Telugu Global
Arts & Literature

రక్త పరిమళం

రక్త పరిమళం
X

ఇది మామూలు వాసన కాదు

నెత్తుటి నెత్తావి.

ఇది రేజర్ కంపెనీ

తయారీ లోపం కావచ్చు,

నా పరధ్యానమూ కావచ్చు.

షేవింగ్ చేసుకుంటుంటే

పగిలిన గాటులోంచి

ఉరలిన ఎర్రటి అందమైన

పగడపు బిందువు.

దృశ్యం ఎప్పుడూ సగమే

చురుక్కుమనే మంట కనపడేది కాదు.

నున్నటి చర్మం కింద

లోపల అలజడి.

దేహం నిండా వ్యాపించిన

రుధిర నదులకు

కాస్త సందు దొరికినట్టైంది

అందరి రక్తం ఒకటే

ఎర్రెర్రని కాంతి సమన్వితమే

కాని సౌరభ్యంలోనే తేడా.

పరీక్ష కోసం ఏ ల్యాబ్‌కూ పంపించ లేదు

ఏ రిపోర్టునూ మీ ముందుంచటం లేదు.

మధుమేహం ఉందో లేదో తెలియదు గాని

మధురోహలు మాత్రం పిసాళిస్తున్నాయి.

ఎంత సువాసనండీ ఇది!

తరతరాల

ప్రేమ వాయువులు వీస్తున్నాయి.

ఏనాటిదో

ప్రాక్తన కాలం నాటి

ఆటవిక ఉష్ణకవోష్ణ జ్వలనం

స్పర్శను వేడెక్కిస్తున్నది.

దీనిలో

ఉన్న వాటి కన్న

లేనివే ఎక్కువ

ముఖ్యంగా చెడుస్వార్థం.

ద్వేషానికి నా రక్తంలో తావే లేదు.

జన్మ ధురీణ వాసనల సంగతి తర్వాత

కాని వాటిని చీలుస్తూ

ఒక తీక్ష్ణ సౌగంధ్య వీచిక

గుప్పుమంటున్నది,

ఇది మాత్రం తప్పకుండా నా కవిత్వమే.

- డా౹౹ ఎన్. గోపి

First Published:  10 March 2023 10:00 PM IST
Next Story