా గారు. వచ్చిన సంబంధాలన్నీ సరళ వంటపని చేస్తోందని తెలిసాక , కారణం చెప్పకుండానే తప్పిపోసాగాయి.
అలా వచ్చిన సంబంధాలలో రమేశ్ తలిదండ్రులకి సరళ నచ్చింది రమేశ్, సరళ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ ఒక్క షరతు పెట్టారు రమేశ్ తలిదండ్రులు అది సరళ చేస్తున్న ఉద్యోగం మానాలి. కారణం ఆ పని వారికి తలవొంపులని చెప్పింది రమేశ్ తల్లి.
ఆ సమాధానం విన్న సరళ తలిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలపడానికి వారం రోజుల వ్యవధిని కోరారు.రెండు రోజుల తరువాత ఆకాశవాణిలో పాకశాస్త్రం గురించి సరళ ప్రసంగాన్ని బ్రాడ్ కాస్ట్ చేశారు.
ఆమె ప్రసంగాన్ని ఇలా ప్రారంభించింది
"వంట పని ఒక అద్భుతమైన కళ. అసలు యే పని రాకపోయినా, అందరికీ వంట చేయడం తెలియాలి. అప్పుడే ఎక్కడున్నా బయటి తిండి తిని ఆరోగ్యం చెడుపుకునే అగత్యం ఉండదు.
వంటింటి పని అంటే కేవలం ఉడకేయడం కాదు.మనం ఉపయోగించే బియ్యం, పప్పు దినుసులు, చింతపండు నూనెల కొనుగోలు నుండి నిలువ చేసే విషయాలను తెలుసుకోవాలి. అవి పురుగులు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరుకులను కావలసినంత కొని పెట్టుకోవాలి. అవి పట్టేంత డబ్బాలు కూడా ఉంచుకోవాలి.
కాయగూరలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి.అవి ఎంత కాలం తాజాగా ఉంటాయన్నది తెలుసుకోవాలి. చెడిపోయినవాటిని, పుచ్చులను ఎప్పటికప్పుడు ఏరెస్తూ ఉండాలి. వంటింటి చిట్కాలను తెలుసుకుంటూ, వస్తువులు వృథా కాకుండా చూసుకోవాలి
ఎప్పుడూ ఒకే రకమైన వంటలు కాకుండా, రకరకాలైన వంటలు చేయాలి. అంటే ఎప్పుడూ కొత్తదనం ఉండేట్లు చూసుకోవాలన్నమాట. కొత్త వంటకాలని నేర్చుకోవాలి.
తినేవారి అభిరుచులను బట్టి ఇష్టానిష్టాలు, తినే సామర్థ్యం తెలిసుకుని వండాలి.
ఇక మనం చేయబోయే వంటకాలని ముందే ప్రణాళిక వేసుకుని, రుబ్బడమో , వేయించడమో, ఉడికించడమో, పొడి చేయడమో లాంటివి చేసుకుంటే సమయం వృథా కాదు.ఇక తెచ్చిన సరుకులను చక్కగా సర్దడానికి స్టోర్స్ మేనేజ్మెంట్ తెలిసుండాలి. వంట చేసాక అన్నింటినీ సర్దడం, ఆ తరువాత అంట్లగిన్నెలను శుభ్రపరచి, తుడిచి, యథాస్థానంలో సర్దడం కూడా అవసరమే.
అన్ని సమయాలలోనూ శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
అంతే కాదండోయ్! పాత, కొత్త డికాక్షన్, పాలు, కాఫీ పొడి, టీ పొడుల తేడా కూడా తెలిసుండాలి.
సమయాన్ని బట్టి చకచకా ఒకటి కన్నా ఎక్కువ బర్నర్ల పై వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్, అలాగే వండినవాటిని చక్కగా, ఆప్యాయంగా వడ్డించడం కూడా తెలిసుండాలి,
మిగిలిన దానిని ఖాళీ చేసి వేరే పాత్రలోకీసర్దుబాటు చేసే "స్పేస్ మేనేజ్మెంట్ " తెలుసుండాలి.
కుటుంబంలో వేరు వేరు వ్యక్తులు పిలిచే పిలుపులకు స్పందిస్తూ, అన్ని పనులూ సకాలంలో పూర్తి చేయగలిగే మల్టి టాస్కింగ్ సామర్థ్యం ఉండాలి.
ఒక చేత్తో చపాతీని పెనంపై వేస్తూ, మరొకటి పళ్లెంలో వడ్డిస్తూ, మధ్య మధ్య కుటుంబ సభ్యులు అడిగేవాటికి సమాధానాలు , సలహాలు ఇస్తూ సవ్యసాచి లాగా మేనేజ్ చేయడం తెలియాలి.
అలాగే అభ్యాగతులకు వంట చేయడం, ఉన్న వస్తువులతో బాగా వంట చేయడం కూడా తెలుసుకోవాలి.
వండినవాటిని చక్కగా అమరిస్తే, తినేవాళ్లకి కనువిందు కూడా కలిగిస్తుంది.వంటగది లో అనుకోకుండా కలిగే
చిన్నచిన్న గాయాలు, చురుకులకు చిట్కాలు తెలుసుకోవాలి. వాటిని ఓర్చుకునే సమయ స్ఫూర్తి, లోకజ్ఞానం ఉండాలి. వీటినన్నింటినీ తెలుసుకోడానికి మనం పెద్దలను పరిశీలిస్తే చాలు. దీనికని కోచింగ్ కేంద్రాలకి వెళ్లడం అందరికీ వీలు కాదు కదా.
అన్నింటికన్నా ముఖ్యమైనది వంట చేస్తున్నప్పుడు మనం చేసేది అందరికీ ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వాలి అందరూ ఇష్టపడి తినాలి అన్న భావంతో, మనసు పెట్టి వండాలి.
అందుకే మన పెద్దలంటారు " యద్భావం తద్భవతి" అని. అంటే మన భావాలకు తగ్గట్లే అన్నీ సమకూరుతాయన్నమాట.
చివరగా ఒక చిన్న మాట. దయచేసి వంటపనిని చిన్నతనంగా భావించకండి. "అన్నం పరబ్రహ్మ స్వరూపం". జానెడు పొట్టకోసమే అన్ని జీవులూ కష్టపడుతున్నాయి.
వంటపనిని చులకన చేయక, అది మనకి జీవనా ధారమని, 64 కళలలో అతి ముఖ్యమైనదని గ్రహించండి.
వంట బాగుంటే ఆరోగ్యం, దినచర్య, చేసే పనులు, ఆలోచనలు , బాంధవ్యాలు , అనుభూతులు అన్నీ బాగుంటాయి.కనుక వంట కళ ని అందరూ నేర్చుకుని ఆరోగ్యం గా ఉండాలని ఆశిస్తూ, "లోకా సమస్తాన్ సుఖినోభవంతు" '. అని ప్రసంగాన్ని ముగించింది సరళ.
ఆరోజు సాయంత్రమే రమేశ్ తల్లి సరళ తండ్రికి ఫోన్ చేసి, పెళ్లి తమకు సమ్మతమనీ, సరళ ప్రసంగం తమలోని అపోహని పోగొట్టిందని చెప్పింది.అంతదాకా నచ్చిన మంచి పెళ్లి సంబంధం ఉద్యోగం వల్ల తప్పిపోతుందేమోనని కలత చెందిన అందరి మనసులు సంతోషంతో బూరెల్లాగ ఉబ్బాయి.
డా. తిరుమల ఆముక్తమాల్యద