గోబెల్ వారసులు (కవిత)
అంతరంగం
పుచ్చిపోయిన వాళ్ళు
అలవోకగా
ఆత్మకు పాడెకట్టుకోవడం
వింతేమీ కాదు.
దీనంగా చేతులు చాచిన
గుండె గూటిలో
నిండుగా వెలిగించాల్సిన
దీపానికి బదులు
కొరివి మంటల్ని రగిలించగలరు.
ఒంటరి తీగెను అల్లల్లాడించడానికి
మంటల తుఫాన్లు సృష్టించగలరు.
గురి చూసి నాటే బాణానికి
గుండెను చూపడం తప్ప
మౌనంగా ఎలా ఆలపిస్తారు?
నెనరు కురవాల్సిన కుక్కపిల్ల మీద
తలా ఒక రాయి వెయ్యడానికి
'పిచ్చికుక్క' అనివాళ్ళు చేసే
ప్రచారం ముందు
గోబెల్స్ బతికి వుంటే -
'తాను దిగదుడుపే' అనుకొని
గుండె పగిలి చచ్చి వూర్కునేవాడు.
తేనె పూతలో దాక్కున్న కత్తిని
గుర్తు పట్టక పోవడం తప్పే.
వంచన
వాళ్ళ ఆయుధం అయినప్పుడు
మగతగా నిద్రలో జోగేవాడు
ఎంతటి మూల్యం
చెల్లించాల్సి వస్తుందో
అనుభవంలో కొస్తేగాని
తెలియదు.
స్నేహం కోసం
మృత్యువు పొలిమేరలోకి
అమరత్వాన్ని ఆహ్వానించిన
థామస్ పిథియన్ల కథ
మనకి తెలుసు
స్నేహంలో దైవాన్ని చూసిన
'దీవానే 'షమ్స్ తబ్రీజ్' రూమీ
అలౌకిక ఉన్మాద ప్రేమ కథా తెలుసు.
ఇప్పుడు తెలుసుకోవలసిందల్లా
మనుషుల రూపంలో
మృగాలు పొంచివుంటాయని
-డా॥ దిలావర్