రాతి పువ్వు (కవిత)
BY Telugu Global23 April 2023 12:21 PM GMT
X
Telugu Global Updated On: 23 April 2023 12:21 PM GMT
వెతికే కొద్ది
విశ్లేషణకు అందని పరంపరలు
రూపాలేమిటో తెలియదు
అంతా అంతరంగ మధనమే..
దేహ పంజరం నిండా
అనియంత్రణలు
అనిర్వచనీయాలు
ముద్రాంకితాలు
సజీవ జీవన కళలు
తుడిపివేతలకు మాసిపోవని
మననాలై ముందు నిలుస్తాయి
అసంకల్పిత పరితపనలెందుకు?
అవి పూసేవి సహజాతాలనే..
నిట్టూర్పులకు సెలవిచ్చి
ప్రాణాన్ని చిక్కబట్టి
విముఖాల చూపులను
తప్పించుకుని
ప్రవాహ చారికలను ప్రస్తావిస్తూ
దీపాలు నగిషీలను
శిఖరాల ముంగిళ్లలో చెక్కాలి
కన్నీటి పేటికల్ని
రాసుకున్న వాక్యంలో
అనుభవాలుగా పేర్చాలి
ప్రతి రాపిడిలో
రాతిపువ్వుగా మారాలి
పోరాటంలో వెన్నెముకై మెరవాలి
సుదీర్ఘ నిరసనల్లోనూ
చైతన్య నినాదంగా ప్రభవించాలి
- డా. తిరునగరి శ్రీనివాస్
Next Story