Telugu Global
Arts & Literature

వర్షం వికటిస్తే... (కవిత)

వర్షం వికటిస్తే... (కవిత)
X

వర్షం పడుతున్నపుడు

బాల్యం చినుకులై

నన్ను జ్ఞాపకాల జడిలో

నిలువునా తడిపేసేది !

తడుస్తూ గెంతులేస్తూ కూనలా

వానలో పరవశిస్తుంటే

అమ్మ కోపంగా అరుస్తూ

జలుబు చేస్తుందని

గొడుగైనా పట్టుకెళ్ళమని గదిమేది !

పాపం అమ్మకేం తెలుసు

జలుబొస్తుందనే ఆదుర్దా తప్ప

వాన చినుకులు ఆప్యాయంగా

ఒళ్ళంతా తడుముతుంటే

నేను పొందే పులకరింత !

ఆకాశం చాటునుండి

దివ్య పురుషులెవరో నాపై ప్రేమతో

చినుకుల తడి మల్లెల్ని

ప్రేమతో చల్లుతున్నట్లుండేది !

వాననీటి కాలువల్లో వదిలిన

తెల్ల కాగితప్పడవలు

ఏ గమ్యానికి చేరేవో ?

ఏ నేస్తాల్ని పలకరించేవో ?

వానలో వడగళ్ళు పడితే

రాత్రి మెరిసిన చుక్కలన్నీ

నేల రాలిన ముత్యాలుగా

ఏరుకుని దాచుకునే వాళ్ళం !

వర్షం ఆగకుండా కురిస్తే

కాలువలు నిండి ఏరులై నదులై

పొలాలను తడిపి ముద్దాడి

పచ్చని పైరులతో నేలమ్మకు

పసిడి పంట ఛాయాగంధాన్ని

పులమటం మరువగలమా ?

అందుకే బాల్యంలో వర్షమంటే

చెప్పలేని ఆనందం

చెరిగిపోని జ్ఞాపకం !

ఇప్పుడు వర్షమంటే వణుకు...

కాలానికి కబురైనా లేకుండా

కురిసే జోరువర్షాన్ని చూస్తే భయం !

నేటి అకాల వర్షాలు

ఆరుగాలం శ్రమించి

మట్టిని ముద్దాడి

చెమటతో చిత్తడి చేసి

అన్నదాతలు పండించిన పంటను

నోటికందిన అన్నం ముద్దను

మట్టి పాల్జేసే రాక్షస వానల్ని

చూస్తే ఎక్కడలేని భయం

తోడుగా ఎడతెరిపి లేని

ఈదురు గాలులతో

పండిన పంటల్ని చెట్లను

గుడిసెల్ని మనుషుల్నీ కబళిస్తూ

తుఫానులతో ఉప్పెనలతో బ్రతుకులను

బలితీసుకుంటున్న రక్కసి వర్షం!

పేద ధనిక తేడాలెరగని వర్షం

నగరాల్లో జనావాసాలు రోడ్లను

ముంచేస్తూ జనజీవనాన్ని కుదిపేస్తూ

నోర్లు తెరుచుకున్న డ్రైనేజీలు

అమాయక నిర్భాగ్యుల్ని మింగేస్తుంటే

చిన్ననాటి ఇష్టమైన వర్షాన్ని

చూస్తుంటే జడిసి పొతున్నా నేడు !

మనిషి స్వార్థానికి బలై

గాయపడ్డ ప్రకృతి ప్రకోపంతో

విలయతాండవం చేస్తున్నందుకు

సిగ్గుతో తలదించుకుని

మానవాళిని క్షమించమని

వర్షాన్ని అడగాలని ఉంది !

(అకాల వర్షానికి తల్లడిల్లిన

రైతన్నల అగచాట్లను చూసి )

-డా. కె. దివాకరా చారి

First Published:  7 July 2023 5:48 PM IST
Next Story