పునాది రాళ్లు (కవిత)
నత్త గుల్లల్లా
ఆ తరం ఛాందసవాదులు ఊసరవెల్లుల్లా
ఈ తరం కుహనావాదులు
వాస్తవాల చక్రవ్యూహాలను
తెలుసుకోలేక
మడిగట్టుకొని మూలకు కూర్చున్నారు
సంఘ కట్టుబాట్లకు
సంస్కృతి సాంప్రదాయాలకు
వివాహవ్యవస్థలకు
కట్నకానుకలకు
వేషభాషలకు
కులగోత్రాల పట్టింపులకు
తామే సంరక్షకులమని
సమాజాన్ని శాసిస్తున్నారు
వీరి వ్యవహార శైలికి
మధ్యతరగతి మానవుడు
పిల్లలు చదువులకు
పెద్ద పెద్ద ఫీజులు కట్టలేక
కూతురి పెళ్లి వ్యవహారాల
ఖర్చుల కోసం అప్పులు చేయలేక
సాంప్రదాయ
కట్టుబాట్లను ఛేదించలేక
సమాజంలో గౌరవ స్థానాన్ని
పొందలేక
అయోమయంలో పడి తల్లడిల్లుతున్నాడు
కనీస కోరికలు తీర్చుకోలేక
దాసోహం అంటున్నాడు
ఇవన్నీ పై తరగతి వారికి ఉండవా?
పట్టించుకోరా!
కింది తరగతి వారికి
వీటి అవసరమే లేదు కదా !
ఎటొచ్చి వీరికేనా ఇలాంటి
ఇనుప చట్రాలబంధనాలు!
ఈ సమయంలో.......
స్వేచ్ఛా ప్రవర్తనకు
భావ స్వాతంత్ర్యానికి
విశృంఖల మూర్ఖత్వానికి
తిలోదకాలు ఇచ్చి
బంధనాల సంకెళ్లను తెంచుకొని
నూతన ప్రపంచంలోకి
అడుగుపెట్టింది
'ఆమె'..........
అంతే....
బరితెగించిందని నింద వేశారు
తమ నిరంకుశత్వానికి
ఎదురుదెబ్బ అని
సాంప్రదాయాలను మంట గలిపిందని మండిపడ్డారు
అయినా ఆమె వెరవలేదు
ఆమె తప్పించుకుంది
'మానసికక్షోభ' నుండి
ఆవరించిన శూన్యం నుండి బయటపడింది
అనంతసృష్టిలో మరో ప్రస్థానం వైపు
అజేయమైన మనోనిబ్బరంతో అడుగులేసింది
సమాజంలో నూతన చైతన్యం వెల్లివిరయడానికి
చరిత్ర తిరగరాయడానికి
'పునాదిరాళ్లు ' వేసింది
పునర్నర్మించే వ్యవస్థ కోసం
ఒక్కొక్క మెట్టు ఎక్కి
అందుకోమంటుంది
అమృత ఫలాలను
- డా.ప్యారక కృష్ణమాచారి (రూపాకృష్ణ)